రేవ్ పార్టీలో లేను.. జనసేనానిపై రాస్తారా!- జానీ మాస్టార్
జానీ మాస్టార్ ఎక్స్ ఖాతాలో రాసిన నోట్ సారాంశం ఇలా ఉంది.
బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్లో కాకలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు తెలుగు స్టార్లు ఈ పార్టీలో ఉన్నారంటూ సాగిన ప్రచారం, అటుపై ఆ వార్తల్ని పుకార్లు అంటూ కొట్టి పారేసిన వైనం తెలిసినదే. అయితే ఇదే రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో జానీ మాస్టార్ కూడా ఉన్నారంటూ ఒక పుకార్ కొన్ని మీడియాల్లో షికార్ చేసింది. తాజాగా దానిని ఖండిస్తూ జానీ మాస్టర్ సోషల్ మీడియాల్లో వివరణ ఇచ్చారు.
జానీ మాస్టార్ ఎక్స్ ఖాతాలో రాసిన నోట్ సారాంశం ఇలా ఉంది. హైదారాబాద్ లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని, జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు.
నిన్న డైరక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ కి, నేడు నా చిరకాల స్నేహితుడిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లి ఇప్పటివరకు మా అసోసియేషన్ పనులతో బిజీగా ఉన్న నేను ఎలా అక్కడ ప్రత్యక్షమయ్యానో ఈ వార్త చేసిన, చేయించిన మతిలేని మహారథులకే తెలియాలి. చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు.
ఏదైనా సూటిగా.. నేరుగా ఎదుర్కొలేని వాళ్లు.. చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు. ఈ వివరణ ఇస్తున్నది.. నేను ఏదో తప్పు చేశానని కప్పి పుచ్చుకోవడానికి, నాపై దుష్ఫ్రచారం చేస్తున్న వాళ్లకు కౌంటర్ ఇవ్వడానికో కాదు. నన్ను వాళ్లలో ఒక కుటుంబ సభ్యుడినని అనుకొనే వాళ్ల కోసం ఈ వివరణ ఇస్తున్నాను అంటూ వివరణ ఇచ్చారు.
నేను హైదరాబాద్లో డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉన్నాను. ముక్కు రాజు గారు స్థాపించిన ఈ అసోసియేషన్ పనుల్లో ఉన్నాను. అయితే రేవ్ పార్టీలో ఉన్నానని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నాను. డైరెక్టర్ డే లైవ్లో నన్ను చూసి ఉంటారు. నాపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. జై జనసేన అంటూ ఎమోషనల్ గా మాట్లాడిన వీడియో షేర్ చేశారు.