లూసిఫర్ ఎవరు డైరెక్ట్ చేయాల్సిందంటే?
అయితే వాస్తవానికి లూసిఫర్ సినిమాను మోహన్ లాల్ చేయాల్సింది వేరే డైరెక్టర్ తో కానీ అనుకోని కారణాల వల్ల పృథ్వీరాజ్ లైన్ లోకి వచ్చాడు.;

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ దర్శకత్వంలో వచ్చిన లూసిఫర్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఎల్2: ఎంపురాన్ తెరకెక్కింది. ఎల్2 సినిమా మార్చి 27న రిలీజ్ కానుంది. అయితే వాస్తవానికి లూసిఫర్ సినిమాను మోహన్ లాల్ చేయాల్సింది వేరే డైరెక్టర్ తో కానీ అనుకోని కారణాల వల్ల పృథ్వీరాజ్ లైన్ లోకి వచ్చాడు.
2012లో లూసిఫర్ అనే టైటిల్ తో డైరెక్టర్ రాజేష్ పిళ్లై, రైటర్ మురళీ గోపి ఓ స్టోరీని రెడీ చేసి, మోహన్ లాల్ హీరోగా, ఆంటోనీ పెరంబవూర్ నిర్మాతగా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి 2013లో రిలీజ్ చేద్దామనుకున్నారు. అలా అనుకునే మోహన్ లాల్ కు కథ చెప్పి రాజేష్ పిళ్లై సినిమాను అనౌన్స్ చేసి లూసిఫర్ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారు.
కానీ అప్పటికే రాజేష్ పిళ్లై కుంచకోబోబన్ హీరోగా మోటార్ సైకిల్ డైరీస్ సినిమాను స్టార్ట్ చేయడంతో ఆ ఇయర్ లూసిఫర్ కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ తప్ప మరో అప్డేట్ రాలేదు. 2014లో లూసిఫర్ ను మొదలుపెడదామనుకుంటే అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉండటంతో జులై నుంచి మురళీ గోపీ ఆ సినిమాకు స్క్రీన్ ప్లే రాయడం స్టార్ట్ చేశారు. అదే టైమ్ లో రాజేష్ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కొన్నాళ్ల పాటూ లూసిఫర్ ను పక్కన పెట్టారు. అనుకోకుండా 2016 ఫిబ్రవరిలో రాజేష్ పిళ్లై చనిపోవడంతో లూసిఫర్ ప్రాజెక్ట్ పక్కన పడిపోయింది.
రాజేష్ పిళ్లై చనిపోయాక కూడా మురళీ గోపీ లూసిఫర్ కోసం వర్క్ చేస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత మూడు నెలలకు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా లూసిఫర్ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు కూడా మురళీ గోపీనే రైటర్. అయితే రాజేష్ పిళ్లై తీయాలనుకున్న లూసిఫర్ కథ, పృథ్వీరాజ్ తీసిన లూసిఫర్ కథ వేర్వేరని, కేవలం లూసిఫర్ టైటిల్ ను మాత్రమే తాము వాడుకున్నామని, లూసిఫర్ కోసం పృథ్వీరాజ్ రెండు కథలకు డెవలప్ చేయగా, రెండో కథను తాను డైరెక్ట్ చేస్తున్నట్టు పృథ్వీరాజ్ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు.
పృథ్వీరాజ్ లైన్ లోకి వచ్చాక మలయాళ పరిశ్రమలో అప్పటివరకు పెట్టనంత బడ్జెట్ తో లూసిఫర్ ను నిర్మించడం చూసి అందరూ షాకయ్యారు. కానీ రిలీజ్ తర్వాత ఆ సినిమా సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ఎల్2 సినిమా కూడా లూసిఫర్ ను మించి సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా చెప్తోంది.