హీరో విడాకుల గొడవలోకి తనను లాగొద్దని గాయని రెక్వస్ట్
ముఖ్యంగా హీరో అభిమానులు సోషల్ మీడియాలో సదరు గాయనిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
ప్రముఖ కథానాయకుడు తన భార్యకు విడాకులిస్తున్నానని ప్రకటించడం సంచలనమైన సంగతి తెలిసిందే. అయితే అతడి కుటుంబ కలతలకు పాపులర్ గాయని కం వైద్యురాలు కారణమని కథనాలొచ్చాయి. ఆమెతో అతడి సంబంధమే భార్యతో విడాకులకు కారణమైందని నెటిజనులు దూషిస్తున్నారు. ముఖ్యంగా హీరో అభిమానులు సోషల్ మీడియాలో సదరు గాయనిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఈ వివాదంలోకి ఆమెను లాగొద్దని, తమ మధ్య ఉన్నది పవిత్రమైన స్నేహానుబంధం మాత్రమేనని అతడు అన్నాడు. ఆమె కూడా ఇదే తీరుగా స్పందించింది. అంతేకాదు తనపై ఆరోపించేవారిని కోర్టుకు లాగుతానని సదరు గాయని వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఈ మొత్తం ఎపిసోడ్ ఎవరి గురించో చెప్పాల్సిన పని లేదు. తమిళ స్టార్ హీరో జయం రవి, అతడి భార్య ఆర్తి మధ్య వివాదంలో బెంగళూరు గాయని కెనీషా ప్రమేయం గురించే ఈ చర్చంతా. జయం రవితో గాయని కెనీషా శారీరక సంబంధంలో ఉందనేది ప్రధానమైన ఆరోపణ. అయితే దీనిని కెనీషా ఖండించింది. తమ మధ్య ఉన్నది కేవలం బిజినెస్ పరమైన స్నేహానుబంధం మాత్రమే. ఫిజికల్ ఇంటిమేషన్ లేనే లేదు! అని తెలిపింది. అలాగే జయం రవిని భార్య, అత్త మామలు తీవ్రంగా అవమానించి వేధించారని కూడా కెనీషా అంది. అదే క్రమంలో అతడికి ఒక వైద్యురాలిగా థెరపీ ఇస్తున్నానని వివరణ ఇచ్చింది. జయం రవి విడాకుల గురించి ప్రకటించిన తర్వాతే తనకు ఆ విషయం తెలిసిందని కూడా కెనీషా అన్నారు. తనను ఈ వివాదంలోకి లాగొద్దని మరోసారి కెనీషా అభ్యర్థించింది.