వీడియో: స్కూల్ పిల్లలతో అసభ్య నృత్యాలా?
ఇప్పుడు సినిమాల్లో చూపించే వల్గర్ డ్యాన్సులను ఏకంగా పాఠశాల చిన్నారులతో చేయించడం స్కూల్ యాజమాన్యంపై కోపాగ్నికి కారణమైంది.
పిల్లలు సినిమాలు, ఓటీటీ షోలు చూస్తూ పెరుగుతున్నారు. ఇది ఎలాంటి ప్రమాదాల్ని తెచ్చి పెడుతోందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పుడు సినిమాల్లో చూపించే వల్గర్ డ్యాన్సులను ఏకంగా పాఠశాల చిన్నారులతో చేయించడం స్కూల్ యాజమాన్యంపై కోపాగ్నికి కారణమైంది.
ఆన్ లైన్ వీడియోలో ఐటమ్ పాటల్లో చిన్నారులు నృత్యం చేయడం చూస్తున్న వారి హృదయాలను కలచివేస్తోంది. కనీసం పదేళ్ల వయసు అయినా లేని చిన్న పిల్లలతో అది కూడా పాఠశాలలో ఇలాంటి డ్యాన్సులు చేయిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి చిత్రం `స్ట్రీ 2` చిత్రం నుండి తాజా హిట్ నంబర్ `ఆజ్ కీ రాత్` పాటకు చిన్నారులు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. తమన్నా భాటియా ధరించిన పొట్టి దుస్తులను ధరించి పిల్లలు కనిపించారు.
అంతేకాదు ఈ ఐటమ్ పాటలో తమన్నా ఎలాంటి నృత్యం చేసిందో దానిని యథావిథిగా కొరియోగ్రాఫ్ చేయడం మరీ దారుణం. పైగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటో ముందు ఇలాంటి అసభ్య నృత్యాలు చేయించడం దిగజారుడుతనంగా కనిపిస్తోంది. స్కూల్ పిల్లలతో ఐటమ్ పాటలకు నృత్యాలు చేయించడం ఎంత హేయమైన ఆలోచన. స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు లేదా యాజమాన్యానికి కనీస ఇంగితం ఉండనవసరం లేదా? అంటూ ఈ వీడియో చూసిన వారు తిట్టి పోస్తున్నారు. అసభ్య నృత్యాలు చేయించడమే కాదు.. వాటిని ఇలా సోషల్ మీడియాల్లో పెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాల్లో డిమాండ్లు ఊపందుకున్నాయి.