రజనీ కూలీ టీంకు ఇళయరాజా నోటీసులు!

ఆ సమయంలో విడుదల చేసిన చిన్న టీజర్.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Update: 2024-05-01 13:00 GMT

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్.. ప్రస్తుతం కూలీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్, లియో చిత్రాల తర్వాత ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రజనీ, లోకేష్ తొలిసారిగా కలిసి చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల మేకర్స్.. ఈ మూవీని గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. ఆ సమయంలో విడుదల చేసిన చిన్న టీజర్.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అందులో రజనీ కాంత్ బంగారు స్మగ్లింగ్ డెన్ లోకి అడుగుపెట్టి, అక్కడ ఉన్న మనుషులను ఒక రేంజ్ లో కబడ్డీ ఆడుకుంటున్నట్టు టీజర్ లో చూపించారు. ఇక ఈ వీడియోలో రెండు పాటలు కూడా ఉన్నాయి. 'నినైతలే ఇనికుం' సినిమాలోని 'శంభో శివ శంభో' పాట లిరిక్స్ ను, ' తగన్ మగన్ ' మూవీలోని 'వా వా పక్కం వా' పాట మ్యూజిక్ ను యూజ్ చేశారు. అందులో ఓ పాట ఇప్పుడు మేకర్స్ కు లీగల్ సమస్యలు తెచ్చిపెట్టింది!

టీజర్ లో రజనీ కాంత్ స్వాగ్ గుర్తు చేసేలా 'తగన్ మగన్' సినిమాలోని 'వా వా పక్కం వా' సాంగ్ మ్యూజిక్ ను అనిరుధ్ బాగా యూజ్ చేశారని ప్రశంసలు వచ్చాయి. అయితే 'తగన్ మగన్' మూవీకి ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. దీంతో గ్లింప్స్ వీడియోలో ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ ను ఉపయోగించుకున్నందుకు ఇళయరాజా టీం.. కూలీ మేకర్స్ సన్ పిక్చర్స్ సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేసింది.

టీజర్‌ లో 'వా వా పక్కం వా' సాంగ్ మ్యూజిక్ చేర్చడానికి ఇళయరాజా నుంచి అధికారిక అనుమతి తీసుకోలేదని నోటీసులో హైలైట్ చేసింది ఆయన టీమ్. సరైన అనుమతులు తీసుకోవాలని లేకుంటే టీజర్ నుంచి మ్యూజిక్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. కాపీ రైట్ హక్కుల ఉల్లంఘన కిందకు ఇది వస్తుందని గుర్తు చేసింది. స్పందించకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని నోటీసుల్లో ఇళయరాజా పేర్కొన్నారని తెలుస్తోంది.

అయితే కొత్త సినిమాల్లో పాత సాంగ్స్ వాడితే ఆయా సంగీత దర్శకుడు, గేయ రచయిత అనుమతులు తీసుకోవాలి. రాయల్టీ ఇవ్వడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఇళయరాజాతో ఈ సమస్యను కూలీ మేకర్స్.. ఆ విధంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని టాక్. ఇప్పటికే కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా వేసిన ఓ కేసు.. కర్ణాటక కోర్టులో నడుస్తోంది. మరి ఈ ఇష్యూ ఎప్పుడు క్లోజ్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News