క్రేజ్ ను సరిగ్గా వాడుకుంటున్న హీరో.. అతనొక్కడే!

దీంతో ఒకప్పుడు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేసే హీరోలు.. ఇప్పుడు మూడు నాలుగేళ్లు బిగ్ స్క్రీన్ మీద కనిపించట్లేదు.

Update: 2024-03-15 03:49 GMT

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత సౌత్ హీరోలు నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ, అన్ని భాషల్లోనూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. కాకపోతే ఆ క్రేజ్ ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. పాన్ ఇండియా పుణ్యమాని సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు కానీ, వెంట వెంటనే వాటిని సెట్స్ మీదకు తీసుకురాలేకపోతున్నారు.. సినిమా షూటింగ్స్ పూర్తి చేయలేకపోతున్నారు. దీంతో ఒకప్పుడు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేసే హీరోలు.. ఇప్పుడు మూడు నాలుగేళ్లు బిగ్ స్క్రీన్ మీద కనిపించట్లేదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ను తీసుకుంటే.. అయన్నుంచి గత ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క సినిమా మాత్రమే వచ్చింది. అది రామ్ చరణ్ తో కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ RRR. 2018లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' తర్వాత తారక్ నుంచి సోలో సినిమా రాలేదు. చాలా కాలంగా కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు రావడం.. ట్రిపుల్ ఆర్ వెస్ట్రన్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడంతో ఎన్టీఆర్‌ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. దాన్ని కాపాడుకోడానికి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 'దేవర 2' తో పాటుగా వార్ 2, ప్రశాంత్నీల్ సినిమాలు లైన్ లో పెట్టారు. కాకపోతే ఇవి రావడానికి ఎక్కువ టైం పట్టనుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. 2019లో చేసిన 'వినయ విధేయ రామ' తర్వాత ఒక్క సోలో సినిమా రాలేదు. తారక్ తో కలిసి ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన తర్వాత, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పటి నుంచి శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' సినిమా కోసం వర్క్ చేస్తూనే వున్నారు మన గ్లోబల్ స్టార్. ఈ చిత్రం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే వాటిపై క్లారిటీ రావడం లేదు. బుచ్చిబాబుతో RC 16 సినిమాని అనౌన్స్ చేశారు కానీ, ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2021 చివర్లో వచ్చిన 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచీ పుష్పరాజ్ వరల్డ్‌లోనే ఉండిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' పార్ట్ 2 కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. రాబోయే ఇండిపెండెన్స్ డేకి 'పుష్ప: ది రూల్' ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత బన్నీ సినిమా ఏంటనేది తెలియడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ ఒకటి అనౌన్స్ చేశారు కానీ, ఎప్పుడు పట్టాలెక్కిస్తారనే విషయంలో స్పష్టత లేదు. అట్లీతో సినిమా అంటున్నారు కానీ, ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు.

KGF సినిమాలతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ సైతం స్లో అండ్ స్టడీగా వెళ్తున్నారు. 2022 సమ్మర్ లో వచ్చిన 'కేజీఎఫ్: చాప్టర్-2' తర్వాత, ఇంతవరకూ మరో మూవీ చేయలేదు. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో 'టాక్సిక్' అనే చిత్రాన్ని ప్రకటించారు కానీ, అది చిత్రీకరణ పూర్తి చేసుకొని సినిమాగా థియేటర్లలోకి రావడానికి చాలా టైం పడుతుంది.

ప్రభాస్ ప్లానింగ్.. అదుర్స్ కదూ!

ఇలా జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్, యష్ పాన్ ఇండియా స్టార్స్ అంతా కెరీర్‌ లో బాగా స్లోగా వెళ్తున్నారు. ఒక్కో సినిమా కోసం సంవత్సరాలు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఆ విషయంలో వీరందరి కంటే బెటర్ గా ఆలోచిస్తున్నారు. 'బాహుబలి' తో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు. హిట్టు ఫ్లాప్స్ పట్టించుకోకుండా వరుసగా సినిమాలతో దుసుకుపోతున్నారు. ఒక్కో చిత్రానికి భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

కరోనా పాండమిక్ తర్వాత ప్రభాస్ నుంచి 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్', 'సలార్ పార్ట్ 1' సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' చిత్రంలో నటిస్తున్నారు. అలానే మారుతితో కలిసి 'రాజా సాబ్' మూవీ చేస్తున్నారు. త్వరలోనే 'సలార్ 2' షూటింగ్ ప్రారంభం కానుంది. సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా లైన్ లో ఉన్నాయి. మధ్యలో ఇంక రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్లానింగ్ మిగతా పాన్ ఇండియా స్టార్స్ లో కనిపించడం లేదు. అందుకే ఆ విషయంలో అందరి కంటే ముందున్నాడు డార్లింగ్. అతనొక్కడే తన ఇమేజ్ ను, క్రేజ్ ను సరిగ్గా వాడుకుంటున్నాడు

Tags:    

Similar News