ఆ సినిమాపై ప్రధాని మోదీ ప్రశంసలు
దాంతో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ సినిమాల గురించి చాలా అరుదుగా మాత్రమే స్పందిస్తారు. తాజాగా ఆయన బాలీవుడ్ మూవీ 'ఛావా' గురించి స్పందించారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా కూడా ఛావా సినిమా గురించి ముచ్చట్లు వినిపిస్తున్నాయి అన్నారు. అంతే కాకుండా దేశంలో ప్రస్తుతం ఛావా సినిమా గాలి వీస్తుంది అన్నట్లుగా చెప్పుకొచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నోట నుంచి ఛావా మాట రావడంతో సినిమాపై ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి. సినిమాకు ఇప్పటికే క్రియేట్ అయిన పాజిటివ్ బజ్ రెట్టింపు అయింది. దాంతో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న 98వ మరాఠీ సాహిత్య సభల ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. హిందీ సినిమాతో పాటు మరాఠీ సినిమాల స్థాయిని పెంచడంలో ముంబై, మహారాష్ట్ర కీలక పాత్ర పోషించాయి. శివాజీ సావంత్ మరాఠీ నవల వల్లే ఈ శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలిసింది, ఆయన వీరత్వం గురించి సినిమా రూపంలో చేయడం సాధ్యం అయిందని ప్రధాని మోదీ అన్నారు. చావా సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు అన్నారు. మరాఠీ సాహిత్య సభలో ప్రధాని మోదీ పాల్గొనడంతో పాటు, ఛావా సినిమా గురించి, మరాఠా మహారాజ్ శంభాజీ మహారాజ్ గురించి మాట్లాడటంతో ఒక్కసారిగా సినిమా హైప్ రెట్టింపు అయింది.
ఛావా సినిమా మొదటి వారం రోజుల్లోనే రూ.300 కోట్లకు మించిన వసూళ్లు రాబట్టింది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఛావా సినిమా లాంగ్ రన్‌లో నమోదు చేయబోతున్న నెంబర్స్ గురించి ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు. సినిమాను ఇతర భాషల్లో డబ్ చేస్తే కచ్చితంగా వందల కోట్ల వసూళ్లు అదనంగా వస్తాయని కొందరు నమ్మకం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసిన సమయంలో మరింత మంది చూస్తారనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సినిమాతో బాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్‌లు నమోదు కాబోతున్నాయనే విశ్వాసంను వారు వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఛావా సినిమాకు మొదటి వీకెండ్‌లో రికార్డ్ స్థాయి వసూళ్లు వచ్చాయి. రెండో వీకెండ్‌లోనూ అంతకు మించి అంటూ వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొదటి శుక్రవారం వసూళ్లతో పోల్చితే రెండో శుక్రవారం వసూళ్లు అధికంగా నమోదు అయ్యాయి. కనుక రెండవ శనివారం, రెండో ఆదివారం వసూళ్లు సైతం అదే స్థాయిలో ఉంటే వీకెండ్ ముగిసేప్పటికి రూ.500 కోట్ల క్లబ్‌లో ఛావా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. ప్రధాని సైతం ఛావా గాలి వీస్తుంది అనడంతో లాంగ్ రన్‌లో సినిమా రూ.1000 కోట్లు రాబట్టే అవకాశాలు లేకపోలేదు అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.