గేమ్ ఛేంజర్.. లీకులతోనే కథంతా రివీల్ చేస్తున్నారుగా!
గేమ్ ఛేంజర్ తాజా షెడ్యూల్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం బీచ్ లో ఔట్ డోర్ సెట్ వేసి.. రామ్ చరణ్, కియార, ఎస్.జే సూర్య, నవీన్ చంద్రలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ "గేమ్ ఛేంజర్". ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. మూడేళ్ళుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ మాత్రమే వచ్చింది. అయితే ఎప్పటికప్పుడు సెట్స్ నుంచి లీక్ అవుతున్న ఫోటోలు, వీడియోలు ఈ సినిమాలోని కీలకమైన అంశాలను ఒక్కటొక్కటిగా రివీల్ చేస్తున్నాయి.
డైరెక్టర్ శంకర్ తన సినిమాలకు సంబంధించిన కంటెంట్ విషయంలో ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటారు. థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఎలాంటి విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త వహిస్తారు. కానీ 'గేమ్ ఛేంజర్' దగ్గరకు వచ్చే సరికి అలా జరగడం లేదు. మూవీ సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుంచి ఏదొక అంశం లీక్ అవుతుతూనే వుంది. దీనిపై మేకర్స్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఫలితం లేకుండా పోయింది. లీకులకు ఏమాత్రం బ్రేకులు పడలేదు.
ముందుగా 'గేమ్ ఛేంజర్' చిత్రంలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారనే విషయంతో పాటుగా, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి అప్పన్న లుక్ సోషల్ మీడియాలో లీకైంది. ఆ తర్వాత చెర్రీ ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ గా కనిపించనున్నారనే సంగతి బయటకు వచ్చింది. ఇదే క్రమంలో 'జరగండి' అనే ఫుల్ సాంగ్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు లేటెస్టుగా చరణ్ మరో లుక్ తో పాటుగా.. ప్రధాన పాత్రధారుల గెటప్స్ బయటకు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా కథా నేపథ్యం ఏంటనే దానిపై ప్రేక్షకుల్లో ఓ అవగాహన ఏర్పడేలా చేశాయి.
'గేమ్ ఛేంజర్' తాజా షెడ్యూల్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం బీచ్ లో ఔట్ డోర్ సెట్ వేసి.. రామ్ చరణ్, కియార, ఎస్.జే సూర్య, నవీన్ చంద్రలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షూటింగ్ లో భాగంగా ఓ పొలిటికల్ పార్టీ పబ్లిక్ మీటింగ్ జరుగుతుండగా.. కొందరు రాజకీయ నాయకులు వేదికపై కూర్చొని ఉంటే, వాళ్ళ వెనుక చరణ్ నిలబడి ఉన్నారు.
ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ లాంగ్ హెయిర్ గడ్డంతో స్టైలిష్ గా కనిపిస్తే.. ఇక్కడ మాత్రం క్లీన్ షేవ్ చేసుకుని, నీట్ గా టక్ చేసుకొని ఉన్నారు. దీన్ని బట్టి అతనొక ప్రభుత్వాధికారి అని స్పష్టం అవుతోంది. అలానే కియారా చీర కట్టులో హుందాగా కనిపిస్తోంది. రాజకీయ నాయకులుగా ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపిస్తున్నారు. సినిమాలో వీళ్ళు ముగ్గురే మెయిన్ విలన్స్ అయ్యుండొచ్చనే అంచనాకి వస్తున్నారు. ఈ క్రమంలో ఇదే మెయిన్ ఫ్లాట్ అంటూ రకరకాల కథలు అల్లేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న స్టోరీల ప్రకారం, ఫ్లాష్ బ్యాక్ లో ఒక సామాన్యుడైన అప్పన్న ప్రజా శ్రేయస్సు కోసం రాజకీయ పార్టీ స్థాపిస్తాడు. అతని నమ్మిన బంటు శ్రీకాంత్ వెన్నుపోటు పొడిచి పార్టీని హస్తగతం చేసుకుంటాడు. ప్రస్తుతంలో ఆయన వారసుడు అవినీతి పరుడైన ఎస్.జె సూర్య పార్టీ పగ్గాలు చేపట్టి అధికారంలోకి వస్తాడు. అదే ప్రభుత్వంలో అధికారిగా పనిచేస్తున్న అప్పన్న కొడుకు రామ్ వారి ఆట ఎలా కట్టిస్తాడు అనేదే 'గేమ్ ఛేంజర్' మెయిన్ స్టోరీ అని, ఇది శంకర్ మార్క్ స్క్రీన్ ప్లేతో సాగుతుందని అంటున్నారు.
'గేమ్ ఛేంజర్' మెయిన్ పాయింట్ ఇదేనా కాదా అనేది పక్కన పెడితే.. ఈ లీకుల కారణంగా ఇన్నాళ్లూ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డ రామ్ చరణ్ సెకండ్ లుక్ రివీల్ అయింది. అలానే ప్రధాన పాత్రలు పోషిస్తున్న కీయారా అద్వానీ, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్రల పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా బయటకి వచ్చాయి. దీని వల్ల జనాల్లో ఎగ్జైట్ మెంట్ తగ్గిపోయే అవకాశం ఉంది. అందులోనూ విడుదలకి ఇంకా చాలా టైం వుంది. ఈ గ్యాప్ లో మరో కంటెంట్ బయటకి రాకుండా మేకర్స్ జాగ్రత్త వహిస్తారేమో చూడాలి.
'గేమ్ ఛేంజర్' చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు స్టోరీ లైన్ అందించారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో అంజలి, జయరాం, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న దీనిపై స్పష్టత రానుంది.