ఐమ్యాక్స్ స్క్రీన్లలో 'కల్కి' మ్యాజిక్!
అయితే ఐమ్యాక్స్ లో రిలీజ్ కి అర్హత సాధించే తదుపరి చిత్రాలేవి? అన్నది ఆరా తీస్తే, ఓ రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన `ఓపెన్ హైమర్`ని పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ ఐమ్యాక్స్ థియేటర్లలో ప్రత్యేకంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అద్భుత వసూళ్లను సాధించింది. అప్పటి నుంచి ఐమ్యాక్స్ థియేటర్లలో రిలీజయ్యే సినిమాల గురించి చాలా చర్చ సాగుతూనే ఉంది. భారతదేశంలో ఎన్ని ఐమ్యాక్స్ థియేటర్లు ఉన్నాయి? అంటే.. 2023 నాటికి భారతదేశం అంతటా 44 సినిమాలు IMAX స్క్రీన్‌లు రెడీ అయ్యాయనేది ఒక లెక్క. అయితే కేవలం 27 స్క్రీన్‌ల నుండి ఇప్పటివరకూ రిలీజైన ఐమ్యాక్స్ సినిమాలు 176.51 కోట్లు వసూలు చేశాయని అంచనా.
తాజాగా అందిన సమాచారం మేరకు.. ఐమ్యాక్స్ వెర్షన్లలో రిలీజైన ఓపెన్ హైమర్- 51కోట్లు, అవతార్ : ది వే ఆఫ్ వాటర్ - 15.09కోట్లు, జవాన్ - 13.80 కోట్లు, పఠాన్ -12.83కోట్లు, మిషన్ ఇంపాజిబుల్ - 10.24 కోట్లు వసూలు చేసి టాప్ 5లో నిలిచాయి. యానిమల్ - 8.28 కోట్లు వసూలు చేసింది. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ - ఉత్తమ ఫలితం అందుకుందని కథనాలొస్తున్నాయి.
అయితే ఐమ్యాక్స్ లో రిలీజ్ కి అర్హత సాధించే తదుపరి చిత్రాలేవి? అన్నది ఆరా తీస్తే, ఓ రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్ - దీపికా పదుకొణె నటించిన ఫైటర్ IMAX స్క్రీన్‌లలో భారీగా విడుదల కానుంది. ఇది టామ్ క్రూజ్ టాప్ గన్ తరహా ప్రయోగం. భారతీయ యుద్ధ విమాన విన్యాసాలను ఐమ్యాక్స్ స్క్రీన్లలో ప్రదర్శిస్తే వచ్చే కిక్కు వేరే లెవల్ అని చెబుతున్నారు. దీనిని వయాకామ్ స్టూడియోస్ మార్ఫిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వార్, పఠాన్ చిత్రాలతో సంచలనాలు సృష్టించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఫైటర్ జనవరి 25న విడుదల కానుంది. రిపబ్లిక్ డే కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం భారతదేశంలో భారీ వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఫైటర్ తర్వాత ఐమ్యాక్స్ స్క్రీన్లకు అర్హమైన చిత్రం ప్రభాస్ -కల్కి 2898 AD. దీనిని నాగ్ అశ్విన్ అత్యంత భారీ స్కేల్ తో భారీ వీఎఫ్ ఎక్స్ తో తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ దీనికోసం నెవ్వర్ బిఫోర్ అనిపించేంత బడ్జెట్ ని కేటాయిస్తోంది. మే 9న విడుదలవుతున్న ప్రభాస్ కల్కి 2898 AD భారతదేశంలో మరో పెద్ద IMAX విడుదల అవుతుందని భావిస్తున్నారు.
కల్కి కథాంశం ఆసక్తికరం.. ఇది పూర్తిగా ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా. భవిష్యత్ ప్రపంచానికి సంబంధించిన ఆవిష్కరణ చేస్తున్నామని నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించడంతో దీనిని ఐమ్యాక్స్ వెర్షన్ లో చూడాలని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. సలార్ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత మరో సంచలన విజయం కోసం ప్రభాస్ ఎంతో శ్రమిస్తున్నారు. సలార్ 700 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టినా 1000 కోట్ల క్లబ్ సాధ్యపడలేదు. అందుకే తదుపరి కల్కితో ఈ ఫీట్ ని నిజం చేసి చూపించాలని తహతహలాడుతున్నాడు. బడ్జెట్, కాన్వాస్ పరంగా చూసినా కల్కి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లు పైగా వసూళ్లను రాబట్టాల్సి ఉందని కూడా చెబుతున్నారు. నాగ్ అశ్విన్ విజన్ ఆశించిన విధంగా తెరపై ప్రతిఫలిస్తే ఈమాత్రం వసూళ్లు పెద్ద మొత్తమేమీ కాదని కూడా చెబుతున్నారు. కల్కి చిత్రాన్ని బహుశా `కంగువ` (36 భాషల్లో రిలీజ్) తరహాలోనే బహుభాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని కూడా టాక్ ఉంది.