తమిళంలో మరో బిచ్చగాడు.. రిజల్ట్ ఎలా ఉందంటే?
దీపావళి ప్రత్యేకంగా విడుదలైన ఈ చిత్రానికి శివబాలన్ ముత్తుకుమార్ దర్శకత్వం వహించారు.
తమిళ సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కవిన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఎందుకంటే అతను ఎంచుకుంటున్న పాత్రలు ఆ విధంగా ఉంటున్నాయి. అంతే కాకుండా యాక్టింగ్ స్కిల్స్ తో అగ్ర దర్శకులను సైతం ఆకర్షిస్తున్నాడు. దాదా, స్టార్ వంటి విజయాల తర్వాత తాజాగా ‘బ్లడీ బెగ్గర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీపావళి ప్రత్యేకంగా విడుదలైన ఈ చిత్రానికి శివబాలన్ ముత్తుకుమార్ దర్శకత్వం వహించారు.
గతంలో తమిళంలో బిచ్చగాడు అనే సినిమా వండర్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇంకాస్త డిఫరెంట్ గా ఆ తరహా వైబ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. బ్లడీ బెగ్గర్ సినిమాను జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఫిలమెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించడం విశేషం. నిర్మాతగా నెల్సన్ దిలీప్‌కుమార్‌కి ఇది మొదటి సినిమా కావడం గమనార్హం. అమరన్, బ్రదర్ వంటి భారీ ప్రాజెక్టులు రెడ్ జైంట్ మూవీస్ ద్వారా విస్తృతంగా విడుదల కాగా, ‘బ్లడీ బెగ్గర్’ కు మాత్రం తమిళనాడులో పరిమిత థియేటర్లలో మాత్రమే ప్రదర్శనకు అవకాశం లభించింది.
విడుదలకు ముందు ట్రైలర్, ప్రోమోల ద్వారా ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందులో కవిన్ నటనకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ, సినిమా ఫైనల్ అవుట్ పరంగా విడుదల తర్వాత ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ‘బ్లడీ బెగ్గర్’ కథ, డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా సాగే సమాజంపై విమర్శలతో కూడిన చిత్రంగా సాగుతుంది. ఈ చిత్రంలో కవిన్ తన నటనతో ప్రత్యేకంగా మెప్పించారు.
ఆయన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందరి ప్రశంసలు అందుకుంటోంది. అయితే, ప్రేక్షకుల అభిప్రాయాల ప్రకారం, కథనం కొన్ని చోట్ల బలహీనంగా అనిపించిందని, కొన్ని డార్క్ కామెడీ సన్నివేశాలు బాగున్నా, కొన్ని సన్నివేశాలు మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేయలేదని, కథనం కొన్ని సందర్భాలలో నెమ్మదిగా సాగిందని అంటున్నారు. కథకు సంబంధించిన పాయింట్లు ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపించినప్పటికీ, మొత్తం కథనం అంచనాలను అందుకోలేకపోయినట్టు కనిపిస్తుంది.
మొదటి రోజు కలెక్షన్ల పరంగా చూస్తే, ‘బ్లడీ బెగ్గర్’ తమిళనాడు బాక్సాఫీస్ వద్ద సుమారు 2 కోట్ల రూపాయలు వసూలు సాధించింది. ఇది మధ్యస్థాయి బడ్జెట్ సినిమాకి సరిగ్గా సరిపడే ఓపెనింగ్ అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, కవిన్ అభిమానులు మాత్రం ఆయన నటనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కవిన్. ఈ సినిమాలోని క్యారెక్టర్ తో ఆయన మరోమారు బెస్ట్ యాక్టర్ అని చాటుకున్నారు. మొత్తం మీద ‘బ్లడీ బెగ్గర్’ ప్రేక్షకుల్లో పూర్తి స్థాయి రీచ్ కలిగించకపోయినా, కవిన్ నటన మాత్రం అందరినీ ఆకట్టుకుంది.