కల్కి.. ఇదిగో అమితాబ్ పాడిన అశ్వత్థామ పాట!

అద్భుతమైన విజువల్స్ తో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తోంది.

Update: 2024-07-11 14:44 GMT

రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ''కల్కి 2898 AD''. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ గా మూడో వారంలో అడుగుపెడుతోంది. ఇది ఇండియన్ మైథాలజీని ఫ్యూచర్ వరల్డ్ కు ముడిపెడుతూ తీసిన సైన్స్ ఫిక్షన్ మూవీ. అద్భుతమైన విజువల్స్ తో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తోంది.

'కల్కి' సినిమాలో విజువల్స్, యాక్షన్ తో పాటుగా ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ల పాత్రలు హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా అశ్వత్థామ పాత్రలో అమితాబ్ అదరగొట్టాడు. సినిమా మొత్తం ప్రభాస్ కు ధీటుగా నిలబడ్డాడు. 81 ఏళ్ళ వయసులోనూ లెజెండరీ నటుడు రిస్కీ స్టంట్స్ చేసారు. అంతేకాదు ఈ మూవీ కోసం స్వయంగా ఓ పాట కూడా పాడారు. టైటిల్స్ పడే సమయంలో వచ్చే ఈ సాంగ్ ను 'వెయిట్ ఆఫ్ అశ్వత్థామ' పేరుతో మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసారు.

'కల్కి 2898 ఏడీ' మూవీ హిందీ వెర్షన్ కోసం అమితాబ్ బచ్చన్ ఈ కేశవ మాధవ పాటను ఆలపించారు. బిగ్ బీ తనదైన బేస్ వాయిస్ తో పాడిన ఈ సాంగ్.. ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అమరుడిగా ఉండిపోతావని అశ్వత్థామను శ్రీకృష్ణుడు శపించి, కల్కి రాక కోసం వేచి ఉండాలని చెప్పిన తర్వాత.. మహాభారతం నుంచి క్రీ.శ 2898 మధ్య జరిగిన 6000 సంవత్సరాల విషయాలను ఈ పాటలో యానిమేషన్ రూపంలో చూపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగిన చారిత్రక విప్లవాలు, నేరాలు, దురాగతాలను చూపిస్తూ.. కల్కి పుట్టుక ఆవశ్యకతను, అశ్వత్థామ నిరీక్షణను ఆవిష్కరిస్తుంది.

ఇక చివర్లో అశ్వత్థామ ఈ దురాగతాలన్నింటినీ చూడలేక కళ్ళు మూసుకొని ఒక గుడిలోకి వెళ్లి కల్కి కోసం ప్రార్థన చేయడాన్ని మనం చూడొచ్చు. 'కేశవ మాధవ' పాటకు సంతోష్ నారాయణన్ మంచి ట్యూన్ కంపోజ్ చేయగా.. సిద్ధార్థ్ - గరిమ నేపథ్యానికి తగ్గట్టుగా అర్థవంతమైన హిందీ సాహిత్యాన్ని అందించారు. అమితాబ్ అద్భుతంగా ఆలపించారు. యానిమేషన్ ద్వారా ఈ సాంగ్ ను డిజైన్ చేసిన టీమ్ కృషిని, అలాంటి ఆలోచనలను తెర మీదకు తీసుకొచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ పనితనాన్ని కచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే.

'కల్కి 2898 ఏడీ' చిత్రంలో భైరవ అనే బౌంటీ హంటర్ పాత్రలో ప్రభాస్ నటించారు. అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడు సుప్రీం యాష్కిన్ పాత్రను కమల్ హాసన్ పోషించగా.. దీపికా పదుకునే, దిశా పటాని, శోభన, అన్నా బెన్, పశుపతి, శాశ్వత ఛటర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అర్జునుడిగా విజయ్ దేవరకొండ క్యామియో అప్పీరియన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. క్లైమాక్స్ లో ప్రభాస్ ను కర్ణుడిగా చూపించి అందరినీ సర్ప్రైజ్ చేయడమనే కాదు, 'కల్కి' పార్ట్-2పై అంచనాలు రెట్టింపు అయ్యేలా చేసారు.

Full View
Tags:    

Similar News