'సలార్ -2'పై నీలి నీడలు! అసలేం జరుగుతోంది?
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ -2 కంటే ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
'సలార్ -2' ఇదే ఏడాది జూన్ లేదా? నవంబర్ డిసెంబర్ లో ప్రారంభమవుతుందని అంతా భావించిన సంగతి తెలిసిందే. 15 నెలల్లోనే సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేస్తామని నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. కానీ తాజాగా ఆ సమీకరణాలన్నీ మారుతున్నట్లే కనిపిస్తోంది. సలార్ -2 విషయంలో నీలి నీడలు కమ్ముంటుకున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ -2 కంటే ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
తారక్ నటిస్తోన్న దేవర్ షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో బాలీవుడ్ సినిమా 'వార్ -2' లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాకి ఎక్కువగా డేట్లు కేటాయించలేదు. తన పోర్షన్ వరకూ వీలైనంత త్వరగానే ముగించే అవకాశం ఉంది. అటుపై ప్రశాంత్ నీల్ షూట్ లో పాల్గొంటాడని ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రకటనొచ్చింది తప్ప! ఎప్పుడు? అన్నది ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ సన్నివేశాలు చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఇదే ఏడాది మొదలయ్యేలా కనిపిస్తోంది.
యంగ్ టైగర్ -నీల్ తరుచూ టచ్ లో ఉండటం....నీల్ భార్యతో తారక్ ఉన్న పరిచయంతో ఎంతో క్లోజ్ గా ఉన్న సన్నివేశాలు చూస్తుంటే ఈ ప్రాజెక్టే ముందుగా మూవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. నీల్ ఎప్పుడో స్టోరీ సిద్దం చేసి పెట్టాడు. తారక్ డేట్లు ఇవ్వడమే ఆలస్యం అన్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే సలార్ -2 పరిస్థితి ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది. సలార్ -2 గురించి మరో ప్రచారం కూడా జరుగుతోంది.
అసలు 'సలార్ -2' ఉంటుందా? రద్దవుతుందా? అన్న కథనాలు సైతం తెరపైకి వస్తున్నాయి. అందుకు తగ్గట్టే ప్రభాస్ కమిట్ మెంట్లు కూడా కనిపిస్తున్నాయి. డార్లింగ్ 'రాజాసాబ్' చిత్రం పూర్తి చేయాల్సి ఉంది. అది సెట్ లో ఉండగానే హనురాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ సినిమా కూడా ప్రారంభమవుతుందని ప్రచారం సాగుతుంది. మరి ఈ రెండు సెట్స్ కి వెళ్తే 'సలార్ -2' సంగతేంటి? అని అభిమానుల్లో సైతం చర్చకొస్తుంది. దీనిపై దర్శక-నిర్మాతలు గానీ, ప్రభాస్ గానీ సరైన క్లారిటీ ఇవ్వడం లేదు.