'కీడా కోలా' మూవీ రివ్యూ
నటీనటులు: చైతన్య రావు-బ్రహ్మానందం-తరుణ్ భాస్కర్-జీవన్ కుమార్-విష్ణు-రాగ్ మయూర్-రవీంద్ర విజయ్-రఘురాం తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: ఆరోన్
నిర్మాతలు: వివేక్ సుధాంశు-సాయికృష్ణ గద్వాల్-శ్రీనివాస్ కౌశిక్ మందూరి-శ్రీపాద్ నందిరాజ్-ఉపేంద్ర వర్మ
రచన-దర్శకత్వం: తరుణ్ భాస్కర్
పెళ్ళిచూపులు.. ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్న తరుణ్.. కొంచెం గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా 'కీడా కోలా'. ఇందులో అతను ఓ కీలక పాత్ర కూడా చేశాడు. క్రేజీ ప్రోమోలతో అంచనాలు పెంచిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను 'కీడా కోలా' ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
వాస్తు (చైతన్య రావు) 30 ఏళ్లు దాటినా జీవితంలో ఇంకా స్థిరపడక.. పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న కుర్రాడు. అతడికి మాట తడబాటు ఉంటుంది. వాస్తు తాత (బ్రహ్మానందం) అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటాడు. వీళ్లింట్లోనే ఉండే యంగ్ లాయర్ కౌశిక్ (రాగ్ మయూర్)కు కూడా కొన్ని ఇబ్బందులుంటాయి. ఈ సమస్యల మధ్య ఇంట్లో ఒక చిన్న పార్టీ చేసుకుందామని షాపుకెళ్లి డ్రింక్స్ తీసుకొస్తే.. ఒక కూల్ డ్రింక్ లో బొద్దింక కనిపిస్తుంది. తమ కష్టాలన్నీ తీరిపోయేంత డబ్బు సంపాదించడానికి ఈ బాటిలే మార్గమని భావించిన వాస్తు అండ్ కో.. కూల్ డ్రింక్ బాటిల్ మీద దావా వేద్దామని అనుకుంటుంది. ఆ ప్రయత్నంలో ఉండగా కౌశిక్ కిడ్నాప్ అవుతాడు. అప్పుడే తెలుస్తుంది ఈ బాటిల్లో బొద్దింక పడటం వెనుక ఓ కథ ఉందని.. ఆ కథేంటి.. కౌశిక్ ను కిడ్నాప్ చేసిందెవరు.. చివరికి వాసు అండ్ కో తమ సమస్యల నుంచి బయటపడ్డారా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
క్రైమ్ కామెడీ అనేది ఎవర్ గ్రీన్ జానర్. దీని కోసం ప్రత్యేకంగా అభిమానులుంటారు. ఈ జానర్ కథలన్నీ కూడా డబ్బు చుట్టూనే తిరుగుతాయి. దాని కోసం గ్యాంగులు గ్యాంగులుగా కొట్టేసుకోవడం కామన్ పాయింట్. క్షణక్షణం.. స్వామి రారా.. బ్రోచేవారెవరురా.. భలే మంచి రోజు.. ఇలా క్రైమ్ కామెడీల్లో ఏ సినిమా తీసుకున్నా.. కథ దాదాపుగా ఇలాగే ఉంటుంది. స్టోరీ రొటీన్ అనిపించినా.. నరేషన్ తో మ్యాజిక్ చేయడానికే దర్శకులు ప్రయత్నిస్తారు. టిపికల్ గా అనిపించే కొన్ని క్యారెక్టర్లను తీర్చిదిద్దుకుని.. మంచి సిచువేషన్లు క్రియేట్ చేసుకుని.. కామెడీ పండించడానికి చూస్తారు. తరుణ్ భాస్కర్ కూడా 'కీడా కోలా'లో అలాంటి ప్రయత్నమే చేశాడు. సినిమాలో కొన్ని క్రేజీ క్యారెక్టర్లున్నాయి.. కామెడీకి స్కోప్ ఉన్న సిచువేషన్లు కూడా కుదిరాయి. ఇక తరుణ్ భాస్కర్ సెన్సాఫ్ హ్యూమర్ గురించి చెప్పేదేముంది.. సింపుల్ వన్ లైనర్స్ నవ్వులు పండించగలిగాడు. ఐతే సెటప్ అంతా బాగా కుదిరినా కూడా.. ఇందులో గ్యాంగులన్నీ దేని కోసం కొట్టేసుకుంటాయో.. ఆ పాయింటే సిల్లీగా అనిపిస్తుంది. ఒక కూల్ డ్రింక్ సీసా చుట్టూ తిరిగే కథలో ఒక ఫీచర్ ఫిలిం స్థాయికి తగ్గ వెయిట్ కనిపించదు. అందువల్ల సినిమాను సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. కోర్ పాయింట్ చుట్టూ సరైన బిల్డప్ లేకపోవడం.. కథనంలో ఆసక్తి లేకపోవడం.. ముగింపు మామూలుగా అనిపించడం ఇందులోని మైనస్ పాయింట్లు. అలా అని సినిమా బోర్ కొట్టిస్తుందా అంటే అదేమీ లేదు. రెండు గంటలు బాగానే గడిచిపోతాయి. కానీ చివరికి ఒక బలమైన ఇంపాక్ట్ మాత్రం 'కీడా కోలా' వేయలేకపోయింది.
ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకొడైల్ ఫెస్టివల్ అని 'శంకర్ దాదా ఎంబీబీఎస్'లో తెలుగు సామెతను చిరు ట్రూ ట్రాన్సులేషన్ చేస్తే ఎంతగా నవ్వులు పండాయో తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత కూడా 'కీడా కోలా'లో అదే 'ఇంగ్లిష్' కామెడీని వాడుకున్నాడు తరుణ్ భాస్కర్. కానీ మళ్లీ ఇక్కడ నవ్వులకు ఢోకా లేదు. రోజూ రెండు గంటలు నిర్బంధంగా ఇంగ్లిష్ మాట్లాడాలని రౌడీ గ్యాంగ్ రూల్ పెట్టుకోవడం.. ఆ సమయంలో వాళ్లు తెలుగును ఇంగ్లిష్ లోకి అనువాదం చేసి మాట్లాడుకునే మాటలు భలే ఫన్నీగా అనిపిస్తాయిందులో. ఒక సీన్లో తన తమ్ముడికి సమస్యొచ్చిందని.. 'కార్ టేక్' అని కీస్ ఇస్తాడు తరుణ్ భాస్కర్. దానికి విష్ణు.. ''రిచ్ గిఫ్ట్ థ్యాంక్స్'' అని బదులిస్తాడు. ఒళ్లుమండి ఇంగ్లిష్ కండిషన్ పక్కన పెట్టి ''బండి తీబే'' అని అరవాల్సొస్తుంది. ఇంకో సీన్లో 'సరెండర్ ద బాటిల్' అని చెప్పిరా అని పంపిస్తే.. దాన్ని 'సురేందర్ ద బాటిల్' అని అక్కడ డైలాగ్ డెలివర్ చేస్తాడు. సురేందర్ ఎవడు అని అడిగితే.. కనుక్కుని వస్తా అని వెనక్కి వస్తాడు. మామూలుగా చూస్తే ఇవి సిల్లీ జోకులే. కానీ సిచువేషన్ ను బట్టి ఇలాంటి డైలాగులు కూడా బాగా పేలుతాయి. తరుణ్ భాస్కర్ అలాంటి ఫన్నీ సిచువేషన్లను బాగానే క్రియేట్ చేశాడు. ఆరంభం నుంచి ఒక టోన్ సెట్ చేసి.. ఇలాంటి జోకులతోనే ప్రేక్షకులను నవ్వించగలిగాడు.
సరిగ్గా రెండు గంటల నిడివి ఉన్న 'కీడా కోలా'లో గంటన్నర సమయం ఈజీగానే సాగిపోతుంది. ఏ సీనుకి ఆ సీన్ ఫన్నీగా అనిపిస్తుంది. కానీ వీటన్నింటినీ కలిపి ఒక సినిమాగా చూస్తే మాత్రం 'కీడా కోలా'లో బరువు కనిపించదు. అందుక్కారణం కథలో బలం లేకపోవడమే. కూల్ డ్రింక్ సీసాలో బొద్దింకను పెట్టి దాని మీద కోట్లు కొట్టేయాలని ప్లాన్ వేసే ఒక గ్యాంగ్.. ఆ సీసా అనుకోకుండా తమ చేతికి చిక్కి దాని మీద డబ్బులు సంపాదించాలనుకునే ఇంకో గ్యాంగ్.. వీళ్లందరూ ఒక గ్యాంగుగా మారి.. ఇంకో గ్యాంగుతో పోరాడటమే ఈ కథ. ఐతే ఈ సీసా వ్యవహారం అంత సీరియస్ గా తీసుకునేలా ఉండదు. కోట్లు సంపాదించడం ఇంత ఈజీనా అన్నట్లుగా ఉంటాయి దాని చుట్టూ అల్లిన సీన్లు. డబ్బు కోసం లీడ్ క్యారెక్టర్లు ఆరాటపడుతున్నపుడు దాని వెనుక బలమైన కారణం.. ఎమోషన్ ఉంటే.. దాంతో ప్రేక్షకులు బాగా కనెక్టవుతారు. ఇందులో అలాంటి ఎమోషన్ పెద్దగా కనిపించదు. కథను మొదలుపెట్టిన తీరు అంత ఆసక్తికరంగా అనిపించదు. వాస్తు.. అతడి తాత పాత్ర తాలూకు థ్రెడ్ బోరింగ్ గా అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ చేసిన నాయుడు పాత్ర వచ్చాక కానీ కథ ముందుకు కదలదు. అతనే ఈ సినిమాను డ్రైవ్ చేశాడు. తరుణ్ కనిపించినపుడల్లా జోష్ వస్తుంది. సినిమాలో నవ్వుల బాధ్యత చాలా వరకు అతను.. విష్ణునే తీసుకున్నారు. జీవన్ కూడా అక్కడక్కడా నవ్వించాడు. కానీ బ్రహ్మి.. చైతన్య సహా మిగతా పాత్రలు అంత ఇంపాక్ట్ వేయలేకపోయాయి. సోసోగా అనిపించే ప్రథమార్ధం తర్వాత.. ద్వితీయార్ధంలో కొంతసేపు క్రేజీ రైడ్ లాగా సాగుతుంది 'కీడా కోలా'. అందుకు తగ్గట్లే మంచి ముగింపు ఇచ్చి ఉంటే సినిమా ఇంకో స్థాయికి వెళ్లేది. కానీ హడావుడిగా.. మొక్కుబడిగా ఈ కథను ముగించేయడం వల్ల చివరికి ఏదో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. ఓపెన్ మైండ్ తో ఒక క్రైమ్ కామెడీ సినిమాలా చూస్తే 'కీడా కోలా' ఓకే అనిపిస్తుంది కానీ.. పెళ్ళిచూపులు.. ఈ నగరానికి ఏమైంది సినిమాలు తీసిన దర్శకుడు తన ఫేవరెట్ జానర్లో తీసిన సినిమా మీద మనం పెట్టుకున్న అంచనాలను మాత్రం 'కీడా కోలా' అందుకోలేకపోయింది.
నటీనటులు:
'కీడా కోలా'లో అన్ని పాత్రలకూ సరైన నటులే కుదిరారు. ఇందులో హీరో అని.. విలన్ అని ఎవరూ కనిపించరు. సమాన ప్రాధాన్యం ఉన్న కొన్ని పాత్రల మధ్య నడిచే కథ ఇది. అందరిలోకి దర్శకుడు తరుణ్ భాస్కర్ చేసిన నాయుడి పాత్రే హైలైట్ అయింది. అతడి సోదరుడిగా జీవన్ కూడా ఆకట్టుకున్నాడు. చైతన్యరావు పాత్ర మామూలుగా అనిపిస్తుంది. అతడి నటన ఓకే. బ్రహ్మానందం కామెడీ ఒకప్పటి స్థాయిలో పేలిపోలేదు కానీ.. కొన్ని నవ్వులు పంచాడు. ఆయన్ని సరిగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. బ్రహ్మికి ఇదొక భిన్నమైన పాత్ర అనడంలో సందేహం లేదు. ఇటీవలే 'మ్యాడ్'లో అదరగొట్టిన విష్ణు.. ఈ సినిమాలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. రాగ్ మయూర్ కూడా బాగా చేశాడు. రవీంద్ర విజయ్ పర్వాలేదు.
సాంకేతిక వర్గం:
వివేక్ సాగర్ సంగీతం 'కీడా కోలా'కు పెద్ద అసెట్. సినిమాకు ఒక టోన్ క్రియేట్ చేయడంలో తన బ్యాగ్రౌండ్ స్కోర్.. హమ్మింగ్స్.. బిట్ సాంగ్స్.. కీలక పాత్ర పోషించాయి. సినిమా మొదట్నుంచే క్రేజీగా అనిపించేలా చేయడంలో వివేక్ సౌండ్ కీలక పాత్ర పోషించింది. బీజీఎం తీసేసి చూస్తే 'కీడా కోలా' డల్లుగా అనిపించేదే. ఆరోన్ ఛాయాగ్రహణం తరుణ్ భాస్కర్ శైలికి తగ్గట్లుగా స్టైలిష్ గా సాగింది. విజువల్స్ వెరైటీగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. రిచ్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ కలగదు కానీ.. ఈ సినిమా స్థాయికి ఓకే అనిపిస్తుంది. రైటర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. మరోసారి తన సెన్సాఫ్ హ్యూమర్ ఎలాంటిదో చూపించాడు. అతడి వన్ లైనర్స్ సినిమాకు పెద్ద ప్లస్. ఐతే కథ పరంగా అతను మరీ చిన్న పాయింట్ తీసుకున్నాడు. అంత చిన్న పాయింట్ మీద రెండు గంటల సినిమా నడిపించి మెప్పించడం సవాలుగా మారింది. సినిమా బోర్ కొట్టదు కానీ.. ఏదో మిస్సయిన ఫీలింగ్ కలిగింది. ఓ మోస్తరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన తరుణ్.. ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ కలిగించలేకపోయాడు.
చివరగా: కీడా కోలా.. సాగిపోయింది అలా అలా
రేటింగ్ - 2.5/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater