అర్జెంట్‌గా హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా చేయడమే అన్నిటికీ పరిష్కారమా?
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సీఎంతో భేటీ అనగానే ఇండస్ట్రీలో ప్రస్తుత పరిణామాలపై చర్చలు ఉంటాయని అందరూ భావించారు
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సీఎంతో భేటీ అనగానే ఇండస్ట్రీలో ప్రస్తుత పరిణామాలపై చర్చలు ఉంటాయని అందరూ భావించారు. ఓవైపు అల్లు అర్జున్ కేసు, మరోవైపు బెనిఫిట్ షోలు బ్యాన్, ఇంకోవైపు టికెట్ రేట్ల పెంపు ఉండదని ప్రభుత్వ ప్రకటన.. ఈ అంశాలే ఇప్పుడు హాట్ టాపిక్ గా కొనసాగుతున్నాయి కాబట్టి, వాటిపైనే చర్చలు ఉంటాయని అనుకున్నారు. కానీ సీఎంతో మీటింగ్ లో అసలు ఈ అంశాలపై డిస్కషనే జరగలేదని చెబుతున్నారు.
సీఎంతో మీటింగ్ తర్వాత ఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు సినిమాని ఇండియా లెవల్ లోనే కాకుండా, ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళేలా డెవలప్ చేయడానికి సినీ ఇండస్ట్రీ ప్రభుత్వం కలిసి పని చేయబోతున్నాయని చెప్పారు. హైదరాబాద్ లో ఇండియన్ సినిమాల షూటింగ్స్ మాత్రమే కాదు, హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా జరగడానికి ఇండస్ట్రీ నుంచి సలహాలు ఇవ్వమని సీఎం కోరారు. హైదరాబాద్ ను సినిమాకి ఇంటర్నేషనల్ హబ్ గా చేయడానికి అడుగులు వేస్తాం అని దిల్ రాజు తెలిపారు.
సమాజ హితం కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ఇండస్ట్రీ సహకారం ఉండాలని చెబితే, అందరం యాక్సెప్ట్ చేశాం అని చెప్పారు దిల్ రాజు. డ్రగ్స్ నిర్మూలన కోసం దర్శక హీరోలతో అవగాహన కార్యక్రమం తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఓవరాల్ గా ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పని చేయడం గురించే ఈ మీటింగ్ లో ప్రధానంగా చర్చినట్లుగా దిల్ రాజు తెలిపారు. వన్ ఆఫ్ థి బెస్ట్ మీటింగ్ ఈ రోజు జరిగింది. తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏమి చెయ్యాలనేదే ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ ఇష్యూ, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల గురించి దిల్ రాజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైపెచ్చు బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు అసలు టాపిక్ కాదని.. అది చిన్న పార్ట్ అని.. అదంత ఇంపార్టెంట్ కాదని, తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లడనే మెయిన్ అజెండా అని, చిన్న చిన్న విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని దిల్ రాజు తేల్చి చెప్పారు. ఇదంతా బాగానే వుంది కానీ, ముందు చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోకుండా.. అంత అర్జంట్ గా హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా చేయడం గురించి చర్చించడం ఏంటని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే అన్నిటికీ పరిష్కారమా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మరో రెండు వారాల్లో సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉంటాయా? టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతులు వస్తాయా? అనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన అల్లు అర్జున్ కేసు విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. సీఎంతో మీటింగ్ అనగానే.. ముందుగా వీటిని పరిష్కరించుకుంటారని అనుకున్నారు. కానీ దిల్ రాజు మాత్రం ఇవన్నీ మాట్లాడకుండా.. సీఎం తమకు బిగ్ టార్గెట్ పెట్టినట్లుగా చెబుతున్నారు.
అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటడానికి గతంలో ఏ సీఎంతో మీటింగ్ పెట్టారని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. దిల్ రాజు స్పీచ్ ను ఓ నెటిజన్ షేర్ చేస్తూ.. "ఏ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెట్టి ఇన్స్పైర్ చేస్తే మగధీర స్టోరీ వచ్చింది? బాహుబలి ఐడియా పుట్టింది? ఏ ముఖ్యమంత్రి వల్ల పుష్ప-2 హిందీ ఆల్ టైం హిట్ కొడుతుంది? బేసిక్ అనుసంధానం తెలియనాయన ప్రపంచ స్థాయిలో ఎదగడానికి దిశా నిర్దేశం చేసాడంట, వీళ్ళు విన్నారంట. మీరు మీ తొక్కలో పిట్ట కథలు" అని కామెంట్ చేసాడు.