టాక్ ఆఫ్ ది మూవీ: భావోద్వేగాల స్పోర్ట్స్ డ్రామా

ఝూమ‌ర్ క‌థాంశం ఆస‌క్తిక‌రం. ట్యాలెంటెడ్ క్రికెటర్‌గా క‌నిపించిన సయామి అనూహ్యంగా ఒక పెను ప్రమాదానికి గుర‌వుతుంది.

Update: 2023-08-22 16:25 GMT

అభిషేక్ బచ్చన్, స‌యామీ ఖేర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆర్.బాల్కీ తెర‌కెక్కించిన 'ఘూమర్' ఓటీటీలో స్ట్రీమింగు అవుతోంది. స్మాల్ బి అభిషేక్ చాలా కాలం త‌ర్వాత ఈ సినిమాతో ఆశించిన‌ది సాధించాడు. న‌టుడిగా అత‌డికి గుర్తింపు తెచ్చిన ప్ర‌య‌త్న‌మిది. ఝూమ‌ర్ క‌థాంశం ఎంతో ఆస‌క్తిక‌రం. ఒక‌ వికలాంగ మహిళ తన అడ్డంకులను అధిగమించి క్రికెట్ ప్లేయర్‌గా ఎలా విజయం సాధించింది? అన్న‌దే ఈ సినిమా. విక‌లాంగురాలి(స‌యామీ) విజ‌యానికి సహాయపడే క్రికెట్ కోచ్ (మాజీ క్రికెట‌ర్‌)గా అభిషేక్ బ‌చ్చ‌న్ న‌టించాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌లను టీమిండియా క్రికెటర్స్ గతంలో విడుదల చేశారు. వాటికి వీక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ట్రైల‌ర్ తో కంటెంట్ ఉన్న సినిమా ఇద‌ని అర్థ‌మైంది.

ఝూమ‌ర్ క‌థాంశం ఆస‌క్తిక‌రం. ట్యాలెంటెడ్ క్రికెటర్‌గా క‌నిపించిన సయామి అనూహ్యంగా ఒక పెను ప్రమాదానికి గుర‌వుతుంది. ఈ ప్ర‌మాదంలో ఆమె ఒక చేయిని కోల్పోతుంది. త‌న‌ ఆశయాలు చిన్నాభిన్నం అవుతాయి. తీవ్ర నిరాశ‌కు గురై డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయి క్రికెట్ ని విడిచిపెడుతుంది. అటుపై రంగంలోకి దిగిన కోచ్ అభిషేక్ బ‌చ్చ‌న్ (విఫ‌ల‌మైన మాజీ క్రికెట‌ర్‌) ఆమెకు ఎలాంటి స‌హాయం చేశాడ‌న్న‌ది తెర‌పైనే చూడాలి. బ‌చ్చన్ ఒక క్రికెట్ కోచ్‌ని ఆమె మెంటర్‌గా చూడాలని త‌న‌కు నూరిపోస్తాడు.

జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఒక కోచ్ ఒక చేతిని కోల్పోయిన యువ‌తి తన ఎడమ చేతిని మాత్రమే ఉపయోగించి క్రికెట్ ప్రాక్టీస్ చేయడంలో ఆమెకు సహాయం చేస్తాడు. తద్వారా ఆ యువ‌తి క్రికెట్ ఆట‌ను కొనసాగిస్తుంది. ఈ చిత్రంలో, షబానా అజ్మీ సయామి తల్లిగా నటించగా, అంగద్ బేడీ ప్రియుడిగా న‌టించాడు. మోటివేషనల్ స్పోర్ట్స్ డ్రామా ఇది.

అభిషేక్ బచ్చన్‌కి మంచి స్క్రిప్ట్‌లు దొరకడం లేదు.. కానీ మంచి స్క్రిప్ట్‌లు అతనిని వెతుక్కుంటూ వస్తున్నాయి!! అన‌డానికి ఈ సినిమా నిద‌ర్శ‌నం. వికలాంగ అథ్లెట్ల విజయాలను సెలబ్రేట్ చేసుకునే స్పోర్ట్స్ డ్రామా క‌థ‌ను ఉద్వేగాల స‌మాహారంగా ఆర్.బాల్కీ తెర‌కెక్కించిన తీరు ఆస‌క్తిక‌రం. అభిషేక్ -సయామితో పాటు, షబానా అజ్మీ- అంగద్ బేడీ న‌ట‌న పండింది. అమితాబ్ బచ్చన్, బిషన్ సింగ్ బేడీ ఇద్దరూ ఈ సినిమాలో అతిధి పాత్రలు పోషించారు. హోప్ ఫిల్మ్ మేకర్స్, సరస్వతి ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక వినోదభరితమైన 'చుప్' తర్వాత బాల్కీకి ఇది చ‌క్క‌ని సినిమా. ఈసారి స్పోర్ట్స్ డ్రామాతో ఆశించిన‌ది ద‌క్కించుకున్నాడు. చక్ దే ఇండియా- స‌హా ప‌లు స్పోర్ట్స్ డ్రామాలు ఎంతో ఉత్కంఠ క‌లిగించాయి. అయితే బాల్కీ ప్రీ-క్లైమాక్స్‌లో ఒక అద్భుత‌ ట్విస్ట్ ను ప్రదర్శించిన విధానం .. సినిమాలో లోతైన విష‌యాల‌ను ఎలివేట్ చేసిన వైనం ఎంతో ఆక‌ట్టుకుంటుంది. బాల్కీ రచనా సామర్ధ్యం గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

క‌థానాయిక‌ అనినా ఒంటి చేత్తో ఎలా బౌలింగ్ చేయగలదనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఎవరికీ క‌ల‌గదు.. అంత ప్ర‌భావ‌వంతంగా ఆ పాత్ర‌ను తీర్చిదిద్దాడు. బాల్కీ స్క్రీన్‌ప్లేకి అంద‌రూ లీన‌మైపోవాల్సిందే. ద‌ర్శ‌క‌త్వం అసాధార‌ణం. ముఖ్యంగా స‌యామీ ప్రమాద సన్నివేశం నుండి స్టోరి ర‌క్తి క‌డుతుంది. శిక్ష‌ణ మొద‌ల‌య్యాక ఉద్వేగ‌భ‌రిత‌మైన స‌న్నివేశాలు ర‌క్తి క‌ట్టిస్తాయి. సయామీ ఖేర్ అనినాగా అద్భుతంగా న‌టించింది. ఆమె పాత్ర విశ్వాసం దుర్బలత్వాన్ని ఉద్విగ్న‌భ‌రితంగా తెర‌పై చూస్తాం. శిక్షణా ఎపిసోడ్‌లలో స‌యామీ నటన చాలా గంభీరంగా అనిపిస్తుంది. అభిషేక్ బచ్చన్ పాడి పాత్రలో అద్భుతంగా నటించాడు. ఈ పాత్ర బ‌చ్చ‌న్ జీ ఫిల్మోగ్రఫీలో ఒక మరపురాని పాత్ర అన‌డంలో సందేహం లేదు. విశాల్ సిన్హా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అమిత్ త్రివేది అందించిన సంగీతం బాగుంది. స్టో నేరేష‌న్ కొంత ఇబ్బందిక‌రం అయినా కానీ భావోద్వేగాల‌తో రంజింప‌జేసే చిత్ర‌మిది.

Tags:    

Similar News