కల్కి 2898 AD: మ‌ర‌ణం అన్న‌దే లేనివాడు!

ఇంత‌కుముందే అమితాబ్ పాత్రకు సంబంధించిన పోస్ట‌ర్ ని రివీల్ చేసిన నాగ్ అశ్విన్ బృందం తాజాగా అమితాబ్ పాత్ర ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని లాంచ్ చేసారు.

Update: 2024-04-21 15:50 GMT

2024 మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం `కల్కి 2898 AD` నుంచి ప్ర‌భాస్ పాత్ర ఏమిట‌న్న‌ది ఇప్ప‌టికే రివీలైంది. అయితే ఇదే చిత్రంలో న‌టిస్తున్న బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ పాత్ర గురించి కానీ, క‌మ‌ల్ హాస‌న్, దీపిక పాత్ర‌ల గురించి కానీ పూర్తిగా స్ప‌ష్ఠ‌త లేదు.

ఇంత‌కుముందే అమితాబ్ పాత్రకు సంబంధించిన పోస్ట‌ర్ ని రివీల్ చేసిన నాగ్ అశ్విన్ బృందం తాజాగా అమితాబ్ పాత్ర ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని లాంచ్ చేసారు. ఆకర్షణీయమైన 20-సెకన్ల టీజర్ ఉత్కంఠ‌ను క‌లిగించింది. ముఖ్యంగా ఈ టీజ‌ర్ మూవీపై మ‌రింత‌గా అంచ‌నాల‌ను పెంచింది. 20-సెకన్ల టీజర్ అమితాబ్ బచ్చన్‌ను అమరుడైన‌ అశ్వత్థామగా పరిచయం చేసింది. నీవు ఎవ‌రు? దేవుడివా? ఇంకెవ‌రు? అంటూ ఒక బాల‌కుని గొంతు ప్ర‌శ్నిస్తోంది. దానికి అమితాబ్ స్వ‌యంగా స‌మాధాన‌మిస్తున్నారు. నేను ద్వాప‌ర యుగంలోని ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వ‌త్థామ‌ను అని చెబుతుండ‌డం ఉత్కంఠ‌ను క‌లిగించింది. అశ్వ‌త్థామ మ‌ర‌ణం లేని వాడు.. అమ‌రుడు.. అందుకే ఈ పాత్ర‌లో అమితాబ్ ని ప‌రిచ‌యం చేయ‌గానే గూస్ బంప్స్ పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా త‌న ఛాతి దిగువ‌న పొట్ట‌లోంచి కారుతున్న ర‌క్తాన్ని తుడుచుకుంటూ ఒక స‌న్యాసి వేష‌ధార‌ణ‌లో ఉన్న‌ అశ్వ‌త్థామ అక్క‌డి నుంచి వెళ్లిపోతున్న వీడియో ఆస‌క్తిని క‌లిగించింది. ఓ వైపు నువ్వు ఎవ‌రు? అంటూ సందేహం వ్య‌క్తం చేసిన బాలుడికి స‌మాధాన‌మిస్తూనే క‌దిలి వెళుతుంది ఈ పాత్ర‌. ప్ర‌స్తుతానికి ప్ర‌ధాన‌ పాత్రలు మిస్టరీగా ఉన్నప్పటికీ, తాజా టీజర్ ప్రేక్షకుల ఉత్సుకతను ప్రభావవంతంగా పెంచింది.

స్టార్ స్పోర్ట్స్ ఇండియాలో టీజర్‌ని విడుద‌ల చేసారు. ఈ సినిమా విడుదల తేదీని ఈసారి కూడా వెల్లడించలేదు, దీనితో అభిమానులు మరింత సమాచారం కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే ఆల‌స్య‌మ‌య్యే కొద్దీ కల్కిని మ‌రింత గ్రాండియ‌ర్ గా తీర్చిదిద్దేందుకే ఆలస్య‌మ‌ని భావించాల్సి ఉంటుంది. మే 24న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంద‌ని బలమైన‌ టాక్ ఉంది. జూన్‌లో ప్రత్యామ్నాయ విడుద‌ల తేదీని కూడా వెతికారు. కానీ అప్పుడు రిలీజ్ అయ్యే అవ‌కాశం తక్కువ ఉంది. అధికారిక ప్రకటన ఈ ఊహాగానాలకు తెర దించాల్సి ఉంది. మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన `భారతీయుడు 2` జూన్‌లో విడుదల కానుందని ధృవీకరించారు. ఇలాంటి స‌మ‌యంలో కల్కి 2898 ADలో విల‌న్ గా న‌టించిన క‌మ‌ల్ హాస‌న్ మూవీ భార‌తీయుడు 2 తో పోటీకి దిగ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుందన‌డంలో సందేహం లేదు.

నార్త్ ఇండియాలో అమితాబ్ - దీపిక వంటి స్టార్ల‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇప్ప‌టికే క‌ల్కి థియేట్రికల్ రైట్స్ ని అనిల్ తడానీకి రూ.100 కోట్ల‌కు అమ్మినట్లు తెలుస్తోంది. `పుష్ప 2: ది రూల్` తర్వాత ఇది రెండవ అతిపెద్ద డీల్ అని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Full View
Tags:    

Similar News