దేవర 2.. టాప్ స్టార్స్ పై కొరటాల కన్ను

కొరటాల శివ ఇటీవల బాలీవుడ్ మీడియా చానల్‌కు వర్చువల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఈ విషయం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-11 05:53 GMT

దేవర చిత్రంతో కొరటాల శివ మొత్తానికి కొత్త ఉత్సాహం తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆచార్య గాయం నుంచి కోలుకునే విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లు సాధించింది. అయితే కొందరు సినీ విశ్లేషకులు ఇది కొరటాల శివ నుంచి వచ్చిన ఉత్తమమైన సినిమా కాదని అభిప్రాయపడుతున్నారు. అయినా, ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు, ప్రేక్షకుల స్పందనను చూసి కొరటాల శివను ఊపిరి పీల్చుకునేలా చేసిందని చెప్పాలి.

ఇప్పుడంతా దేవర 2 గురించి చర్చలు జరుగుతున్నాయి. కొరటాల శివ ఇటీవల బాలీవుడ్ మీడియా చానల్‌కు వర్చువల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఈ విషయం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేవర సీక్వెల్‌లో మరొక భాషా నటుడిని చూడాలని అనుకుంటున్నారా అని అడిగినప్పుడు, కొరటాల శివ ఇద్దరు బడా స్టార్స్ పేర్లు చెప్పడం విశేషం.

రణ్‌వీర్ సింగ్ లేదా రణ్‌బీర్ కపూర్‌ను సినిమాలో చూడాలని తన మనసులో కోరిక ఉన్నట్లు వెల్లడించారు. ‘‘నిజంగా చెప్పాలంటే, రణ్‌వీర్ సింగ్ లేదా రణ్‌బీర్ కపూర్‌ లాంటి బాలీవుడ్ స్టార్లు దేవర 2లో ఉండాలని నా అభిలాష. కానీ ఇది జరిగే అవకాశం ఉంటుందా లేదా అని ఇప్పటికి నేను ఖచ్చితంగా చెప్పలేను,’’ అని కొరటాల శివ సమాధానం ఇచ్చారు.

‘‘ఇది స్పాయిలర్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు కానీ దీనిపై ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను,’’ అంటూ కొరటాల శివ ఆసక్తిని పెంచేలా మాట్లాడారు. దీంతో, నెటిజన్లలో ఈ ఇద్దరు బాలీవుడ్ స్టార్లు దేవర 2లో కనిపిస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. ఇదే విషయంపై కొరటాల శివ ఇంకా ఎలాంటి నిర్ధారణ ఇవ్వకపోయినా, ఇది కేవలం తన కోరిక అని ఆయన వెల్లడించారు.

అయితే, రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ లాంటి నటులు మంచి క్యారెక్టర్స్ దొరికితే తమ ప్రతిభను ప్రదర్శించడంలో ముందుంటారు. ఈ ఇద్దరు బాలీవుడ్ లో అత్యంత ప్రతిభావంతులైన యంగ్ హీరోలు. వీరు ఎన్టీఆర్ తో దేవర 2లో నటిస్తే మాత్రం ఆడియెన్స్ కు అది నెవ్వర్ బిఫోర్ మూమెంట్ తరహాలో కిక్కిస్తుంది.

కాని, ప్రస్తుతం ఈ విషయం ఇంకా చర్చల్లో మాత్రమే ఉందని, కాస్టింగ్ విషయాలపై ఇప్పుడే మాట్లాడటం త్వరపాటు అవుతుందని కొరటాల శివ పేర్కొన్నారు. ఎందుకంటే, దేవర 2 సినిమా ఇంకా స్క్రిప్ట్ వర్క్ దశలోనే ఉంది, షూటింగ్ ప్రారంభానికి చాలా సమయం ఉంది. ఈ సినిమా కోసం అనేక మంది స్టార్ నటుల పేర్లు వినిపిస్తుండగా, కేవలం ఈ విషయంలో ఇప్పటికీ ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ రణ్‌వీర్ సింగ్ లేదా రణ్‌బీర్ కపూర్ లాంటి స్టార్లు ఈ చిత్రంలో ఉంటే, దేవర 2 పైన మరింత భారీ అంచనాలు పెరుగుతాయని చెప్పొచ్చు.

Tags:    

Similar News