టాప్ స్టోరి: విశాఖకు టాలీవుడ్ త‌ర‌లింపు?

వైకాపా ప్ర‌భుత్వం కూడా విశాఖ‌కు తెలుగు చిత్ర‌సీమ త‌ర‌లి రావాల‌నే కోరుకుంది.

Update: 2024-06-30 06:05 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధాని ఏర్పాటు, టాలీవుడ్ త‌ర‌లింపు రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌లుగా మారాయి. గ‌త రెండు ప్ర‌భుత్వాల హ‌యాంలో రాజ‌ధాని ఏర్పాటు సాధ్య‌ప‌డ‌లేదు. రాజ‌ధాని నిర్మాణ క్ర‌తువు భారీత‌నంతో ఏళ్ల‌త‌ర‌బ‌డి సాగే ప్రాజెక్ట్ కాబ‌ట్టి ఏపీకి దీనిపై స్పష్ఠ‌త క‌రువైంది. అయితే తెలంగాణ నుంచి విడిపోయాక ఆంధ్రప్ర‌దేశ్ లోని విశాఖ న‌గ‌రానికి టాలీవుడ్ ని త‌ర‌లిస్తామ‌ని, ఏపీకి గ్లామ‌ర్ తెస్తామ‌ని చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు ఏపీఎఫ్‌డిసి సార‌థ్యంలో ప్ర‌య‌త్నాలు కూడా సాగాయి. స్టూడియోల‌కు భూములిచ్చేందుకు సినీపెద్ద‌ల్ని కూడా పిలిచింది అప్ప‌టి తేదేపా ప్ర‌భుత్వం. కానీ ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం మారింది. వైకాపా ప్ర‌భుత్వం కూడా విశాఖ‌కు తెలుగు చిత్ర‌సీమ త‌ర‌లి రావాల‌నే కోరుకుంది. కానీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో క‌ద‌లిక లేక‌పోవ‌డంతో ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా మారింది.

కానీ ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారింది. తేదేపా గెలుపొంది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చొర‌వ‌తో ఇప్పుడు మ‌ళ్లీ విశాఖ‌కు టాలీవుడ్ త‌ర‌లిరానుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ తెలుగు చిత్ర‌సీమ ఊసే వినిపించ‌క‌పోయినా కానీ, ఇటీవ‌ల దివంగ‌త రామోజీరావు సంస్మ‌ర‌ణ స‌భ‌లో చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి విశాఖ టాలీవుడ్ గురించిన ప్ర‌స్థావ‌న తేవ‌డం చ‌ర్చ‌గా మారింది. విశాఖ‌లోని ఫిలింసిటీకి రామోజీరావు పేరు పెడతామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు దీనిపై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కుముందు భీమిలి ప‌రిస‌రాల్లో దాదాపు 300 ఎక‌రాల భూమిని టాలీవుడ్ కోసం కేటాయించార‌ని ప్ర‌చారం సాగింది. దీంతో ఇక్క‌డ ప‌రిస‌రాల్లో సినీప్ర‌ముఖులు చాలా మంది భూములు కొనుగోలు చేసారు. థ‌మ‌న్ లాంటి మ్యూజిక్ డైరెక్ట‌ర్ సొంతంగా స్టూడియోను కూడా ఏర్పాటు చేసుకుని ప‌ని చేస్తున్నారు. భూమిలికి, భోగాపురం ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్ పోర్ట్ కి మ‌ధ్య‌లో అమ‌నామం అనే చోట మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి భూములున్నాయ‌ని కూడా ప్రచారం సాగింది. ఈ ప‌రిస‌రాల్లో రియ‌ల్ ఎస్టేట్ రంగం కూడా వేళ్లూనుకుని ఉంది. ఇప్పుడు విశాఖ ఔట‌ర్ లో చాలా వ‌ర‌కూ ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ భూముల్లో టాలీవుడ్ ఏర్పాటుకు ఆస్కారం లేక‌పోలేద‌ని మ‌రోసారి గుస‌గుస వినిపిస్తోంది.

అయితే ఇది నిజం అని అంగీక‌రించాలంటే ఇక్క‌డ ప్రాక్టిక‌ల్ గా ప‌ని మొద‌లు కావాలి. విశాఖ బీచ్ ప‌రిస‌రాల్లో ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ని ఏర్పాటు చేసారు. సీనియ‌ర్ నిర్మాత కే.ఎస్.రామారావు సార‌థ్యంలో ఇది కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తోంది. ఇంత‌కుముందు ఫిలింఛాంబ‌ర్ నిర్మాణం కోసం బీచ్ రోడ్ ప‌రిస‌రాల్లో పునాది రాయి కూడా వేసారు. కానీ త‌ర్వాత నిర్మాణాలేవీ జ‌ర‌గ‌లేదు. ఇది పూర్త‌యితే ఇక్క‌డ యాక్టివిటీస్ ప్రారంభిస్తారేమో చూడాలి. వైజాగ్ రామానాయుడు ఫిలింస్టూడియోస్ ఇప్ప‌టికే షూటింగుల‌తో బిజీగా ఉంది. విశాఖ‌లో ఫిలింఛాంబ‌ర్, ఎఫ్.ఎన్.సి.సి, ఆర్టిస్టుల సంఘం వంటివి ఉన్నాయి. సినీపెద్ద‌లంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి ప్ర‌య‌త్నించాల్సి ఉంటుంది. మ‌న‌కు కూడా క‌ళారంగం కావాలి అనే ప‌ట్టుద‌ల నాయ‌కుల్లోను ఉండాలి. అప్పుడే టాలీవుడ్ వైజాగ్ కి త‌ర‌లిరావ‌డం సాధ్య‌ప‌డుతుంది. కానీ అది నిజాయితీగా జ‌రుగుతుందా? అన్న‌ది వేచి చూడాలి.

Tags:    

Similar News