చావా ట్రైలర్: ఛత్రపతి వారసుడి జైత్రయాత్ర కథ
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ `చావా` ట్రైలర్ తాజాగా విడుదలైంది.
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ `చావా` ట్రైలర్ తాజాగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టించింది. ట్రైలర్ లో శంభాజీ వీరత్వం, వార్ సన్నివేశాలు ఆద్యంతం అలరించాయి. ముఖ్యంగా శంభాజీ పాత్రలోకి ఒదిగిపోయి నటించిన విక్కీ కౌశల్ ని ప్రశంసించి తీరాలి. మొఘలులపై మరాఠా యోధుడి దాడులను ట్రైలర్ లో అద్భుతంగా ఆవిష్కరించారు. చావా ట్రైలర్ మాడాక్ ఫిల్మ్స్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల కాగా దానిపై అభిమానుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.
ట్రైలర్ విడుదలకు ముందు నుంచీ విక్కీ కౌశల్ నటించిన చావా ప్రేక్షకులలో గొప్ప ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం మొదట 2024 లో థియేటర్లలోకి రావాల్సి ఉండగా, వాయిదా పడింది. 2024 డిసెంబర్ లో నే విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో చావా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ హిస్టారికల్ డ్రామాలో రష్మిక మందన్న , అక్షయ్ ఖన్నా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ నేపథ్య సంగీతం ప్రధాన బలం కానుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథతో ఈ సినిమా రూపొందింది. ఇందులో శంభాజీ భార్య ఏసు భాయ్ మహారాణిగా రష్మిక మందన్న నటించింది. అక్షయ్ ఖన్నా `ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం 14 ఫిబ్రవరి 2025న పెద్ద ఎత్తున విడుదల కానుంది.