గోపిచంద్.. మరోసారి ప్రభాస్ అండతో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 10 ఏళ్ళుగా సక్సెస్ లేక సతమతమవుతున్న హీరోలలో గోపీచంద్ ఒకరు.

Update: 2024-08-22 21:30 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 10 ఏళ్ళుగా సక్సెస్ లేక సతమతమవుతున్న హీరోలలో గోపీచంద్ ఒకరు. అప్పుడెప్పుడో 2014లో లౌక్యం అనే సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ అందుకున్న గోపీచంద్ ఆ తర్వాత మరో 10 సినిమాలు చేశాడు. అయితే అందులో ఏది కూడా బాక్సాఫీస్ వద్ద సరైన రేంజ్ లో అయితే సక్సెస్ కాలేదు. అందుకు కారణం, గోపీచంద్ రెగ్యులర్ కమర్షియల్ కథలనే ఎక్కువగా టచ్ చేస్తున్నాడు.

గోపీచంద్ కూడా మిగతా యువహీరోల తరహాలో కొత్తగా ప్రయోగాలు చేస్తే గానే ఆడియన్స్ ఫోకస్ ఎక్కువగా పడదు అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. ఇక గోపీచంద్ కు ఒకప్పుడు మాస్ ఆడియెన్స్ లో అయితే మంచి క్రేజ్ ఉండేది. కానీ క్రమం క్రమంగా ఆ క్రేజ్ తగ్గుతూ వస్తుంది. అతని మార్కెట్ పై కూడా వరుస ఫెయిల్యూర్స్ ప్రభావం చూపిస్తున్నాయి.

ఇక ప్రస్తుతం అయితే ఈ యువ హీరో విశ్వాసం అనే సినిమా చేస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీచంద్ కు మాత్రమే కాకుండా శ్రీనువైట్లకు కూడా ఈ సినిమా హిట్టవడం చాలా ముఖ్యం. ఆయన కూడా గత కొంతకాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇక గోపీచంద్ కు ఇప్పుడు మరోసారి ప్రభాస్ సపోర్ట్ తో కొత్త ప్రాజెక్టు లభించినట్లుగా తెలుస్తోంది.

ప్రభాస్ తన స్నేహితులతో UV క్రియేషన్స్ సంస్థను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యక్షంగా అందులో ప్రభాస్ ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ బ్యాగ్రౌండ్ లో మాత్రం అతని నిర్ణయాల మేరకే కొన్నిసార్లు సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఇక గతంలో ప్రభాస్ సలహా మేరకే గోపిచంద్ తో జిల్ సినిమాను నిర్మించారు. అయితే ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది.

ఆ తర్వాత మళ్లీ UV క్రియేషన్స్ లోనే గోపీచంద్ పక్కా కమర్షియల్ అనే సినిమా చేశాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు మరోసారి ప్రభాస్ టీమ్ గోపీచంద్ తో కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకు రావడానికి సిద్ధమవుతోంది. అది కూడా జిల్, రాధేశ్యామ్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీచంద్ మూవీ ఉంటుందట.

రాధేశ్యామ్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ కూడా ప్రభాస్ మాత్రం అతని వర్క్ ను మెచ్చుకున్నాడు. కాబట్టి మరోసారి అతనికి అవకాశం ఇవ్వడానికి ప్రభాస్ కూడా సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక గోపీచంద్ కు రాధాకృష్ణకు ఒకేసారి ఛాన్స్ ఇస్తున్న యూవీ హై వోల్టేజ్ యాక్షన్ మూవీని నిర్మించనున్నట్లు సమాచారం. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ ను ఈ ఇద్దరు ఎంతవరకు యూజ్ చేసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News