'బాహుబలి' సేతుపతి 'పేకమేడలు'.. క్రేజీ కాన్సెప్ట్
కొత్త హీరో హీరోయిన్లను ప్రోత్సాహిస్తూ 'పేకమేడలు' అనే సినిమాను రూపొందిస్తున్నారు.
'బాహుబలి' సేతుపతి రాకేష్ వర్రే గుర్తు ఉన్నారా?.. అదే గుడిలో తన మీద చెయ్యి వేయబోతే అనుష్క వేళ్ళు నరికేస్తుంది కదా! హా.. ఆయనే రాకేష్ వర్రే. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ హౌస్ ను స్థాపించారు. ఆ బ్యానర్ పై 2019లో 'ఎవ్వరికీ చెప్పొద్దు'ను అనే సినిమాను నిర్మించి.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై కూడా మంచి ఆదరణను దక్కించుకుంది. ఈ నాలుగేళ్లలో నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ మంది చూసిన సినిమాగాను రికార్డుకెక్కింది. అయితే ఇప్పుడు ఆయన మరో క్రేజీ కాన్సెప్ట్ తో ఓ సినిమాను నిర్మిస్తున్నారు.
కొత్త హీరో హీరోయిన్లను ప్రోత్సాహిస్తూ 'పేకమేడలు' అనే సినిమాను రూపొందిస్తున్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ సంస్థలో ప్రొడక్షన్ నెం. 2గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలై సినిమాపై మంచి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. 'నా పేరు శివ', 'అంధగారం' సహా పలు హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ ను హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తీస్తున్నారు.
హీరోయిన్ గా అనూష కృష్ణ నటిస్తోంది. ఆమెకు ఇదే ఫస్ట్ తెలుగు మూవీ కావడం విశేషం. ఇక ఈ చిత్రంతో నీలగిరి మామిళ్ళ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంకా ఈ చిత్రంలో దాదాపు యాభై మంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. ఇంకొతమంది ఎక్స్ పీరియన్స్ టెక్నిషియన్స్ కూడా ఈ సినిమా కోసం పనిచేయడం మరో విశేషం.
ఇక ఈ 'పేక మేడలు' ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. అచ్చం టైటిల్ కు తగ్గట్టే డిజైన్ చేశారు. 360 డిగ్రీస్ ఉన్న ఈ పోస్టర్ లో హీరో వినోద్ కిషన్.. లుంగీ కట్టుకుని, హాఫ్ బనియన్ తో హైదరాబాద్ బస్తీ, సిటీకి మధ్యలో ఆకాశానికి నిచ్చెన వేసుకుని ఊహల్లో పేక మేడలు కడుతూ కనిపించారు. ఇక ఈ చిత్రానికి 'అంగమలి డైరీస్', 'జల్లికట్టు' వంటి సినిమాలకు సౌండ్ డిజైన్ అందించిన ప్రముఖ సౌండ్ డిజైనర్ రంగనాధ్ రేవి, సౌండ్ మిక్సర్ కన్నన్ గన్ పత్ ఈ చిత్రానికి పని చేయడం విశేషం.
కాస్ట్యూమ్ డిజైనర్ గా మేఘన శేషవపురి పనిచేశారు. స్క్రీన్ ప్లే.. హంజా అలీ - శ్రీనివాస్ ఇట్టం - నీలగిరి మామిళ్ళ అందించారు. మాటలు, పాటలు.. భార్గవ కార్తీక్ ఇవ్వగా.. సృజన అడుసుమిల్లి - హంజా అలీ- కూర్పు అందించారు. హరిచరణ్ కె.. ఛాయాగ్రహణం, స్మరన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను ఆగస్టులో
ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు దర్శక - నిర్మాతలు తెలిపారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి కథతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సినిమా ప్రారంభం నుంచి చివరకు వరకు ప్రతి సన్నీవేశం ఆడియెన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తుందని వెల్లడించారు.