గుంటూరు కారం ఫేక్ రేటింగ్.. సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు కంప్లైంట్‌

అయితే గుంటూరు కారం టీమ్ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. తమ మూవీ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశ్యంతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Update: 2024-01-15 04:48 GMT

అతడు, ఖలేజా సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ మూవీకి కొందరు పాజిటివ్ టాక్ అందించగా.. మరికొందరు మిక్స్ డ్ రివ్యూలు ఇచ్చారు. మహేశ్ ఫ్యాన్స్ మాత్రం.. తమ అభిమాన హీరోను ఫుల్ మాస్ రోల్ లో చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే గుంటూరు కారం టీమ్ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. తమ మూవీ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశ్యంతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టికెట్స్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో తమ మూవీకి 0 లేదా, 1 రేటింగు వ‌చ్చేలా దాదాపు 70 వేల మందితో ఫేక్ ఓటింగ్ వేయించార‌ని ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొంది.

ఈ విషయంపై విచారణ జరపించాలని, తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. విచారణ తర్వాత తమకు న్యాయం జరుగుతుందని మూవీ టీమ్ ఆశిస్తోంది. మరోవైపు, ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్ కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ BookMyShowకి లీగల్ నోటీసులు పంపడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫేక్ ఓట్లు ఎవరు వేయించారో ఆరా తీయాల‌ని బుక్ మై షో నిర్వాహకుల్ని కోరనున్నట్లు తెలుస్తోంది.

బుక్ మై షో రేటింగుల‌పై ప్రేక్ష‌కుల‌కు మంచి అభిప్రాయం ఉంది. సినిమా కోసం టికెట్ బుక్ చేసే ముందు ఆడియన్స్ ఇచ్చే రివ్యూలను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొంటుంటారు సినీ అభిమానులు. ఆ రేటింగుల్ని కూడా ప్ర‌భావితం చేస్తున్నార‌న్న‌ర‌ని గుంటూరు కారం టీమ్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎంటర్‌టైన్‌మెంట్ కమ్యూనిటీలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

గుంటూరు కారం రెండు రోజుల్లోనే రూ. 98 కోట్ల గ్రాస్‌ను రూ. 60 కోట్ల‌కుపైగా షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఓవర్సీస్ లో మూడు రోజుల్లోనే రెండు మిలియ‌న్ల మార్క్‌ను అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. వ‌రుస‌గా ఐదు సార్లు ఈ రికార్డును అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా మ‌హేశ్ బాబు కొత్త రికార్డు క్రియేట్ చేశారు.

ఇక ఆదివారం కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప‌దిహేను కోట్ల రూపాయల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు రూ.130 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ తో గుంటూరు కారం మూవీ రిలీజైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకో యాభై కోట్ల‌కుపైనే క‌లెక్ష‌న్స్ రావాల్సి ఉంది.

Tags:    

Similar News