లాల్ సలాం టీజర్: ఇది కేవలం ఆట కాదు యుద్ధం
ఈ ఆట కామెంటేటర్ `ఇది కేవలం ఆట కాదు యుద్ధం` అని ప్రకటించడం చూస్తుంటే ఆటలో ఘర్షణల నేపథ్యంలో రక్తి కట్టించే యాక్షన్ చిత్రమిదని అర్థమవుతోంది.
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన `లాల్ సలామ్` అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కాస్త నిడివి ఉన్న అతిథి పాత్రలో నటించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా టీజర్‌ను ఆవిష్కరించి అభిమానులకు దీపావళి కానుకగా ఇచ్చారు. లాల్ సలామ్ యాక్షన్-ప్యాక్డ్ టీజర్ ఆద్యంతం ఆటలో గొడవ కేంద్రంగా సాగుతుంది. అత్యంత ఉద్రిక్తమైన క్రికెట్ మ్యాచ్‌తో టీజర్ వేడెక్కిస్తోంది. ఈ ఆట కామెంటేటర్ `ఇది కేవలం ఆట కాదు యుద్ధం` అని ప్రకటించడం చూస్తుంటే ఆటలో ఘర్షణల నేపథ్యంలో రక్తి కట్టించే యాక్షన్ చిత్రమిదని అర్థమవుతోంది.
విష్ణు విశాల్- విక్రాంత్ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో కొట్లాటకు దిగడంతో అసలు ఘర్షణ ప్రారంభమవుతుంది. అయితే ఇది నెమ్మదిగా మత ఘర్షణలకు తావిస్తుందని అర్థమవుతోంది. టీజర్ ముగిసే సమయానికి, మొయిదీన్ భాయ్‌గా రజనీకాంత్ ప్రవేశం .. అతడి థ్రిల్లింగ్ పోరాట సన్నివేశం ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ గా నిలుస్తుంది. టీజర్‌లో రజనీకాంత్ మాట్లాడుతూ, ``మీరు క్రీడలతో మతాన్ని మిళితం చేసారు. మీరు ప్రజల మనసుల్లో విషం నింపారు`` అని డైలాగ్ చెబుతారు. టీజర్‌లో పెద్దగా సంభాషణలు లేవు కానీ మతం కారణంగా సాంస్కృతిక -ప్రాంతీయ విభేదాల కారణంగా ఇద్దరు ఆటగాళ్లు ఎదుర్కొనే సమస్యల చుట్టూ కథ తిరుగుతుందని అర్థమవుతోంది. టీజర్‌లో కోపం, పండగ మూడ్, త్యాగంతో కూడుకున్న భావోద్వేగాల పరంపర ఆకట్టుకుంటున్నాయి.
రజనీకాంత్ X (గతంలో ట్విట్టర్)లో ఒక వీడియోను షేర్ చేసి రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, “మీకు దీపావళి శుభాకాంక్షలు. పవర్ ప్యాక్డ్ లాల్ సలామ్ టీజర్‌ని ప్రదర్శిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా 2024 పండక్కి థియేటర్లలోకి`` అని తెలిపారు. లాల్ సలామ్ 2024 సంక్రాంతి బరిలో రిలీజవుతోంది.