రజనీ-కమల్ కోసం వెంకీని వదిలేసిన హీరోయిన్!
ఇప్పటి వరకూ ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు.
విక్టరీ వెంకటేష్ తొలి హీరోయిన్ ఎవరు? అంటే అందమైన ఖుష్బూ గుర్తొస్తుంది. `కలియుగ పాండవులు` చిత్రంలో వెంకటేష్ కి జోడీగా నటించింది ఆమె. ఆ సినిమాతో వెంకటేష్ అనుకోకుండా సినిమా రంగంలోకి అప్పటికప్పుడు వచ్చేసారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో అతడు ఎదిగిన వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు. తండ్రి పెద్ద నిర్మాత అయినా? తనయుడు మాత్రం తనని తాన స్టార్ గా తీర్చిదిద్దుకున్న వైనం ఎంతో మంది స్పూర్తినిస్తుంది.
ఇప్పటి వరకూ ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. అయితే అలాంటి నటుడుతో వచ్చిన ఓ గొప్ప అవకాశాన్ని కుష్బూ కోల్పోయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటేష్-మీనా జంటగా రవిరాజా పినిశెట్టి తెరకెక్కించి `చంటి` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇళయరాజా మ్యూజికల్ గానూ సినిమాని పెద్ద హిట్ చేసారు.
ఈ సినిమా తర్వాత మీనా కెరీర్ వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోయింది. అయితే వాస్తవానికి ఆపాత్రలో ఎంపికైంది కుష్బూ అని వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా రివీల్ చేసారు. `కలియుగ పాండవులు` సినిమాకు నన్ను తీసుకోవాలని వెంకటేష్ గారే సిఫార్స్ చేసారు. ఓ హిందీ సినిమాలో నన్ను చూసి అలా చెప్పారుట. ఆ తర్వాత నాగార్జున, బాలకృష్ణ గారితో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే అప్పటికే నేను తమిళ్ లో బిజీగా ఉన్నాను.
అప్పుడే తెలుగు పరిశ్రమ హైదరాబాద్ కి షిప్ట్ అవ్వాలి అన్నది గట్టిగా తెరపైకి వచ్చింది. అలాంటి సమయంలో `చంటి`లో అవకాశం వచ్చింది. కానీ అదే సమయంలో రజనీకాంత్ తో సినిమా-కమల్ హాసన్ తో ఓ సినిమా చేస్తున్నాను. దీంతో `చంటి `సినిమాకు డేట్లు సర్దుబాటు చేయడం కుదరలేదు. చంటిలో నటించాలంటే రెండు సినిమాలు వదులుకుని రావాలి. కానీ నేను ఆ ఛాన్స్ తీసుకోలేదు` అని అన్నారు.