మెగాస్టార్ తో బాలనటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
ఇప్పుడు తేజ సజ్జా ఎవరు? అంటే కేవలం తెలుగు వారికే కాదు, అటు తమిళనాడు, ఉత్తరాది వారికి కూడా తెలుసు
కొందరికి అవసరానికి మించి ప్రచారం దానంతట అదే వచ్చేస్తుంది. మరికొందరికి ప్రచారం ఆశించినంతగా దక్కదు. ఈ రెండో కేవకే చెందుతాడు తేజ సజ్జా. ఈ యువ ఆర్టిస్టు బాలనటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నటిస్తూనే ఉన్నాడు. 28వయసు నాటికే 25ఏళ్ల సినీకెరీర్ ని పూర్తి చేసాడు. కానీ ఆశించినంత ప్రచారం అయితే లేదు. కానీ ఇటీవల అతడు నటిస్తున్న 'హను-మ్యాన్' గ్రాఫ్ ని పెంచింది.
ఇప్పుడు తేజ సజ్జా ఎవరు? అంటే కేవలం తెలుగు వారికే కాదు, అటు తమిళనాడు, ఉత్తరాది వారికి కూడా తెలుసు. దానికి కారణం హను-మ్యాన్ ఇటు తెలుగుతో పాటు అటు తమిళం-మలయాళం-కన్నడం-హిందీ భాషల్లోను విడుదల కాబోతోంది. పాన్ ఇండియా కేటగిరీలో చేరిన ఈ సినిమా టీజర్ సహా ఫస్ట్ లుక్ కి అద్భుత స్పందన వచ్చింది. నిజం చెప్పాలంటే రాజమౌళి బాహుబలి టీజర్ కి వచ్చినంత పేరొచ్చింది. అంత ఎఫెక్టివ్ గా తొలి గ్లింప్స్ ని అందించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
ఈ సినిమాతో యంగ్ హీరో తేజ సజ్జ పేరు జాతీయ స్థాయిలో మార్మోగుతుందని అంచనా వేస్తున్నారు. తేజ ఇటీవల తన 28వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ వార్త అటు జాతీయ మీడియాలోను వైరల్ అయింది. 3 ఏళ్ల వయసులో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ సజ్జా సినీ పరిశ్రమలో తన ప్రయాణం 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. మూడేళ్ల వయసులో అతడు నటించిన మొదటి సినిమా 'చూడాలని ఉంది'. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం దక్కింది. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇదే తేదీన ఈ సినిమా విడుదలైంది.
నిజానికి స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో తనని వెండితెరకు పరిచయం చేసిన ఎవరినీ యువహీరో తేజ మర్చిపోలేదు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు గుణశేఖర్, వైజయంతీ మూవీస్ నిర్మాత అశ్వినీదత్‌లకు ఎమోషనల్ నోట్ రాస్తూ యువ హీరో కృతజ్ఞతలు తెలిపారు. చూడాలని ఉంది చిత్రంలో ఆ రోజు వచ్చిన అవకాశమే తేజ సజ్జా అనే హీరో పుట్టుకకు కారణమని భావించాలి. హను-మాన్ సినిమా 2024 సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తే అతడి పేరు పాన్ ఇండియాలో మార్మోగడం ఖాయం. ఆంజనేయుడి కాన్సెప్టుతో సరైన సినిమా లేదు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ వర్మ ప్రయత్నం ఎంతో అభినందనీయం. ఇది యూనిక్ వేలో తెరకెక్కి పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.