షాకింగ్: అగ్ర బ్యాన‌ర్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌కి ఏమైంది?

టాప్ మ్యూజిక్ లేబుల్ సరేగామా ఇటీవ‌ల క‌ర‌ణ్ జోహార్ కి చెందిన‌ ధర్మ ప్రొడక్షన్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంద‌ని స‌మాచారం

Update: 2024-10-08 02:30 GMT

టాప్ మ్యూజిక్ లేబుల్ సరేగామా ఇటీవ‌ల క‌ర‌ణ్ జోహార్ కి చెందిన‌ ధర్మ ప్రొడక్షన్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంద‌ని స‌మాచారం. హిందీ మీడియా క‌థ‌నాల ప్రకారం.. ఈ ఒప్పందం ప్రస్తుతం చర్చల దశలో ఉంది. ఏ క్ష‌ణ‌మైనా ఆర్.పి సంజీవ్ గోయేంకా గ్రూప్ కి చెందిన సారేగామా సంస్థ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో మెజారిటీ వాటాను ఛేజిక్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని కొన్ని మీడియాలు క‌థ‌నాలు వండి వార్చాయి. అయితే ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా ఇంకా వెలువ‌డ‌లేదు.

ఇటీవ‌ల సినిమా వ్యాపారం మారింది. బాలీవుడ్ అగ్ర హీరోల‌ను న‌మ్మి సినిమాలు తీసినా ఆశించిన పెద్ద వ‌సూళ్లు ద‌క్క‌డం లేదు. సినిమా బావుంద‌ని టాక్ వ‌చ్చినా థియేట్రిక‌ల్ గా న‌ష్టాలొస్తున్నాయి. దీనికి తోడు ఓటీటీ, డిజిట‌ల్ డీల్స్ విష‌యంలో స్థిర‌మైన ఆదాయం క‌నిపించ‌డం లేదు. శాటిలైట్ అమ్మ‌కాల్లోను మంద‌గ‌మ‌నం కొన‌సాగుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒకేసారి వ‌రుసగా సినిమాల‌ను నిర్మిస్తూ, మ‌రోవైపు టీవీ ప్రొడ‌క్ష‌న్ ని న‌డిపించ‌డం అంత ఆషామాషీ కాదు. సెట్లో ఉన్న సినిమాల‌కు పెట్టుబ‌డులు కుమ్మ‌రించాలి. దానికి తోడు బిజినెస్ డీల్స్ వేగంగా కుదుర్చుకోవాలి. కానీ ఈ విషయంలో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఇటీవ‌ల ఆశించిన ఫ‌లితాన్ని అందుకోవ‌డం లేదు. కోవిడ్ నాటి నుంచి ప‌రిస్థితులు నానాటికీ తీసికట్టుగా మారాయి. అందుకే ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లోని ప్రాజెక్టుల్లో పెట్టుబ‌డులు పెట్ట‌గ‌లిగే పెద్ద సంస్థ‌ల‌ను క‌ర‌ణ్ చాలా కాలంగా వెతుకుతున్నారు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న సారేగామ సంస్థ‌తో డీల్ కుదుర్చుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌.

సారెగామ.. ఇండ‌స్ట్రీలో స్థిరంగా ఆదాయం ఆర్జిస్తున్న బిగ్ ప్లేయ‌ర్. ఇటీవలే డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ అయిన పాకెట్ ఏసెస్ పిక్చర్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. కరణ్ జోహార్ కొన్ని అతిపెద్ద ప్రాజెక్ట్‌లను పూర్తి చేయ‌డానికి పెట్టుబడిదారుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకే స‌మ‌యంలో వ‌రుస చిత్రాలు సెట్లో ఉండ‌టం వ‌ల్ల అన్ని ప్రాజెక్టుల‌కు డ‌బ్బును స‌మ‌కూర్చ‌డం స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. అందువ‌ల్ల పెద్ద నిర్మాణ సంస్థ‌ల అండ‌దండ‌ల‌ను అత‌డు ఆశిస్తున్నాడు. మొత్తానికి సారేగ‌మ లాంటి పెద్ద కార్పొరెట్ సంస్థ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో వాటాను ఛేజిక్కించుకుంటోంద‌న్న వార్త ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సారేగ‌మ ఇండ‌స్ట్రీలో పాపుల‌ర్ మ్యూజిక్ లేబుల్... సినిమాల నిర్మాణ రంగంలోను దూసుకెళుతోంది. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సినిమాల నిర్మాణంతో పాటు టీవీ ప్రొడ‌క్ష‌న్ లోను భారీ పెట్టుబ‌డులు పెడుతోంది.

Tags:    

Similar News