బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీని కిల్ చేసిన అగ్రనిర్మాత
ఏదైనా వేడిగా ఉన్నప్పుడే ఆరగించాలి. లేదంటే దాని రుచిని కోల్పోతాం! ఇదే ఫార్ములా ఇటు సినిమా ఇండస్ట్రీకి వర్తిస్తుంది.
ఏదైనా వేడిగా ఉన్నప్పుడే ఆరగించాలి. లేదంటే దాని రుచిని కోల్పోతాం! ఇదే ఫార్ములా ఇటు సినిమా ఇండస్ట్రీకి వర్తిస్తుంది. ఏదైనా టాపిక్ బర్నింగ్ ఇష్యూలా మరుగుతున్నప్పుడే దాని గురించి ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తారు. చాలా ఎక్కువ గ్యాప్ వస్తే ఇక దానిని మర్చిపోతారు. కొన్నేళ్ల పాటు తాత్సారం చేసిన క్రిష్ ఫ్రాంఛైజీ సినిమా క్రిష్ 4 విషయంలోను అదే జరుగుతోందా? అంటే అవుననే విశ్లేషిస్తున్నారు.
భారతదేశంలోనే అత్యంత క్రేజీ ఫ్రాంఛైజీగా 'క్రిష్'కి గుర్తింపు, ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్రాంఛైజీ నుంచి వరుసగా సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ని క్రిష్ పాత్రలో చూసేందుకు పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఆసక్తిగా ఉంటారు. కానీ ఏం జరిగిందో నిర్మాత రాకేష్ రోషన్ ప్రతిసారీ ''ప్రకటనలు ఘనం.. పనులు శూన్యం!'' అన్న చందంగా ఈ సినిమాని పట్టాలెక్కించేందుకే చాలా తాత్సారం చేస్తున్నారు. ప్రతిసారీ హృతిక్ బర్త్ డే వచ్చినప్పుడు కొన్ని ఫీలర్లు వదులుతున్నారు తప్ప ప్రారంభోత్సవం గురించి సరైన స్పష్ఠత లేదు. ఫలానా టైమ్ కి ప్రారంభించి, ఫలానా టైమ్ కి థియేటర్లలోకి తెస్తామని క్లారిటీ కూడా ఎక్కడా లేదు. దీనివల్ల క్రేజీ ప్రాజెక్ట్ పై బజ్ అంతగా లేకుండా పోయింది.
అయితే కొద్దిరోజులుగా ఈ ప్రాజెక్టుపై కదలికలు వచ్చినట్టు టాక్ అయితే వినిపిస్తోంది. కానీ ఇంకా నమ్మకం అయితే కుదరడం లేదు. హృతిక్- రాకేష్ రోషన్ సూపర్-హీరో ఫ్రాంచైజీ క్రిష్ నాల్గవ భాగం 11 సంవత్సరాలుగా హోల్డ్‌లో ఉంది. అయితే ఇది ఎట్టకేలకు వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుందంటూ హిందీ మీడియా కథనాలు అల్లుతోంది. అయినా ఇంకా ధృఢమైన నమ్మకం అయితే కుదరడం లేదు.
ఇలాంటి సన్నివేశంలో ఈ ఫ్రాంఛైజీలోకి శ్రద్ధా కపూర్ ప్రవేశిస్తోందంటూ టాక్ స్ప్రెడ్ అవుతోంది. నిజానికి 2023లోనే క్రిష్ 4లో శ్రద్ధా కపూర్ ప్రవేశం గురించి హృతిక్ రోషన్ హింట్ ఇచ్చాడు. కానీ చాలా మందికి అది అర్థం కాలేదు. శ్రద్ధా అప్పట్లోనే సూర్యకి ముద్దుపెట్టుకున్న కొన్ని సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ''జాదూ లాంటి ధూప్ కావాలి'' అని క్యాప్షన్ ఇచ్చింది. శ్రద్ధా పోస్ట్‌పై హృతిక్ రోషన్ ఇలా వ్యాఖ్యానించాడు. ''అతడు వస్తున్నాడు... అతనితో చెబుతా'' అని రాసాడు. ''అసలు ??? ఎప్పుడు ఎక్కడ? చెప్పండి చెప్పండి..'' అంటూ శ్రద్దా సంభాషణను కొనసాగించింది. అన్నీ కుదిరితే శ్రద్ధా కపూర్ త్వరలో క్రిష్ 4 చిత్రీకరణను ప్రారంభించవచ్చు అన్న ప్రచారం ఇప్పుడు మరోసారి మొదలైంది.
క్రిష్ చిత్రాలన్నిటా హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించారు. ఫ్రాంచైజీ నుంచి చివరి చిత్రం 2013లో విడుదలైంది. ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు.
కరణ్ మల్హోత్రా క్రిష్ 4కి దర్శకత్వం వహించనున్నాడని కథనాలొస్తున్నాయి. అయితే క్రేజ్ కోల్పోయాక ఈ ప్రయత్నం ఎంతవరకూ సఫలమవుతుంది? అన్నది వేచి చూడాలి.