బాలయ్యకు పోటీగా బరిలోకి మెగా మేనల్లుడు!

ఇప్పటికే బాలయ్య విడుదల తేదీని ప్రకటించగా.. ఇప్పుడు మెగా మేనల్లుడు కూడా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

Update: 2024-12-13 04:07 GMT

2025 ఫెస్టివల్ సీజన్స్ కోసం టాలీవుడ్ లో ఇప్పటి నుంచే తీవ్ర పోటీ ఏర్పడింది. ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే వీక్ మొదలుకొని, ఏడాది చివర్లో వచ్చే క్రిస్మస్ సీజన్ వరకూ మంచి రిలీజ్ స్లాట్స్ అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. ఈసారి సమ్మర్ లో అనేక పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అలానే దసరా పండుగ మీద పలు క్రేజీ చిత్రాలు కర్చీఫ్స్ వేస్తున్నాయి. ఇప్పటికే బాలయ్య విడుదల తేదీని ప్రకటించగా.. ఇప్పుడు మెగా మేనల్లుడు కూడా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం #SDT18 అనే వర్కింగ్ టైటిల్ తో రోహిత్ కెపి దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి "SYG - సంబరాల ఏటిగట్టు" అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. గ్రాండ్ గా ఈవెంట్ చేసి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా కార్నేజ్ టీజర్ ను లాంఛ్ చేయించారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2025 దసరా కానుకగా సెప్టెంబర్ 25న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అదే తేదీకి 'అఖండ 2' ను తీసుకురాబోతున్నట్లుగా ఆల్రెడీ అనౌన్స్ మెంట్ వచ్చింది.

నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో "అఖండ 2: తాండవం'' సినిమా తెరకెక్కుతోంది. ఇది బ్లాక్ బస్టర్ 'అఖండ' చిత్రానికి సీక్వెల్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రూపొందించనున్నారు. రీసెంట్ గానే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసిన మేకర్స్.. విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది విజయ దశమికి సెప్టెంబరు 25న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. కానీ ఇప్పుడు పోటీగా 'SYG' (సంబరాల ఏటిగట్టు) సినిమాని బరిలోకి తీసుకొస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే సంక్రాంతి సీజన్ లో రామ్ చరణ్ 'గేమ్ చేంజర్', బాలయ్య 'డాకు మహారాజ్' సినిమాలు పోటీ పడబోతున్నాయి. రెండు చిత్రాలూ రెండు రోజుల గ్యాప్ లో విడుదల కాబోతున్నాయి. ఒకటి జనవరి 10న వస్తుంటే, మరోటి జనవరి 12న రాబోతోంది. మెగా నందమూరి హీరోల మధ్య పొంగల్ క్లాష్ ఎలా ఉంటుందో అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో, దసరా సీజన్ లోనూ మెగా Vs నందమూరి క్లాష్ అనివార్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పది రోజులకు పైగానే దసరా హాలీడేస్ ఉంటాయి కాబట్టి, ఫెస్టివల్ సీజన్ లో రెండు మూడు పెద్ద సినిమాలు వచ్చినా ఇబ్బంది ఉండదు. 'అఖండ 2', 'సంబరాల ఏటిగట్టు' చిత్రాలు ఒకేసారి విడుదలైనా థియేటర్ల సమస్య ఉండకపోవచ్చు. కాకపోతే ఈ రెండు సినిమాలకూ తదుపరి వారంలో వచ్చే రిషబ్ శెట్టి ''కాంతార: చాప్టర్-1'' నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. 'కాంతార' ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని, సరిగ్గా దసరా రోజున అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులోనూ ఈ మూవీకి మంచి క్రేజ్ ఉంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు అదే సీజన్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం.. ఫైనల్ గా రేసులో ఏయే సినిమాలు నిలుస్తాయో, విజయదశమి బాక్సాఫీస్ క్లాష్ ఎలా ఉంటుందో..!

Tags:    

Similar News