'నాటు నాటు' గాయకులకు K-పాప్ బ్యాండ్ ఆఫర్
K-పాప్ బ్యాండ్.. ఇటీవలి కాలంలో విస్త్రతంగా ప్రచారంలో ఉన్న పేరు ఇది. ఈ బ్యాండ్ కి ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు.
K-పాప్ బ్యాండ్.. ఇటీవలి కాలంలో విస్త్రతంగా ప్రచారంలో ఉన్న పేరు ఇది. ఈ బ్యాండ్ కి ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో ఉన్న డజను మంది ప్రతిభావంతులు మిలియన్ల డాలర్ల రెవెన్యూ సంపాదించడం చాలా సులువు. కె-పాప్ బృందం నిరంతరం వారి సింగిల్స్ ఆల్బమ్స్ తో యువతరాన్ని అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కే-పాప్ బృందం `నాటు నాటు..` గాయకులతో పని చేయాలని తహతహలాడుతోంది. తెలుగు గాయకులు రాహుల్ సిప్లిగంజ్- కార్తికేయ నాటు నాటు పాటను ఆలపించారు. 95వ అకాడమీ అవార్డ్స్‌లో RRRలోని ఈ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.
ఈ పాట కొరియన్ పాప్ సెన్సేషన్ K-పాప్ బ్యాండ్ కి చెందిన మస్ట్ -B గ్రూప్ ని ఎంతగానో ఆకర్షించింది. ముఖ్యంగా కాలభైరవ - రాహుల్ సిప్లిగంజ్ ల గానం.. చరణ్- ఎన్టీఆర్ డ్యాన్సులకు ఫిదా అయిపోయారట. ఈ విషయాన్ని కె-పాప్ బృంద సభ్యులు ఇటీవల దిల్లీ పర్యటనలో వెల్లడించారు.
దిల్లీలో కె-పాప్ ప్రదర్శన:
ఇంతకీ కె-పాప్ బృందం దిల్లీ పర్యటనకు ఎందుకు వచ్చారు? అంటే వివరాల్లోకి వెళ్లాలి. భారతదేశం - కొరియా మధ్య దౌత్య సంబంధాల 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 25న ఒక వేడుక కచేరీలో ప్రదర్శన ఇచ్చేందుకు కె-పాప్ సభ్యులు విచ్చేశారు. ఈ కచేరీ న్యూఢిల్లీ- జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది. సుప్రసిద్ధ గాయని నీతి మోహన్ కూడా కచేరీలో పాడారు. మస్ట్ B వారి రెండు పాటలు - రష్ - రియలైజ్ (2020 సాంగ్)లను ఈ వేదికపై ప్రదర్శించారు. పర్మిషన్ టు డ్యాన్స్ అనే BTS పాటను పాప్ గ్రూప్ ప్రదర్శించగా అహూతులను ఆకట్టుకుంది. కె-పాప్ బృంద సభ్యులు RRR నుండి నాటు నాటు హుక్ స్టెప్‌ను కూడా ప్రదర్శించారు.
కచేరీ అనంతరం జరిగిన సంభాషణల్లో నాటు నాటు గాయకులతో కలిసి పని చేయాలనుకుంటున్నట్టు కె-పాప్ బృందం వెల్లడించింది. నిజానికి ఇది గొప్ప ప్రకటన. తెలుగు కుర్రాళ్లు అయిన రాహుల్ సిప్లిగంజ్- కాలభైరవలకు ఇది అరుదైన అవకాశం. తమ ప్రతిభను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించేందుకు దక్కిన గొప్ప ఛాన్స్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కె.పాప్ సభ్యులకు అమీర్ ఖాన్ నటించిన `3 ఇడియట్స్` ఎంతో బాగా నచ్చిందట. ఈ చిత్రాన్ని తాము చూశామని ``ఒక కళాశాలలో ముగ్గురు కుర్రాళ్ల జీవితంలో సంఘటనలతో కూడిన కథాంశం నచ్చిందని వారు వెల్లడించారు. స్టడీస్‌లో భాగంగా తమ పాఠశాలలోని విద్యార్థులకు ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామని తెలిపారు.
మస్ట్ B అంటే ఏమిటి?
ఇది K-పాప్‌లో ఒక బృందం. 2019లో ఏడుగురు సభ్యుల సమూహంగా ప్రారంభమైంది. మొదటి సింగిల్ ఆల్బమ్ `ఐ వాంట్ యు`ని ఈ బృందం విడుదల చేసింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూసిందే లేదు. కె-పాప్ అంటే కొరియన్ పాప్ కల్చర్ అని అర్థం. ఇప్పుడు కె-పాప్ సింగిల్ ఆల్బమ్స్ కి ప్రపంచవ్యాప్తంగా యువతరంలో అసాధారణ ఫాలోయింగ్ ఏర్పడింది.