అమితాబ్ త‌ర్వాత నేనే.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కంగ‌న‌!

కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రచార ప్రసంగంలో తనను తాను లెజెండ్ అమితాబ్ బచ్చన్‌తో పోల్చుకుంది

Update: 2024-05-06 08:25 GMT

కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రచార ప్రసంగంలో తనను తాను లెజెండ్ అమితాబ్ బచ్చన్‌తో పోల్చుకుంది. ఇది ఆన్‌లైన్ చర్చలకు దారితీసింది... వివ‌రాల్లోకి వెళితే..

క్వీన్ కంగనా రనౌత్ ఎన్నిక‌ల ప్రచ‌రంలో త‌న‌దైన దూకుడు కొన‌సాగిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ -మండి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ (బిజెపి) త‌ర‌పున‌ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న‌ ఉత్సాహంలో ఉన్న కంగ‌న త‌న నోటికి ఎదురే లేకుండా ప‌ని చెబుతుండ‌డం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ‌కీయారంగేట్రం నేప‌థ్యంలో క్వీన్ చెల‌రేగుతోంది. ఉత్సాహభరితమైన ప్రచారం.. సూటిగా మాట్లాడే త‌త్వంతో ప్ర‌జ‌ల్ని విశేషంగా ఆక‌ర్షిస్తోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ర్యాలీ ప్రసంగం తర్వాత తనను తాను బాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు అమితాబ్ బచ్చన్‌తో ధైర్యంగా పోల్చుకుంది. ఆ మేర‌కు ప్ర‌ఖ్యాత బాలీవుడ్ హంగామా ఒక క‌థ‌నంలో వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

''సారా దేశ్ హేరాన్ హై, కి వో కంగనా, చాహే రాజస్థాన్ చలీ జౌ, చాహే మై వెస్ట్ బెంగాల్ చలీ జౌ, చాహే మై ఢిల్లీ చలీ జౌ, చాహే మై మణిపూర్ చాలీ జౌ, ఐసా లగ్తా హై కి మనో ఇత్నా ప్యార్ ఔర్ ఇత్నా సమ్మాన్ ... మే దావే సే హు కే అమితాబ్ బచ్చన్ జీ కే బాద్ ఆజ్ కిసీకో ఇండస్ట్రీ మే మిల్తా హై తో వో ముఝే మిల్తా హై'' అని హిందీలో స్పీచ్ ఇచ్చింది కంగ‌న‌. దీని సారాంశం ఇలా ఉంది. ''దేశమంతా ఆశ్చర్యంగా ఉంది... నేను రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ లేదా మణిపూర్ ఎక్క‌డికి వెళ్లినా అక్కడ చాలా ప్రేమ, గౌరవం ఉన్నట్లు అనిపిస్తుంది. నేడు అమితాబ్ బచ్చన్ తర్వాత పరిశ్రమలో ఎవరికైనా అలాంటి ప్రేమ, గౌరవం లభిస్తే అది నాకే అని నమ్మకంగా చెప్పగలను'' అని ర్యాలీ సందర్భంగా కంగ‌న ఉటంకించింది. త‌న ప్ర‌సంగంలో ఎక్క‌డా తొట్రుపాటు లేకుండా కంగ‌న ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది.

క్వీన్ కామెంట్‌కి సంబంధించిన‌ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నెటిజన్ల నుండి ర‌క‌రకాల అభిప్రాయాలు దీనిపై వ్యక్త‌మ‌య్యాయి. అయితే ఇటీవల వ‌ర‌స‌ బాక్సాఫీస్ డిజాస్ట‌ర్ల‌ను ఎదుర్కొంటున్న కంగ‌న‌ బాలీవుడ్‌లోని అత్యంత గౌరవనీయమైన లెజెండ‌రీ న‌టుడితో త‌న‌ను తాను పోల్చుకోవ‌డంపై చాలా మంది ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక నెటిజ‌న్ ఇలా వ్యాఖ్యానించారు. ''కంగన చివరి హిట్ చిత్రం 2015లో వచ్చింది. ఆ తర్వాత హిట్ట‌న్న‌దే లేదు. ఇటీవ‌ల విడుద‌లైన‌ ధాక‌డ్ ఘోరంగా ఫ్లాపైంది. ఇంత‌లోనే ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కురాలి అవ‌తారం ఎత్తింది. కంగ‌న‌ ప్రసంగాల మాట‌కు వ‌స్తే.. ఎన్నికల అభ్యర్థిగా తన పాత్రకు దేశంలో మొద‌టి జాతీయ అవార్డు పొందిన న‌టి కంగనా రనౌత్ కావచ్చు!'' అని ఎక్స్ ఖాతాదారు వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరపు ఉత్తమ జోక్ అని కూడా ఒక‌రు అభివర్ణించారు.

ఎక్స్ ఖాతాదారు కంగన 2022 యాక్షన్ చిత్రం 'ధాకడ్' ఘోరమైన బాక్సాఫీస్ ప‌రాజ‌యానికి సంబంధించిన‌ పాత వార్తా కథనానికి సంబంధించిన ఫోటోని అప్‌లోడ్ చేసి నిందించాడు. ''ధాకడ్ బాక్సాఫీస్ కలెక్షన్: కంగనా రనౌత్ చిత్రం 8వ రోజున 20 టిక్కెట్లు అమ్ముడై రూ. 4420 వసూలు చేసింది'' అని దెప్పి పొడిచాడు.

మండి లోక్‌సభ నియోజకవర్గం 2018 సార్వత్రిక ఎన్నికల చివరి దశ(ఏడో ద‌శ‌)లో అంటే జూన్ 1న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 2019లో బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ శర్మ ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. అయితే 2021లో ఆయన మరణించిన తర్వాత అది ఖాళీ అయింది. ఆ ఏడాది తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిభా సింగ్ ఉప ఎన్నికలో సీటును తిరిగి కైవసం చేసుకున్నారు.

Tags:    

Similar News