బ్యాడ్ ల‌క్: మంచి టాక్ వ‌చ్చి ఫెయిలైన సినిమా

ఇంత‌కాలానికి గ్లాడియేట‌ర్ 2 తెర‌కెక్కి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సానుకూల స్పందనను అందుకుంది.

Update: 2024-11-17 16:26 GMT

దాదాపు 20 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత ఒక సినిమాకు సీక్వెల్ తీయాల‌నే ఆలోచ‌నే ఒక సాహ‌సం. కానీ అలాంటి సాహ‌సం చేసారు గ్లాడియేట‌ర్ మేక‌ర్స్. నాడు ర‌సెల్ క్రో లాంటి ప్ర‌తిభావంతుడైన స్టార్ న‌టించిన గ్లాడియేట‌ర్ విజువ‌ల్ ఫీస్ట్ గా నిలిచింది. బానిస‌త్వం, వారియ‌ర్ డ్రామా నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ రికార్డులు తిర‌గ‌రాయ‌డ‌మే గాక‌, ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఆస్కార్ లు గెలుచుకుంది. భ‌విష్య‌త్ లో చ‌రిత్ర నేప‌థ్యంలో చాలా సినిమాల నిర్మాణానికి పునాదిగా నిలిచిన సినిమా గ్లాడియేట‌ర్.

అందుకే ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కుతోంది అన‌గానే అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఇంత‌కాలానికి గ్లాడియేట‌ర్ 2 తెర‌కెక్కి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సానుకూల స్పందనను అందుకుంది. కానీ బాక్సాఫీస్ వ‌సూళ్ల ప‌రంగా చూస్తే ఆశించిన స్థాయి క‌నిపించ‌లేద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఈ సినిమా భార‌త‌దేశంలో ఆశించిన ఓపెనింగులు తేవ‌డంలో విఫ‌ల‌మైంది. ఇది కేవలం రూ. మొదటి రోజు 45 లక్షలు మాత్ర‌మే వ‌సూలు చేయ‌డం పంపిణీ వ‌ర్గాల్లో నిరాశ‌ను మిగిల్చింది. తొలి మూడు రోజుల్లో 1.70 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. వయాకామ్- పారామౌంట్ కి ఇది పెద్ద నిరాశ‌. గ‌తంలో స్క్రీమ్ , ట్రాన్స్‌ఫార్మర్స్ సీక్వెల్‌లతో ఆశించిన వసూళ్లు ద‌క్కినా కానీ, గ్లాడియేట‌ర్ 2 జ‌నాల‌ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక‌పోయింది. విజువ‌ల్‌గా అత్య‌ద్భుతంగా తెర‌కెక్కినా కానీ, గ్లాడియేట‌ర్ 2 మ్యాజిక్ చేయ‌లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇటీవ‌ల 'డెడ్‌పూల్ & వుల్వరైన్' చిత్రం మాత్ర‌మే మొదటి రోజు దాదాపు 20 కోట్లు వ‌సూలు చేసిన హాలీవుడ్ చిత్రం. దీంతో మార్వెల్ లేదా DC నుంచి వ‌చ్చే సినిమాలు మాత్ర‌మే ఇంత పెద్ద వ‌సూళ్ల‌ను సాధించ‌గ‌ల‌వ‌ని నిరూప‌ణ అయింది. కానీ స్టాండార్డ్స్ లో పెద్ద స్థాయిలో తెర‌కెక్కి ఇప్పుడు గ్లాడియేట‌ర్ 2 భార‌తీయ మార్కెట్లో విఫ‌లం కావ‌డం షాకిచ్చింది. బ్యాన‌ర్ విలువ‌.. ఫ్రాంఛైజీ విలువ‌ను భార‌త‌దేశంలో ఆయా కంపెనీలు ప్ర‌చారం చేయ‌డంలో త‌డ‌బ‌డ‌టం.. ప్రాంతీయ భాష‌ల స్థాయికి దిగి వ‌చ్చి లోక‌ల్ గా ఇక్క‌డ‌ ప్ర‌చారం స‌రిగా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా గ్లాడియేట‌ర్ 2 ఫెయిలైంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో హాలీవుడ్ నుంచి మంచి కంటెంట్ తో వ‌చ్చి ఫెయిలైన చిత్రంగా ఇది నిలిచింది.

Tags:    

Similar News