6 దేశాలు.. 25 నగరాలు... సూపర్ స్టార్ మూవీ అరుదైన రికార్డ్
ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. తాజాగా సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్' కి సీక్వెల్ రూపొందుతోంది. మొదటి పార్ట్‌కి దర్శకత్వం వహించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సీక్వెల్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ ముగించిన మేకర్స్ ప్రమోషన్స్ పనుల్లో బిజీ అయ్యారు. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాధారణంగా మోహన్‌లాల్ సినిమా వస్తుందంటే మలయాళ సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. తాజాగా సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాను 6 దేశాల్లో చిత్రీకరించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. అంతే కాకుండా ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగిందని చెబుతున్నారు. 25 ప్రముఖ నగరాల్లో ఈ సినిమా షూటింగ్‌ను జరిపిన కారణంగా అరుదైన ఘనత దక్కిందని మలయాళ సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. 6 దేశాల్లో, 25 నగరాల్లో సినిమా షూటింగ్ జరగడం అనేది మలయాళ సినిమా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ సినిమా కథ రీత్యా అంత భారీ ఎత్తున షూట్ చేయాల్సి వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు.
లూసిఫర్ సినిమా మలయాళ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషల్లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మోహన్‌లాల్ పోషించిన పాత్రను తెలుగులో చిరంజీవి పోషించి గాడ్ ఫాదర్‌గా రీమేక్ చేయడం జరిగింది. లూసీఫర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే గాడ్ ఫాదర్ మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేదు. దాంతో లూసీఫర్ సీక్వెల్‌ను రీమేక్ చేసే ఆలోచన మెగాస్టార్ చిరంజీవి చేయక పోవచ్చు అని తెలుస్తోంది. మోహన్ లాల్‌కి ఎలాగూ తెలుగులో ఒక గుర్తింపు ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా ప్రేక్షకులు సినిమాను చూసే అవకాశాలు ఉంటాయి. అందుకే తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేస్తారని తెలుస్తోంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన లూసీఫర్ సినిమాను మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దాదాపు ఆరు వారాల సమయం విడుదలకు ఉంది. దాంతో మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు. లూసీఫర్ కి అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. చిరంజీవి గాడ్ ఫాదర్ కంటే ముందు మోహన్‌లాల్ లూసీఫర్ తెలుగు డబ్బింగ్ వర్షన్ అందుబాటులో ఉంది. ఆ సమయంలో చాలా మంది లూసీఫర్‌ను తెలుగులో చూసిన దాఖలాలు ఉన్నాయి. అందుకే లూసీఫర్ సీక్వెల్ ఎల్ 2 : ఎంపురాన్ కి మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి.