35 ల‌క్ష‌ల‌కు ఆరోగ్య బీమా క్లెయిమ్ చేసిన సైఫ్ ఖాన్

అయితే దీనిపై క‌రోనా క్రైసిస్ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు మ‌రింత లోతైన అవ‌గాహ‌న వ‌చ్చింది.

Update: 2025-01-19 05:25 GMT

ఆరోగ్య బీమా అనేది నేటి కాలంలో ప్ర‌తి ఒక్క‌రికి త‌ప్ప‌నిస‌రి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.కోటి వ‌ర‌కూ క్లెయిమ్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌డం ఒక వ‌రం అని చెప్పాలి. అక‌స్మాత్తుగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ల‌క్ష‌ల్లో ఆస్ప‌త్రికి చెల్లించాల్సి వ‌స్తే, అప్పుకోసం ప‌రిగెత్తాల్సిన అవ‌స‌రం లేకుండా ఆరోగ్య భీమా స‌హ‌క‌రిస్తోంది. అయితే దీనిపై క‌రోనా క్రైసిస్ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు మ‌రింత లోతైన అవ‌గాహ‌న వ‌చ్చింది. క‌రోనా స‌మ‌యంలో వైర‌స్ భారి నుంచి చాలామంది ప్ర‌జ‌ల్ని కాపాడింది కేవ‌లం ఆరోగ్య భీమా (హెల్త్ ఇన్సూరెన్స్) మాత్ర‌మే.

ఇప్పుడు అదే ఆరోగ్య భీమా న‌టుడు సైఫ్ అలీఖాన్ కి ఎంతగానో ఉప‌క‌రిస్తోంది. గురువారం బాంద్రా వెస్ట్ నివాసంలో జరిగిన ఆక‌స్మిక‌ కత్తి దాడి తర్వాత సైఫ్ అలీ ఖాన్ శ‌రీరంలో ఆరు క‌త్తి పోట్ల‌ను ఎదుర్కొని, ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. అత్యవసర శస్త్రచికిత్స తర్వాత సైఫ్ ప్ర‌మాదం నుండి బయటపడ్డాడు. కానీ అత‌డు ఇంకా పరిశీలనలో ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు. అయితే సైఫ్ ఆస్ప‌త్రిలో చేరాక అత‌డికి ఎంత మొత్తం ఖ‌ర్చ‌యింది? ఆ డ‌బ్బును సైఫ్ కుటుంబం చెల్లించిందా లేక అత‌డికి భీమా ఉందా? అని ఆరాలు తీస్తే.. అస‌లు విష‌యం తెలిసింది. కోట్లాది రూపాయ‌ల పారితోషికాలు అందుకుంటున్నా సైఫ్ ఖాన్ కి ఆరోగ్య బీమా ఉంద‌ని, దానిని క్లెయిమ్ చేసుకున్నార‌ని తెలుస్తోంది.

సైఫ్ ఒక ప్ర‌యివేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారుడు. తన చికిత్స కోసం రూ. 35.95 లక్షలు క్లెయిమ్ చేసినట్లు తెలుస్తోంది. బీమా సంస్థ ఇప్పటికే రూ. 25 లక్షలను ఆమోదించింది. ఈ పత్రం సభ్యుని ఐడి, రోగ నిర్ధారణ, ఆస్ప‌త్రి గ‌దికి అయిన ఖ‌ర్చులు, ఐసీయు ఖ‌ర్చులు, మెడిసిన్ త‌దిత‌రాల‌ను క‌వ‌ర్ చేస్తుంది. సైఫ్‌ జనవరి 21న డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంద‌ని కూడా ఈ హెల్త్ పాల‌సీ వివ‌రాల‌తో పాటు లీకైంది.

సైఫ్ ఖాన్ ఆసుపత్రిలో చేరిన తర్వాత నగదు రహిత ముందస్తు అనుమతి అభ్యర్థన అందింద‌ని స‌దరు ప్ర‌యివేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వివ‌రాల్ని లీక్ చేసింది. వైద్యులు శ‌స్త్ర చికిత్స ప్రారంభించడానికి మేము ప్రారంభ మొత్తాన్ని ఆమోదించామని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వెల్ల‌డించింది. చికిత్స తర్వాత తుది బిల్లులు మాకు అదుతాయి. పాలసీ నిబంధనలు, షరతుల ప్రకారం ప్రతిదీ అంద‌జేస్తామ‌ని సంస్థ తెలిపింది. అయితే లీక్ అయిన ఆరోగ్య బీమా వివరాలను సైఫ్ అలీ ఖాన్ కానీ, అత‌డి కుటుంబ స‌భ్యులు కానీ బహిరంగంగా ప్రస్తావించలేదు.

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి ని దాదాపు 70 గంట‌ల వేట త‌ర్వాత పోలీసులు ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్నారు. అత‌డు ఝార్ఖండ్ లోని ఓ రైల్వే స్టేష‌న్ లో రైల్వే పోలీసుల‌కు చిక్కాడు. అత‌డిని ప్ర‌స్తుతం క్రైమ్ బ్రాంచీ పోలీసులు ముంబైకి తీసుకుని వ‌స్తున్నారు.

Tags:    

Similar News