పార్వతి అలా చేజారిన వేళ..ఏడ్చేసా!
ఏ దర్శకుడైనా ఆ పాత్రకు ఫలానా హీరోయిన్ మాత్రమే పర్పెక్ట్ గా సూటువుతుందని ఓ ఇమేజినేషన్ ఉంటుంది.
హీరోయిన్లు మారడం సహజంగా జరిగేదే. కానీ మొదట అనుకున్న హీరోయిన్ మాత్రం ఎప్పుడు బెస్ట్ ఛాయిస్. ఏ దర్శకుడైనా ఆ పాత్రకు ఫలానా హీరోయిన్ మాత్రమే పర్పెక్ట్ గా సూటువుతుందని ఓ ఇమేజినేషన్ ఉంటుంది. వీలైనంత వరకూ వాళ్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వాళ్లు కుదరని పక్షంలోనే మరో హీరోయిన్ కి వెళ్తుంటారు. ఈ ట్రెండ్ నేటి జనరేషన్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ పాత సంఘటన ఒకటి బయటకొచ్చింది.
అక్కినేని నాగేశ్వరరావు-సావిత్రి నటించిన 'దేవదాసు' అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. దేవదాస్ గా అక్కినేని- పార్వతిగా సావిత్రి ఆ పాత్రల్లో జీవించారు. ఈ రెండు పాత్రలకు వాళ్లు మాత్రమే న్యాయం చేయగలరనిపించారు. మరో హీరోనిగానీ..నటినిగానీ ఆ పాత్రల్లో ఊహించుకోవడమన్నదే అసాధ్యంగా అనిపిస్తుంది. అయితే ఇందులో హీరోయిన్ పాత్రకు తొలుత అనుకున్నది సావిత్రిని కాదుట.
షావుకారు జానకి అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ సందర్భంలో ఈ విషయం జానకినే తెలిపినట్లు తెలు స్తోంది. 'దేవదాసు ప్రారంభ కాలంలో నిర్మాత డి.ఎల్ నారాయణ , రచయిత సముద్రాల మా ఇంటికొచ్చారు. పాత్ర గురించి చెప్పి, నన్ను పార్వతి పాత్ర పోషించమన్నారు. నాగేశ్వరరావు గారు దేవదాస్ రోల్ అని, మిగిలిన పాత్రలు ఎవరు? అన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. నేను సంతోషించాను. గొప్ప పాత్ర దక్కిందని సంబరపడ్డాను.
వారికి థాంక్స్ కూడా చెప్పాను. 'ఓ దేవదా' పాట రికార్డు అయితే ఆ పాటను టేపులో పంపారు. విని రోజూ సాధన చేయడం ప్రారంభించాను. షూటింగ్ తేదీలు కూడా ఖరారు చేసారు. ఒకరోజు ఒకాయన మా ఇంటికొచ్చి ఆ సినిమాకి నేను పైనాన్స్ చేస్తున్నాను. దేవదాసులో పార్వతి మీరు కాదు. ఆ పాత్ర మరొకరు చేస్తున్నారని చెప్పి టేప్ రికార్డర్ పట్టుకుపోయారు. దాంతో నేను చాలా బాధపడ్డాను. కళ్లంట నీళ్లు తిరిగాయ్. ఆ తర్వాత ఆ పాత్ర సావిత్రి చేస్తున్నట్లు విన్నాను. సినిమా చూసాక ఓ గొప్ప నటి పార్వతి పాత్రలో అద్భుతంగా నటించిందని సావిత్రిని మనసారా కౌగిలించుకుని అభినందించాను' అని అన్నారు.