మూవీ రివ్యూ - ఎల్2 : ఎంపురాన్

2019లో విడుదలై మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం.. లూసిఫర్. ఈ మూవీనే తెలుగులో 'గాడ్ ఫాదర్'గా రీమేక్ అయింది.;

Update: 2025-03-27 07:55 GMT
మూవీ రివ్యూ - ఎల్2 : ఎంపురాన్

'ఎల్2: ఎంపురాన్' మూవీ రివ్యూ

నటీనటులు: మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన్-మంజు వారియర్-టొవినో థామస్-అభిమన్యు సింగ్-ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు

సంగీతం: దీపక్ దేవ్

ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్

నిర్మాతలు: సుభాస్కరన్- గోకులం గోపాలన్- ఆంటోనీ పెరుంబావూర్

రచన: మురళీ గోపీ

దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్

2019లో విడుదలై మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం.. లూసిఫర్. ఈ మూవీనే తెలుగులో 'గాడ్ ఫాదర్'గా రీమేక్ అయింది. దీనికి కొనసాగింపుగా మోహన్ లాల్ తో 'ఎల్2: ఎంపురాన్' తీశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈసారి ఒరిజినలే తెలుగులోనూ రిలీజైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సీక్వెల్ ఆ అంచనాలను ఏమేర అందుకుందో తెలుసుకుందాం పదండి.

కథ:

కేరళ ముఖ్యమంత్రి రాందాస్ (సచిన్ ఖేద్కర్) మరణానంతరం తలెత్తిన సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దిన ఆయన దత్తపుత్రుడు స్టీఫెన్ నెడుంపల్లి (మోహన్ లాల్).. సీఎం స్థానంలో రాందాస్ కొడుకు జతిన్ (టొవినో థామస్)ను కూర్చోబెట్టి రాష్ట్రం విడిచివెళ్లిపోతాడు. ఐతే తండ్రి మార్గంలో ఆదర్శ పాలన సాగిస్తాడనుకున్న జతిన్ వక్ర మార్గం పడతాడు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా భారీగా కమిషన్ తీసుకుని ఒక చెక్ డ్యామ్ నిర్మించడానికి రెడీ అవుతాడు. అంతే కాక తండ్రి నెలకొల్పిన పార్టీ నుంచి వెళ్లిపోయి.. దేశ రాజకీయాలను శాసిస్తున్న బాబా భజరంగి (అభిమన్యు సింగ్)తో చేతులు కలుపుతాడు. ఇది జతిన్ సోదరి ప్రియ (మంజు వారియర్)కు నచ్చదు. చెక్ డ్యాంకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమైన ప్రియకు ఇబ్బందులు మొదలవుతాయి. దీంతో రాష్ట్రంలోకి తిరిగి స్టీఫెన్ రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇంతకీ స్టీఫెన్ ఐదేళ్ల పాటు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడు.. అబ్రాం ఖురేషిగా అతను నడుపుతున్న అండర్ వరల్డ్ లో తనకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.. కేరళకు తిరిగొచ్చాక అతనేం చేశాడు.. ఇక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'ఎల్2: ఎంపురాన్' ఇంటర్వెల్ ఎపిసోడ్లో ఫారిన్ కంట్రీలో మాఫియా డాన్ అయిన హీరో పెద్ద గ్యాంగునేసుకుని.. ఇంకో డాన్ గ్యాంగుని కలవడానికి ఒక డెన్లోకి వెళ్తాడు. ఈ డాన్స్ ఇద్దరినీ అంతమొందించడానికి ఇంటర్ పోల్ లేడీ ఆఫీసర్ తన టీంతో కలిసి ఆ డెన్ దగ్గరికి వస్తుంది. బ్యాగ్రౌండ్లో ఇంకో పెద్ద టీం ఆమెతో కోఆర్డినేట్ చేస్తుంటుంది. హీరోను పట్టేసుకుందామని ఆమె లోపలికి అడుగు పెట్టబోతుండగా బాంబు పేలుతుంది. బిల్డింగ్ కూలిపోతుంది. అంతే.. హీరో చనిపోయినట్లు మీడియాలో వార్తలు మొదలవుతాయి. కాసేపటికే కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. హీరో మద్దతుదారులు ఏడుస్తారు. ప్రత్యర్థులు సంబరాలు చేసుకుంటారు. కథలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకున్నట్లుగా పాత్రలన్నీ ఆశ్చర్యపోతుంటాయి. ఇంటర్వెల్ కార్డ్ కూడా పడిపోతుంది. కట్ చేస్తే తర్వాతి సీన్లో.. పేలిపోయిన బిల్డింగ్ లో దొరికిన శవాల్లో హీరోది లేదని తెలిసి ఇంటర్ పోల్ ఆఫీసర్ కు దిమ్మదిరిగిపోతుంది. హీరో ఏమో ఇంకో చోట హీరోయిక్ ఎంట్రీ ఇచ్చి కష్టాల్లో ఉన్న తన చెల్లిని కాపాడతాడు. ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే మలయాళం వాళ్లకు ఇలాంటి సీన్లు రాయడం-తీయడం భిన్నంగా అనిపించిందేమో కానీ.. దశాబ్దాల నుంచి ఎలివేషన్లు బిల్డప్పులతో కూడిన కమర్షియల్ సినిమాలు వందల్లో వచ్చిన టాలీవుడ్లో ఇలాంటి సీన్లు మన ప్రేక్షకులను ఏమాత్రం ఎగ్జైట్ చేస్తాయి? ఎంగేజ్ చేస్తాయి? 'లూసిఫర్'లో విషయం ఉన్న కథకే ఎలివేషన్లు జోడించి.. కమర్షియల్ టచ్ ఇచ్చి మెప్పించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈసారి మాత్రం దారి తప్పాడు. కంటెంట్ తక్కువ బిల్డప్ ఎక్కువ అన్న తరహాలో 'ఎల్2: ఎంపురాన్' తీసి నిరాశపరిచాడు.

'లూసిఫర్'లో మోహన్ లాల్ సినిమా మొదలైన నలభై నిమిషాలకు ఎంట్రీ ఇస్తాడు. కానీ అతను రంగంలోకి దిగేలోపే కథ రక్తి కడుతుంది. రసవత్తర డ్రామా పండడానికి తగ్గ పునాది పడుతుంది. లాల్ ఎంట్రీ ఇవ్వగానే గూస్ బంప్స్ వస్తాయి. పైకి సాధారణంగా కనిపించినా.. అసాధారణమైన తన నేపథ్యం గురించి తెలిసే కొద్దీ ఎలివేషన్ అదిరిపోతుంది. దీనికి తోడు కథలో అనేక మలుపులూ ఉంటాయి. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి కలుగుతుంది. ఒక దశ దాటాక హీరో చుట్టూ పెద్ద ఉచ్చు బిగుసుకుని... దీన్నుంచి అతనెలా బయటికి వస్తాడనే ఉత్కంఠ మొదలవుతుంది. సమస్యతో పాటు పరిష్కారమూ ఆకట్టుకుంటుంది. కానీ 'ఎల్-2' ఇవే మిస్సయ్యాయి. ఇక్కడ హీరో పాత్రలో పరిణామ క్రమం అంటూ ఏమీ ఉండదు. తన పాత్ర పరిచయంలోనే బిల్డప్ మామూలుగా ఉండదు. అతణ్ని ఇంటర్నేషనల్ డాన్ గా చాలా ఎత్తులో చూపించి.. ఆ తర్వాత ఇండియాలో ఒక స్టేట్ లెవెల్ కి దించుతారు. హీరోకు మొదట్లోనే అంత లెవెల్ చూపించినపుడు.. ఆ తర్వాత అతడి స్థాయికి తగ్గ ఛాలెంజ్ విసరకపోతే కథ ఎలా రక్తి కడుతుంది? ఇదే 'ఎల్2'కు అతి పెద్ద సమస్య. హీరో ఏమైనా చేసేయగలడని అర్థమైపోయాక.. తనకు ఎదురయ్యే సమస్యలేవీ పెద్దవిగా అనిపించవు. హీరో విలన్లందరూ జుజుబీల్లా కనిపిస్తుంటే.. ఇక తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ కానీ ఆసక్తి కానీ ఎలా పుడుతాయి?

'లూసిఫర్' నిడివి మూడు గంటలైనా సరే.. ఇందులో పెద్దగా కథ చెప్పిన భావన కలగదు. ఇటు అంతర్జాతీయ స్థాయిలో మాఫియా నేపథ్యంలో నడిచే ఎపిసోడ్లు కానీ.. అటు కేరళ రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఏమంత ఆసక్తి రేకెత్తించవు. విపరీతమైన బిల్డప్.. షో మోషన్ షాట్లతో ఏదో జరిగిపోతున్న భావన కలిగించడానికి ప్రయత్నించారు కానీ.. కథ మాత్రం పెద్దగా ముందుకు కదలదు. మోహన్ లాల్ ఎంట్రీ కోసం ఎదురు చూసి చూసి ప్రేక్షకులు అలసిపోతారు. ఏకంగా గంట తర్వాత కానీ తన పాత్ర ఎంట్రీ ఇవ్వదు. ఆ పాత్ర వచ్చాక కూడా పెద్దగా చేసేదేమీ ఉండదు. వరుసగా ఒక్కొక్కరి మీద ఎటాక్ చేస్తూ వెళ్తాడు. లెంగ్తీగా సాగే యాక్షన్ ఎపిసోడ్లు టేకింగ్ పరంగా ఆకట్టుకుంటాయి కానీ.. వాటిలో ఎమోషన్ మాత్రం మిస్ అయింది. హీరో మీద ఒక గట్టి దెబ్బ పడితే.. తర్వాత అతను తిరిగి కొట్టే దెబ్బ కిక్ ఇస్తుంది. కానీ ఇక్కడ మాత్రం హీరోనే పూర్తిగా పైచేయి సాధిస్తూ దూసుకెళ్లిపోతుంటాడు. నెగెటివ్ షేడ్స్ తో సాగే టొవినో థామస్ పాత్రను చాలా పేలవంగా తీర్చిదిద్దడంతో పొలిటికల్ డ్రామా అంతే తేలిపోయింది. మంజు వారియర్ పాత్ర ఒక్కటి కొంత ఆసక్తి రేకెత్తిస్తుంది. రాజకీయంగా ఆమె రైజ్ అయ్యే ఎపిసోడ్ బాగా తీశారు. పృథ్వీరాజ్ పాత్ర చుట్టూ నడిపిన రివెంజ్ డ్రామాకు.. ఈ కథకు ఏం సంబంధం అన్నది అర్థం కాదు. అది సినిమాలో బలవంతంగా ఇరికించిన ఎపిసోడ్ లాగా కనిపిస్తుంది. కథను పక్కన పెట్టి చూస్తే 'ఎల్2'లో హీరో ఎలివేషన్ సీన్లు.. యాక్షన్ ఎపిసోడ్లు అదిరిపోయాయి. స్టైలిష్ టేకింగ్.. రిచ్ మేకింగ్ తో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కానీ కథలో ఎమోషన్ మాత్రం మిస్ అయింది. డ్రామా రక్తి కట్టలేదు. ఈ తరహా ఎలివేషన్లతో కూడిన కమర్షియల్ సినిమాలు తెలుగులో కోకొల్లలు.

నటీనటులు:

'ఎల్2: ఎంపురాన్' పేరుకు మోహన్ లాల్ హీరో కానీ.. ఆయనకు ఇందులో స్క్రీన్ టైం చాలా తక్కువ. మూడు గంటల సినిమాలో ఆయన మహా అయితే ఓ ముప్పావు గంట కనిపిస్తాడేమో. కథ కూాడా ఆయన కంటే వేరే పాత్రల చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది. ఈ కథ మొదలయ్యేది ముగిసేది పృథ్వీరాజ్ పాత్ర నేపథ్యంలో కావడం గమనార్హం. అతను కనిపించేది కూడా కొన్ని నిమిషాలే. ఐతే మోహన్ లాల్ కనిపించినపుడల్లా తనకే సొంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాడు. లాల్ అభిమానులను ఆకట్టుకునే కొన్ని ఎలివేషన్.. యాక్షన్ సీక్వెన్సులు పడ్డాయి. కానీ మోహన్ లాల్ పెర్ఫామెన్స్ గురించి గొప్పగా మాట్లాడుకునే సన్నివేశాలైతే ఇందులో లేవు. మంజు వారియర్ ప్రతి సన్నివేశంలోనూ చక్కటి నటనతో ఆకట్టుకుంది. పార్టీ పగ్గాలు చేపట్టే సీన్లో ఆమె అదరగొట్టింది. టొవినో థామస్ చూడ్డానికి బావున్నాడు. పెర్ఫామెన్స్ కూడా ఓకే. విలన్ పాత్రలో అభిమన్యు సింగ్ బాగానే చేశాడు. ఇంద్రజిత్ సుకుమారన్ మిగతా ఆర్టిస్టులు పర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం:

'ఎల్-2'లో సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలు కనిపిస్తాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా చాలా రిచ్ గా కనిపిస్తుంది. ప్రతి సన్నివేశంలో భారీతనం కనిపిస్తుంది. ఎన్నెన్నో లొకేషన్లలో సినిమా తీశారు. సుజీత్ వాసుదేవ్ కెమెరా పనితనం మేజర్ హైలైట్లలో ఒకటి. విజువల్స్ కంటికి ఇంపుగా అనిపిస్తాయి. పాటలు లేని సినిమాలో దీపక్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే సాగింది. ఎలివేషన్.. యాక్షన్ సీక్వెన్సుల్లో స్కోర్ ఆకట్టుకుంటుంది. ఇక రైటర్ మురళీ గోపీ 'లూసిఫర్' తరహాలో పకడ్బందీ స్క్రిప్టును అందించలేకపోయాడు. ఈ కథలో ఎమోషన్ లేదు. డ్రామా పండలేదు. డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విజువల్ గా సినిమాను బాగానే తీశాడు కానీ.. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా తెర మీద డ్రామాను పండించలేకపోయాడు. కథ ఔట్ లైన్ బాగున్నప్పటికీ.. రసవత్తర కథనం తోడవకపోవడంతో 'ఎల్2: ఎంపురాన్' అంచనాలకు చాలా దూరంలోనే ఆగిపోయింది.

చివరగా: ఎల్2.. బిల్డప్ ఎక్కువ కంటెంట్ తక్కువ

రేటింగ్- 2.25/5

Tags:    

Similar News