జై హనుమాన్.. ఆంజనేయుడిగా ఆయనే..

ఫస్ట్ పార్ట్ కు మించి సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే పలు\మార్లు తెలిపారు.

Update: 2024-10-30 14:00 GMT

యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సూపర్ హీరో కాన్సెప్ట్ కు ఇతిహాసాన్ని ముడిపెట్టి తీసిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు జై హనుమాన్ సినిమా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ కు మించి సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే పలు\మార్లు తెలిపారు.


దీంతో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి? అనే ప్రశ్నకు సమాధానంగా సీక్వెల్ రూపొందుతోంది. అయితే ఆంజనేయస్వామి పాత్రను స్టార్ హీరోనే పోషిస్తారని ప్రశాంత్‌ వర్మ చెప్పిన క్షణం నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. హనుమంతుడిగా కనిపించేది ఎవరా అని సినీ ప్రియుల ఎదురుచూపులకు నేడు పుల్ స్టాప్ పడింది. దీపావళి కానుకగా మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ విడుదల చేశారు.


'త్రేతాయుగం నుంచి ఒక ప్రతిజ్ఞ కలియుగంలో నెరవేరుతుంది. ఈ దీపావళికి 'జై హనుమాన్' అనే పవిత్ర శ్లోకంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిద్దాం' అని క్యాప్షన్ ఇచ్చారు. ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నట్లుగా హనుమంతుడిగా కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు ప్రకటించారు. స్పెషల్ పోస్టర్ ను కూడా షేర్ చేశారు. రాముడి విగ్రహాన్ని పట్టుకున్న రిషబ్ శెట్టి పిక్.. సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. డివోషనల్ గా అన్ని వర్గాల సినీ ప్రియులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే జై హనుమాన్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారు మేకర్స్. త్వరలోనే షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. సీక్వెల్ లో ఎవరూ ఊహించని సర్ప్రైజ్ లు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. హనుమాన్ లో హనుమంతుగా కనిపించిన తేజ సజ్జా.. సీక్వెల్ లో కూడా అదే రోల్ చేస్తున్నారు. అయితే జై హనుమాన్ మూవీని ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌లో తీసుకురానున్నట్లు మూవీ టీమ్ రీసెంట్ గా ప్రకటించింది. జై హనుమాన్ కూడా ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ లో భాగమేనని తెలిసిదే. మరి ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News