'భైరవ' గుండెల్లో నిలిచిపోతాడు: స్వప్న దత్
నిర్మాతలు కొన్ని వారాల క్రితం తమ సోషల్ మీడియాలో ఫ్యూచరిస్టిక్ పోస్టర్‌తో ఇదే విషయాన్ని వెల్లడించారు.
2024లో రికార్డులతో ప్రకంపనాలు సృష్టించేందుకు వస్తున్నాడు ప్రభాస్. అతడు నటిస్తున్న కల్కి 2898 ఎడి నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల జరిగిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిత్ర నిర్మాత స్వప్నాదత్‌ని 'కల్కి 2898 AD' గురించి ప్రశ్నించారు. సినీ విమర్శకుడు , ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్వప్నపై ఒక ప్రశ్న సంధించారు. కల్కిగా ప్రభాస్‌ని తెరపై చూసేప్పుడు ప్రజలు ఆ పాత్రను ఎలా వోన్ చేసుకుంటారు? అని ప్రశ్నించారు. దీనికి స్వప్నదత్ కొంత సమయం తీసుకుని సమాధానమిస్తూ..''భైరవ చాలా కాలం పాటు ప్రజల హృదయాలలో నిలిచి ఉంటాడని నేను భావిస్తున్నాను'' అని సమాధానం ఇచ్చారు. 2898 AD నాటి ప్రభాస్ పాత్ర పేరు భైరవ. నిర్మాతలు కొన్ని వారాల క్రితం తమ సోషల్ మీడియాలో ఫ్యూచరిస్టిక్ పోస్టర్‌తో ఇదే విషయాన్ని వెల్లడించారు.
కల్కి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్. మహాభారత కాలంలో మొదలయ్యే కథ, నేటి జనరేషన్, భవిష్యత్ జనరేషన్ కి కూడా కనెక్టవుతుంది. ఇందులో ప్రభాస్ భైరవ అనే పాత్రలోను కనిపిస్తాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే రచయిత. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్వప్న దత్ -అశ్వని దత్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
భారీ స్థాయిలో ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించడానికి మేకర్స్ గత నాలుగు సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్, దిశా పటాని సహా కల్కి ప్రధాన బృందం ఇటీవల ఇటలీలో ఒక పాట షూటింగ్‌ను పూర్తి చేసింది. ఈ చిత్రం 9 మే 2024న థియేటర్లలోకి విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా ఇతర భారతీయ భాషలు, విదేశీ భాషలలో విడుదలవుతుంది. ప్రభాస్ తదుపరి మారుతీ రచించి దర్శకత్వం వహించిన హారర్-కామెడీ చిత్రం 'ది రాజా సాబ్'లోను నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సలార్ 2లోను నటించనున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రంలోను నటించాల్సి ఉంది.