'పుష్ప 2'.. గంగమ్మ తల్లి జాతర కథేంటో తెలుసా?
ఇప్పుడు చిత్ర యూనిట్ సైతం ఈ సీక్వెన్స్ హైలైట్ అవుతుందని చెబుతూ వస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప 2: ది రూల్". 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ గా వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో గంగమ్మ జాతర ఎపిసోడ్ ప్రత్యేకంగా నిలబోతోందని ఫస్ట్ లుక్, టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు చిత్ర యూనిట్ సైతం ఈ సీక్వెన్స్ హైలైట్ అవుతుందని చెబుతూ వస్తున్నారు. ఇంత హైప్ ఎక్కిస్తున్న గంగమ్మ జాతర కథేంటి? ఎలా జరుగుతుంది? బన్నీ టెరిఫిక్ లుక్ కి ప్రేరేపించిన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
'పుష్ప 2: ది రూల్' ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ ని చూసి యావత్ సినీ అభిమానులు షాక్ అయ్యారు. ఎందుకంటే బన్నీ పట్టు చీర ధరించి, ముక్కుకు ముక్కెర, చెవిపోగులు పెట్టుకొని.. కంకణాలు, నెక్లెస్‌లు ధరించి.. కాళ్ళూ చేతులకు పారాణి పెట్టుకొని, నీలిరంగు బాడీ పెయింట్‌తో నిమ్మకాయల దండతో అలంకరించబడి సరికొత్త అవతార్ లో కనిపించారు. స్టైలిష్ స్టార్ ఇలాంటి లుక్ లో కనిపించడాన్ని ఎవరూ ఊహించలేదు. అయితే సినిమాలో పుష్పరాజ్ పాత్రకు గంగమ్మ తల్లికి నివాళిగా ఈ సీన్ చేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో గంగమ్మ దేవతను పూజిస్తుంటారు. ప్రతీ ఏడాది వైభవంగా జాతర నిర్వహిస్తుంటారు. దీన్ని కొన్నిచోట్ల తిరునాళ్ళ అని కూడా పిలుస్తుంటారు. రాయలసీమ జిల్లాలలో ప్రతి సంవత్సరం మే మొదటి రెండవ వారాల మధ్య గంగమ్మ జాతరను ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు. చిత్తూరు ప్రాంతంలో జరిగే తిరునాళ్లలో తిరుపతి గంగమ్మ తల్లి ఉత్సవాలు చెప్పుకోదగ్గది. తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ, వారి జీవన విధానాలనూ ప్రతిబింబించేలా అత్యంత వైభవంగా ఈ జాతరను నిర్వహిస్తారు.
ఏటా తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఈ జాతర జరుగుతుంది. ఎనిమిది రోజులపాటు వైభవంగా జరిగే ఈ జాతరకు, రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. హిందూ పురాణాల ప్రకారం, తిరుమల వెంకటేశ్వర స్వామికి ఈ గంగమ్మ తల్లి చెల్లెలని ప్రతీతి. అందుకే ప్రతీ సంవత్సరం జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు పుట్టింటి సారెను అందజేస్తారు.
జాతర నాలుగో రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు అర్చకులు కలిసి పసుపు కుంకుమలూ, శేషవస్త్రాలూ గంప, చేట వంటి వాటిని మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో తీసుకొచ్చి, పుట్టింటి సారెగా గంగమ్మకు అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసినవారు ఇప్పటికీ అదే విధంగా గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటుంటారు.
గంగమ్మ తల్లి జాతరలో ముందుగా భైరాగి వేషం అనే ఆచారం జరుగుతుంది. ఆ రోజున భక్తులు తెల్లటి విభూదిని శరీరానికి పూసుకుని, రెల్ల కాయలతో చేసిన దండను మెడలో ధరిస్తారు. వేప ఆకులను చేతుల్లో పెట్టుకుని, నడుముకు ఆకులు కట్టుకుని అమ్మవారికి పూజలు చేస్తారు. మరుసటి రోజు కుంకుమ పూసుకుని, తలపై రిబ్బన్లు కట్టుకుని పూజలు చేసే బండ వేషం అనే ఆచారాన్ని నిర్వహిస్తారు. తర్వాతి రోజు భక్తులు శరీరాలకు బొగ్గు రాసుకొని, వేప మాలలు ధరించి తోటి వేషాన్ని అనుసరిస్తారు.
ఇదే క్రమంలో దొర వేషం కోసం భక్తులు గంధం పూసుకొని, వేప ఆకులు, నిమ్మకాయల దండలను మెడలో ధరిస్తారు. మరుసటి రోజు గంగమ్మను సూచించే మాతంగి వేషం ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు గంగమ్మకు భక్తులు చీరలు సమర్పించి, పొంగళ్లు పెట్టుకోవడంతో ఉత్సవాలు ముగుస్తాయి. జాతర ముగిసిన దానికి గుర్తుగా, భక్తులు అదే రోజు అర్ధరాత్రి ఒక మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి, చెంప తొలగింపు అనే ఆచారాన్ని నిర్వహిస్తారు. ఇప్పుడు "పుష్ప 2" చిత్రంలో ఈ గంగమ్మ జాతర ఉత్సవం కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.
'పుష్ప' సినిమా కథ చిత్తూరు, శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందనే సంగతి తెలిసిందే. 'పుష్ప: ది రైజ్' మూవీలో "గంగమ్మ తల్లి జాతర.. కోళ్ళు పొట్టేళ్ల కోతారా.. కత్తికి నెత్తుటి పూతరా.. దేవతకైనా తప్పదు ఎర" అంటూ సాగే పాటలోనే ఈ జాతర గురించి ప్రస్తావించారు. 'పుష్ప 2'లో 15 - 18 నిమిషాల పాటు ఉండే ఈ జాతర ఎపిసోడ్ ఉంటుదని సమాచారం. ఇది ఒక మాస్టర్ పీస్ అని, గూస్ బమ్స్ వస్తాయని ఇటీవల మేకర్స్ తెలిపారు. 35 రోజుల పాటు తీసిన ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం దాదాపు ₹60 కోట్లు ఖర్చు చేశారట. దీని కోసం 15-20 రోజులు రిహాసల్స్ చేయగా.. అదనంగా మరో 14 కోట్లు ఖర్చు అయినట్లుగా తెలుస్తోంది. మరి టీమ్ ఇంత కష్టపడి చేసిన ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే, డిసెంబర్ 5వ తేదీ వరకూ వెయిట్ చేయాల్సిందే.