14 ఏళ్ల తర్వాత ప్రయత్నం డెబ్యూ కన్నా దారుణంగా!
మరి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు? అన్నది తెలియదు గానీ 14 ఏళ్ల తర్వాత 'లాపతా లేడీస్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
అమీర్ ఖాన్ మాజీ వైఫ్ కిరణ్ రావు సుపరిచితమే. దర్శకురాలిగా కంటే అమీర్ మాజీ వైఫ్ గా ఆమె అందరికీ తెలుసు. కిరణ్ రావు తొలి సినిమా 'దోభీఘాట్' ఆశించిన ఫలితాలు సాధించని సంగతి తెలిసిందే. దీంతో ఆమె మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి 14 ఏళ్లు పట్టింది. మరి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు? అన్నది తెలియదు గానీ 14 ఏళ్ల తర్వాత 'లాపతా లేడీస్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇటీవలే ఈ సినిమా రిలీజ్ అయింది. ఇంత గ్యాప్ తీసుకుని రిలీజ్ చేయడంతో కిరణ్ రావ్ హిట్ కొడతారనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. థియేట్రికల్ రిలీజ్ లో సినిమా దారుణమైన పరాభవం చూసింది. ఇటీవలే సినిమా ఓటీటీలో కి అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ మాత్రం సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా వైఫల్యంపై కిరణ్ రావ్ స్పందించారు.
ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ 'ఫెయిల్యూర్' గా అభివర్ణించారు. ఫయే డిసౌజాతో మాట్లాడుతోన్న సందర్భంలో చిత్ర నిర్మాత రెండు చిత్రాల పనితీరును పోల్చారు. ఆమె రెండు సినిమాలు (ధోబీ ఘాట్ - లాపటా లేడీస్) బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదని పేర్కొన్నారు. అదే సమయంలో ధోభి ఘాట్ కనీసం బాక్సాఫీస్ వద్ద కొంత ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. కానీ లాపతా లేడీస్ కి అది కూడా లేదన్నారు.
'వైఫల్యానికి అన్ని కారణాలు విశ్లేషించుకుంటున్నా. బాక్సాఫీస్ కొలమానాల ప్రకారం మేము విజయం సాధించలేదు. సాధారంగా ఎలాంటి సినిమా రిలీజ్ అయినా వందల కోట్లు లేదా '₹30, 40, 50 కోట్లు అయినా తెస్తున్నాయి. కానీ మా సినిమా దరిదాపుల్లోకూడా లేదు. ఆ వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే. 'దోభీ ఘాట్' సమయంలో ఓటీటీ లేదు. ఉంటే ఆ సినిమా అక్కడా బాగానే రాణించేది. నేను గత పదేళ్లుగా అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నా. తొలి సినిమా తర్వాత రెండవ సినిమా వేగంగానే రిలీజ్ చేద్దాం అనుకున్నా. కానీ అలా జరగకపోగా అంతకంతకు సవంత్సరాలు సమయం పట్టింది. దీంతో విసుగు చెందాను` అని అన్నారు.