అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హిస్టారికల్ సినిమాలు.. టాప్ 4 ఇవే!
చరిత్రలో మరిచిపోలేని పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ నాలుగు హిస్టారికల్ మూవీ రికార్డుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.;
సినీ ప్రేమికులకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కంటే కూడా చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రాలంటే విపరీతమైన మక్కువ పెరిగిపోయింది. భారీ మేకింగ్, గ్రాండ్ విజువల్స్, గొప్ప కథనంతో కూడిన ఇతిహాస చిత్రాలు ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. గతంలో ‘బాజీరావు మస్తాని’, ‘తన్హాజీ’, ‘పద్మావత్’ లాంటి సినిమాలు హిస్టారికల్ జానర్‌లో ఘనవిజయం సాధించాయి. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి మరో అద్భుత చిత్రం చేరింది.. అదే ‘ఛావా’. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చరిత్రలో మరిచిపోలేని పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ నాలుగు హిస్టారికల్ మూవీ రికార్డుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
‘ఛావా’ – 601 కోట్ల కలెక్షన్లతో అగ్రస్థానంలో
ఇటీవల ‘ఛావా’ చిత్రం బాలీవుడ్‌లో అంచనాలకు మించి ఘనవిజయం సాధించింది. శంభాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తొలివారమే రూ. 300 కోట్లకు పైగా వసూలు చేయగా, రెండవ వారంలోనే 555 కోట్ల మార్కును దాటింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ. 601 కోట్లను రాబట్టి ‘హయ్యెస్ట్ గ్రాసింగ్ హిస్టారికల్ ఫిల్మ్’గా నిలిచింది. ఇందులో విక్కీ కౌశల్ శంభాజీ పాత్రలో జీవించి పోయాడు, రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ వారం తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. దీంతో లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది.
‘పద్మావత్’ – 580 కోట్లు
బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘పద్మావత్’ 2018లో విడుదలై అద్భుతమైన వసూళ్లు సాధించింది. దీపికా పడుకొణే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమా విజువల్ మాస్టర్ పీస్‌గా నిలిచింది. రాజపుత్ రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. అయితే విడుదలైన తర్వాత అంచనాలకు మించి ప్రేక్షకుల మద్దతును పొందింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 580 కోట్ల గ్రాస్ వసూలు చేసి హిస్టారికల్ మూవీస్ లిస్టులో రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
‘తన్హాజీ’ – 373 కోట్లు
2020లో విడుదలైన ‘తన్హాజీ’ సినిమా మరాఠీ వీరుడైన సుభేదార్ తన్హాజీ మాలుసారే కథ ఆధారంగా తెరకెక్కింది. అజయ్ దేవగన్ టైటిల్ రోల్ పోషించగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా కేవలం 3 వారాల్లోనే రూ. 250 కోట్లకు పైగా వసూలు చేయగా, ఫుల్ రన్ లో రూ. 373 కోట్లను రాబట్టి అద్భుతమైన హిట్‌గా నిలిచింది. సినిమాలోని యుద్ధ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరిచాయి.
‘బాజీరావు మస్తాని’ – 355 కోట్లు
2015లో వచ్చిన ‘బాజీరావు మస్తాని’ చిత్రాన్ని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అత్యద్భుతంగా తెరకెక్కించారు. బాలీవుడ్ హిస్టారికల్ మూవీస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్‌గా నిలిచిన ఈ సినిమాలో రణవీర్ సింగ్, దీపికా పడుకొణే, ప్రియాంకా చోప్రా కీలక పాత్రల్లో నటించారు. బాజీరావు-మస్తాని ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 355 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
‘ఛావా’ సినిమా సృష్టించిన రికార్డులు చూస్తుంటే బాలీవుడ్‌లో ఇకపై మరిన్ని హిస్టారికల్ మూవీస్ వచ్చేలా ఉన్నాయనిపిస్తోంది. ఈ చిత్రాలు ప్రజల్లో చరిత్రపై ఆసక్తిని పెంచడంతో పాటు, భారీ వసూళ్లు రాబట్టే సత్తా కూడా చాటుతున్నాయి. మరి ఈ హిస్టారికల్ హిట్ లిస్టులో నెక్స్ట్ ఏ సినిమా చేరుతుందో చూడాలి.