తమిళనాట స్క్రీన్లు ఇప్పిస్తారా అని సూర్యను అడిగితే..
కోలీవుడ్ వ్యవహారం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ల సినిమాలను దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో రిలీజ్ చేసుకుంటారు.
కోలీవుడ్ వ్యవహారం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ల సినిమాలను దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో రిలీజ్ చేసుకుంటారు. ఏపీ-తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో తమిళ సినిమాలు భారీగా రిలీజవుతాయి. కొన్ని సినిమాలకు నార్త్ ఇండియాలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు దొరుకుతాయి. కానీ ఇతర భాషల చిత్రాలను తమిళనాడులో రిలీజ్ చేద్దామంటే.. వాటికి మద్దతు లభించదు. మంచి కంటెంట్, క్రేజ్ ఉన్న సినిమాలకు కూడా థియేటర్ల సమస్య తప్పదు.
‘దేవర’ చిత్రానికి తమిళంలో క్రేజ్ వచ్చినా కూడా సరిపడా థియేటర్లు ఇవ్వలేదు. అది రిలీజైనపుడు తమిళంలో భారీ చిత్రాలు కూడా పోటీలో లేవు. ఇక దీపావళి వీకెండ్లో ‘అమరన్’ అనే సినిమాకు తెలుగులో కావాల్సినన్ని స్క్రీన్లు లభించాయి. కానీ ‘క’ తమిళ వెర్షన్ తమిళనాట రిలీజే కాని పరిస్థితి. మంచి టాక్ తెచ్చుకున్న తెలుగు వెర్షన్‌ను చూడ్డానికి చెన్నైలో స్థిరపడ్డ తెలుగువారు ఎంతో ఆసక్తితో ఉన్నా సరే.. దానికి పది స్క్రీన్లు కూడా ఇవ్వలేదని వాపోయాడు కిరణ్.
ఈ ద్వంద్వ వైఖరి విషయంలో తమిళ ఇండస్ట్రీని అందరూ తప్పుబడుతున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్యకు ఇదే విషయమై ప్రశ్న ఎదురైంది. తన కొత్త చిత్రం ‘కంగువ’ను ప్రమోట్ చేయడానికి బెంగళూరుకు వెళ్లగా.. ఈ సినిమాకు కర్ణాటకలో వందల స్క్రీన్లు ఇవ్వబోతున్నారని.. అదే మరి ఓ కన్నడ చిత్రానికి తమిళనాట మీరు థియేటర్లు ఇప్పించగలరా అని ఓ విలేకరి సూర్యను సూటిగా ప్రశ్నించాడు.
దీనికి సూర్య బదులిస్తూ.. తాను డిస్ట్రిబ్యూషన్లో లేనని.. అందులో బిజినెస్ వ్యవహారాలు తనకు తెలియవని అన్నాడు. కానీ ఈ సమస్య మీద ఎవరైనా చర్చలు జరిపే ప్రయత్నం చేస్తే.. వాళ్లకు మద్దతుగా నిలవడానికి తాను ముందు ఉంటానని.. సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని.. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమని సూర్య వ్యాఖ్యానించాడు. కానీ సూర్య చెప్పినట్లు ఈ విషయం మీద చర్చించడానికి కోలీవుడ్ జనాల్లో ఎవరు ముందుకు వస్తారు.. ఇతర భాషల నిర్మాతల సమస్యల మీద అక్కడి ఇండస్ట్రీలో ముందడుగు వేసేది ఎవరు అన్నదే ప్రశ్న.