ఇంట్లో ఏమైనా చేసుకో.. కానీ బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి: డి. సురేష్ బాబు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమైన సంగతి తెలిసిందే.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమైన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకోవడం, అసెంబ్లీ వేదికగా సినీ జనాలపై సీఎం ఫైర్ అవ్వడం, ఇకపై బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఉండవని ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మీటింగ్ లో ఏ అంశాలపై చర్చించారనే దానిపై ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాకి వివరాలు తెలియజేసారు. తాజాగా నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
రేవంత్ రెడ్డితో మీటింగ్ చాలా బాగా జరిగింది. చాలా క్లియర్ గా అన్ని విషయాలపై కంఫర్టబుల్ గా మాట్లాడుకున్నాం. ఇది చాలా పాజిటివ్ గా ఫ్యూచరిస్టిక్ గా జరిగిందని సురేష్ బాబు చెప్పారు. గతంలో ఫిలిం ఇండస్ట్రీని చెన్నై నుంచి హైదరాబాద్ కి తీసుకురావడానికి కొన్ని దశాబ్దాలు కృషి చేసారు.. ఇప్పుడు హైదరాబాద్ ను ఫిలిం మేకింగ్ కి గ్లోబల్ డెస్టినేషన్ గా ఎలా చేయాలనే దానిపై ఫోకస్ చెయ్యాలని సీఎం చెప్పినట్లుగా తెలిపారు. భారీ బడ్జెట్ ఇన్వెస్ట్ చేసిన నిర్మాతలు స్పెషల్ రేట్లు కోరుకుంటారని, తన వరకూ తమిళనాడు మోడల్ ఇష్టమని సురేష్ చెప్పారు. గరిష్ట ధర అనుకూలంగా ఉండి, రేట్లు ఫ్లెక్సిబుల్ గా ఉంటే అందరికీ బాగుంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.
నార్త్ ఇండియాలో మల్టిఫ్లెక్స్ లు వచ్చిన తర్వాత టికెట్ రేట్లు చాలా ఎక్కువ చేసారు. దాంతో కొన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. దాని వల్ల ఇవాళ సౌత్ ఇండియా సినిమా ఆ గ్యాప్ ని ఫిల్ చేసింది. అందుకే హిందీ మాట్లాడని ఒక సౌత్ యాక్టర్ నటించిన 'పుష్ప 2' లాంటి డబ్బింగ్ మూవీ ఇప్పుడు నెం.1 హిందీ సినిమాగా నిలిచింది అని సురేష్ బాబు విశ్లేషించారు. సినిమాని ఒక ఆర్ట్ గా భావించినవాళ్లు ఎంత మందికి రీచ్ అయిందనేది చూస్తారని, కమర్షియల్ గా చూసేవాళ్ళు ఎంత కలెక్షన్స్ వచ్చాయనేది లెక్కగడతారని, ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారని అన్నారు.
సంధ్య థియేటర్ ఘటనను నటుడు మురళీమోహన్ సీఎం దగ్గర ప్రస్తావించారని సురేష్ బాబు తెలిపారు. ''అలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. చాలా బాధాకరం. అలాంటి భవిష్యత్తులో జరక్కుండా చూసుకోడానికి ప్రయత్నిస్తాం. ఇకపై మరింత జాగ్రత్తగా బాధ్యతగా ఉంటాం. ఇప్పుడు అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లు ఉంటున్నాయి. సెలబ్రిటీలు ఎక్కడ వెళ్లినా ఫోటోల కోసం మీద పడిపోతున్నారు. ఇంస్టాగ్రామ్ రీల్స్ రావడం వల్ల స్టార్స్ మీద ఇంతకముందు కంటే ఎక్కువ ప్రెజర్ పడుతోంది. ఆ విషయంలో స్టార్లు, పబ్లిక్ ఇద్దరూ కంట్రోల్ చేసుకోవాలి. ప్రజల్లో ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉందనే దానిపై ఇండస్ట్రీ అవగాహన కలిగి ఉండాలి. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి'' అని అన్నారు.
''తొక్కిసలాట ఘటనలు ఎక్కడైనా, ఎప్పుడైనా జరగొచ్చు. ఈవెంట్స్ ఎక్కడ చేసినా జనాలు ఎక్కువగా వస్తున్నారనే దానిపై అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఈవెంట్స్ గురించి మనం ఎక్కువగా పబ్లిసిటీ చేస్తున్నాం. ఎక్కువమందికి షేర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈవెంట్స్ నిర్వహణలో కచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇకపై అన్నీ తెలుసుకొని కరెక్ట్ చేసుకుంటాం. ఇలాంటి ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు. ఇంటెర్నేషనల్ ఫుట్ బాల్ మ్యాచుల సమయంలోనూ ఇలాంటి ఇన్సిడెన్స్ జరుగుతున్నాయి. మాబ్ ఫ్రెంజీ తో ప్రాబ్లమ్ ఉంది. మనం మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది''
''వెళ్ళేవాళ్ళు కూడా తెలుసుకోవాలి. అంతమంది జనం ఉంటే మనం వెళ్లకూడదు కదా. వెళ్లే వాళ్లు కంట్రోల్ చేసుకోవాలి. క్రౌడ్ ను కంట్రోల్ చేసే వాళ్లు బెటర్ గా కంట్రోల్ చేయాలి. పోలీసులు, లోకల్ సెక్యూరిటీ.. ఇలా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. పబ్లిక్ ప్లేస్ లకు వెళ్లేటప్పుడు మన బిహేవియర్ పాటర్న్ కొంచం జాగ్రత్తగా ఉండాలి. జపాన్ లో ట్రైన్ లో కూడా ఎవరూ గట్టిగా మాట్లాడరు. ఎందుకంటే అది పబ్లిక్ స్పేస్. మన దగ్గర ట్రైన్ లో పది మంది కలిస్తే గోల గోల చేస్తుంటాం. మిగతా వాళ్ళని మనం రెస్పెక్ట్ చెయ్యం''
''పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అనేది ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. అది అందరం తెలుసుకుంటే ఆటోమేటిక్ గా అంతా బెటర్ అవుతుంది. అది ఓవర్ నైట్ లో అవ్వదు. పిల్లలకు సివిక్ సెన్స్ నేర్పించాలి. స్కూళ్లు, కాలేజీల నుంచే నేర్పించాలి. ఈ ప్రాబ్లమ్ ప్రజల నుంచి, మన బిహేవియర్ నుంచే క్రియేట్ అవుతుంది. కాబట్టి పబ్లిక్ ప్లేసులకు వెళ్లినప్పుడు కచ్చితంగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. నీ ఇంట్లో నువ్వు ఎగురు, డ్యాన్స్ చెయ్యి, ఏమైనా చెయ్యి.. కానీ బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలి కదా'' అని నిర్మాత సురేశ్ బాబు చెప్పుకొచ్చారు.