లాల్ సలాం మూవీ రివ్యూ
నటీనటులు: రజినీకాంత్ - విష్ణు విశాల్ - విక్రాంత్ - అనంతిక సనిల్ కుమార్ - సెంథిల్ - జీవిత - తంబి రామయ్య-నిరోషా తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
రచన - ఛాయాగ్రహణం: విష్ణు రంగస్వామి
నిర్మాత: సుభాస్కరన్
దర్శకత్వం: ఐశ్వర్య రజినీకాంత్
2023లో జైలర్ మూవీతో భారీ విజయం అందుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. కొత్త ఏడాదిలో ఆయన నుంచి వచ్చిన సినిమా.. లాల్ సలాం. ఇందులో ఆయన చేసింది అతిథి పాత్రే. రజినీ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ చిత్ర విశేషాలు ఏంటో చూద్దాం పదండి.
కథ:
హిందువులు-ముస్లింలు ఏ అంతరాలు లేకుండా దశాబ్దాల పాటు కలిసి మెలిసి సాగే ఒక పల్లెటూరిలో క్రికెట్.. మరి కొన్ని కారణాల వల్ల రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఒక మ్యాచ్ సందర్భంగా తలెత్తిన గొడవ ముదిరి తన చిన్ననాటి స్నేహితుడే అయిన షంషుద్దీన్ ను అరుణ్ (విష్ణు విశాల్) కత్తితో నరుకుతాడు. ఇండియాకు ఆడాలని ఎంతో ఆశపడి రంజీ జట్టులో కూడా చోటు సంపాదించిన షంషుద్దీన్.. చేతిని పోగొట్టుకుని అవిటివాడు అవుతాడు. తన స్నేహితుడి కొడుకే అయిన అరుణ్ ను కూడా అప్పటిదాకా కొడుకులా చూస్తూ వచ్చిన మొయిదీన్ (రజినీకాంత్) అతడి మీద కోపం పెంచుకుంటాడు. తన కెరీర్ ను నాశనం చేసిన అరుణ్ మీద షంషుద్దీన్ పగతో రగిలిపోతుంటాడు. మరోవైపు ఊరు కూడా అరుణ్ ను వెలి వేస్తుంది. ఇంకోవైపు ఆ ఊరిలో ఏటా జరిగే జాతర.. కొన్ని కారణాల వల్ల ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఊరిలో హిందు-ముస్లిం గొడవలు కూడా శ్రుతి మించుతాయి. మొత్తంగా ఊరిలో కల్లోల పరిస్థితులు తలెత్తుతుంది. ఈ స్థితిలో ఊరిలో శాంతి నెలకొల్పడానికి ఓవైపు అరుణ్.. మరోవైపు మొయిదీన్ ఏం చేశారు.. అరుణ్-షంషుద్దీన్ మళ్లీ కలిశారా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
రజినీకాంత్ ఏదైనా సినిమాతో తెలుగులోకి వస్తే దాన్ని తమిళ సినిమాలా చూడం. ఆయన కూడా మన ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సార్వజనీనమైన కథలే ఎంచుకుంటూ ఉంటారు. కొన్ని తమిళ సినిమాల్లో కనిపించే టూమచ్ నేటివిటీ ఫ్యాక్టర్ రజినీ సినిమాల్లో పెద్దగా కనిపించదు. కానీ ‘లాల్ సలాం’ ట్రైలర్ చూస్తే ఎక్కడా మన ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా సంకేతాలు కనిపించలేదు. ఇక సినిమా చూస్తున్నపుడు ఇది మన కథ కాదు అనే ఫీలింగ్ మొదట్నుంచి చివరి వరకు వెంటాడుతూనే ఉంటుంది. అలాగే ఇది ఎంతమాత్రం రజినీ సినిమాలానూ కనిపించదు. క్రికెట్.. హిందు-ముస్లిం గొడవలు అంటూ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్లను టచ్ చేసినప్పటికీ.. అనేక విషయాలు చెప్పేయాలన్న తాపత్రయంలో దేన్నీ సరిగా డీల్ చేయలేని వైఫల్యం.. టూమచ్ తమిళ నేటివిటీ ‘లాల్ సలాం’కు ప్రతికూలంగా మారాయి. తమిళులకు ఇది కనెక్ట్ కావచ్చేమో కానీ.. మన ఆడియన్సుని మాత్రం కుదురుగా కూర్చోబెట్టే చిత్రం కాదిది.
రజినీ చిన్న కూతురు ఐశ్వర్య పేరెత్తగానే అందరికీ ‘3’ సినిమానే గుర్తుకు వస్తుంది. తర్వాత కూడా ఆమె ఓ సినిమా తీసినప్పటికీ.. ఫ్లాప్ మూవీ అయిన ‘3’తోనే ఆమె గుర్తింపు సంపాదించింది. సరిగా ఆడని సినిమాలోనూ దర్శకురాలిగా ఒక ముద్ర చూపించిన ఐశ్వర్య.. ఈసారి అనేక లేయర్స్ ముడిపడ్డ కథను ఎంచుకుంది. గ్రామీణ స్థాయిలో జరిగే క్రికెట్ పోటీలను చూపిస్తూనే.. అంతర్జాతీయ స్థాయికి చేరాలని ఓ క్రికెటర్ తపనను చూపించే ప్రయత్నం చేసింది. మరోవైపు గ్రామాల్లో హిందువులు-ముస్లింలు ఎలా సోదరభావంతో మెలుగుతారో చూపిస్తూ.. వీళ్ల మధ్య అంతరాలు తలెత్తడం.. తిరిగి సామరస్యం నెలకొనడం మీదా కథను నడిపించింది. ఇది కాక గ్రామంలో జాతర-రాజకీయాల చుట్టూ కూడా కథను మళ్లించింది. ఇది కాక స్నేహం.. ప్రేమ లాంటి అంశాలనూ టచ్ చేసింది. కానీ వీటిలో దేని మీదా పూర్తి ఫోకస్ లేకపోవడం.. ఒక అంశం నుంచి ఇంకో దాని మీదికి షిఫ్ట్ అయిపోవడం.. కథాకథనాలు ఒక తీరుగా నడవకపోవడం వల్ల కథ గందరగోళంగా తయారైంది. విష్ణు విశాల్ పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా ఏమంత ఆకట్టుకోదు. నరేషన్లో నిలకడ లేక సినిమా కలగాపులగం అయిపోయింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించినా.. ప్రత్యేక పాత్ర చేసినా.. ఆయన్నుంచి మెజారిటీ ప్రేక్షకులు కోరుకునేది ఆయన మార్కు హీరోయిజం.. ఎలివేషన్లు. అదే అంచనాతో ‘లాల్ సలాం’కు వెళ్తే నిరాశ తప్పదు. ఇందులో మనం ఎప్పుడూ చూసే సూపర్ స్టార్ కనిపించడు. రెండు చిన్న ఫైట్ సీక్వెన్సులైతే పెట్టారు కానీ.. అవి బలవంతంగా ఇరికించినట్లే అనిపిస్తాయి. ముస్లిం పెద్దమనిషిగా రజినీ ఇందులో హుందాతనంతో కూడిన ఒక ఉదాత్తమైన పాత్ర చేశాడు. మత సామరస్యం మీద ఆ పాత్రతో మంచి మాటలు చెప్పించారు. గొప్ప సందేశం ఇప్పించారు. రజినీని ఇలాంటి పాత్రలో చూడడం కొత్తగా అనిపిస్తుంది. ఆయన తెరపై కనిపించినంతసేపూ బాగానే ఎంగేజ్ అవుతాం. మిగతా వ్యవహారం మాత్రం చాలా వరకు బోరింగ్ గానే అనిపిస్తుంది. క్రికెట్ మ్యాచ్ లు.. గొడవల చుట్టూ నడిపిన డ్రామా ఏమంత పండలేదు. జాతర చుట్టూ నడిపిన సన్నివేశాల్లో తమిళ నేటివిటీ మోతాదు ఎక్కువై మన ప్రేక్షకులకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. క్రికెట్ మ్యాచ్ లో జరిగే గొడవకు సంబంధించిన ఎపిసోడ్.. రజినీ పాత్రతో ముడిపడ్డ సీన్ల వరకు ఐశ్వర్య బాగా డీల్ చేసింది. కొన్ని చోట్ల ఎమోషన్లు వర్కవుటయ్యాయి. సినిమాలో సమయానుకూలంగా మత సామరస్యం గురించి రజినీ పాత్రతో చెప్పించిన మాటలు.. పతాక సన్నివేశాలు బాగున్నాయి. కానీ గజిబిజిగా అనిపించే కథ.. అంతే గందరగోళంగా సాగే నరేషన్.. టూమచ్ తమిళ నేటివిటీ వల్ల ‘లాల్ సలాం’ మన ప్రేక్షకులకు ఏమాత్రం ఎక్కుతుందన్నది సందేహమే.
నటీనటులు:
ముస్లిం పెద్దగా మొయిదీన్ బాయ్ పాత్రకు రజినీ పూర్తి న్యాయం చేశాడు. ముందే అన్నట్లు ఇందులో మనం ఎఫ్పుడూ చూసే రజినీ కనిపించడు. హీరోయిజం పక్కన పెట్టి నాలుగు మంచి మాటలు చెప్పే ఉదాత్తమైన రజినీ తనదైన ముద్ర వేశాడు. హీరో విష్ణు విశాల్ ఊర్లో ఆవారాగా తిరుగుతూ.. క్రికెట్ ఆడుతూ.. గొడవలు పడే కుర్రాడి పాత్రలో సహజంగా నటించాడు. స్వతహాగా క్రికెటర్ కావడం ఆ పాత్రకు ప్లస్ అయింది. ప్రొఫెషనల్ క్రికెటర్ పాత్రలో విక్రాంత్ కూడా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ (మ్యాడ్ ఫేమ్)కు చాలా తక్కువ స్క్రీన్ టైం ఇచ్చారు. కనిపించినంతసేపు ఓకే అనిపించింది. తెలుగు నటి జీవిత హీరో తల్లి పాత్రలో బాగా చేసింది. తంబిరామయ్య ఎప్పట్లాగే మెప్పించాడు. చాన్నాళ్ల తర్వాత తెరపై కనిపించిన నిరోషా రజినీ భార్య పాత్రలో బాగానే చేసింది. విలన్ పాత్రలో చేసిన నటుడు.. మిగతా ఆర్టిస్టులంతా ఓకే.
సాంకేతిక వర్గం:
ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఒకప్పటి ఆయన మెరుపులు లేవు. పాటలు ఏదో అలా సాగిపోయాయి కానీ.. ఏదీ గుర్తుంచుకునేలా లేదు. నేపథ్య సంగీతం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. ఇది రెహమాన్ సినిమా అనిపించే హై అయితే మ్యూజిక్ ఇవ్వలేదు. విష్ణు రంగస్వామి ఛాయాగ్రహణం బాగుంది. ఈ సినిమాకు కథ అందించింది కూడా అతనే. అందులో విషయం ఉంది. కానీ దాన్ని దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ కుదురుగా నరేట్ చేయలేకపోయింది. కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను గందరగోళానికి గురి చేసింది. దర్శకురాలిగా ఆమె ప్రత్యేకతను చాటుకున్న సన్నివేశాలు లేకపోలేదు. తండ్రి పాత్రను.. ఆయనతో ముడిపడ్డ సన్నివేశాలను.. కొన్ని ఎమోషనల్ సీన్లను ఆమె బాగానే డీల్ చేసింది. కానీ ఓవరాల్ గా పూర్తి సంతృప్తినిచ్చేలా మాత్రం సినిమా తీయలేదు ఐశ్వర్య.
చివరగా: లాల్ సలాం.. కలగాపులగం
రేటింగ్: 2/5