సెట్ లో బాలయ్య సంస్కారం..అందరికీ నమస్కారం!
ఆయనలో నిరాడంబరతను తెలిపే ప్రయత్నం చేసారు సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి. బాలయ్య తో ఆయనకున్న అనుబంధాన్నిగుర్తు చేసుకున్నారు.
నటసింహ బాలకృష్ణ వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? అన్నది తెలిసిందే. ముక్కుమీద కోపమైనా మనసు మాత్రం వెన్న. ఆయన పూర్తిగా దర్శకుల హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెట్ లో కి వెళ్లిన త ర్వాత దర్శకుడు ఏం చెబితే అదే చేస్తారు. ఆయన సొంత క్రియేటివిటీతో అలా చేద్దాం..ఇలా చేద్దామనే సలహాలివ్వరు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే వాళ్లకు మించి నటులుగా మనకేం తెలుస్తుంది? అంటారు.
అందుకే ఆయన దర్శకుల హీరో అయ్యారు. అలాగే సహ నటుల విషయంలో ఎంతో రెస్పెక్ట్ తో ఉంటారు. సెట్ లోనూ అంతే సరదాగా ఉంటారు. చుట్టూ పక్కల వారితో జోకులేస్తాడు. చిన్న పిల్లలుంటే ఆవాళ్లతోపాటు బాలయ్య కూడా పిల్లాడిగా మారిపోతారు. ఇదంతా ఇప్పుడు. మరి బాలయ్య సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేవారు? ఆయనలో నిరాడంబరతను తెలిపే ప్రయత్నం చేసారు సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి. బాలయ్య తో ఆయనకున్న అనుబంధాన్నిగుర్తు చేసుకున్నారు.
'రామారావుగారికి నా మీద మంచి నమ్మకం ఉండేది. ఓసారి ఆయన బాలయ్య బాబు కోసం మంచి కథ రెడీ చేయమన్నారు. ఓ కథను రాసుకుని వెళ్లి వినిపించాను. పది నిమిషాల్లో ఓకే చేశారు. ఆ సినిమానే 'అనసూయమ్మగారి అల్లుడు'. బాలయ్య బాబు సెట్లో చాలా సరదాగా ఉండేవారు. రామారావుగారి అబ్బాయిని, ముఖ్యమంత్రి కొడుకుని, గోల్డెన్ స్పూన్ , ఈ సినిమాకి నేను హీరోని, మనం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి అన్న భావనలో ఆయనలో ఏనాడు చూడలేదు.
చాలా సరదగా ఉండేవారు. బాలకృష్ణ గారు సెట్లోకి వచ్చారంటే అందరికీ నమస్కరించుకుంటూ వెళ్లేవారు. సొంత బ్యానర్లో సినిమా అయితే 'టీ తాగారా? భోజనాలు చేశారా? అని ఎంతో ఆప్యాయంగా అడిగేవారు. అందరితో కలిసిపోయేవారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హీరో మాదిరిగా ఉండేవారు. ఎలాంటి గర్వం లేకుండా అందరితో కలిసి భోజనం చేసేవారు. నేను ఎప్పుడు ఎక్కడ కలిసినా మా ఇంట్లోని వాళ్లందరినీ పేరు పేరునా అడుగుతారు. అది ఆయన గొప్పతనం' అని అన్నారు.