'లవ్ మౌళి' మూవీ రివ్యూ
నటీనటులు: నవదీప్-పంకూరి గిద్వానీ-చార్వి దత్తా-మిర్చి కిరణ్-హేమంత్ తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
ఛాయాగ్రహణం: అజయ్ శివశంకర్
నిర్మాణం: సి స్పేస్
రచన-దర్శకత్వం: అవనీంద్ర
హీరోగొ ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన నవదీప్.. కొన్నేళ్లుగా క్యారెక్టర్-విలన్ పాత్రలకే పరిమితం అవుతున్నాడు. అతను చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా.. లవ్ మౌళి. వెరైటీ టైటిల్.. వెరైటీ ప్రోమోలతో ఓ వర్గం ప్రేక్షకుల్లో ఈ చిత్రం ఆసక్తి రేకెత్తించింది. మరి ఆ ఆసక్తిని నిలబెట్టేలా సినిమా ఉందా? చూద్దాం పదండి.
కథ:
మౌళి (నవదీప్) ఒక ఆర్టిస్ట్. తన పెయింటింగ్ కళతో అతను అద్భుతాలను ఆవిష్కరిస్తుంటాడు. చిన్నప్పట్నుంచి ఒంటరిగా పెరిగిన మౌళికి.. మనుషుల్ని కలవడానికి ఇష్టపడడు. విపరీత మనస్తత్వం ఉన్న అతడితో ఎవ్వరూ దీర్ఘ కాలం ఉండలేకపోతారు. ఇలాంటి సమయంలో తాను పెయింటింగ్ వేసిన అమ్మాయే చిత్ర పేరుతో మౌళి జీవితంలోకి వస్తుంది. ఆమె రాకతో మౌళి జీవితంలో వచ్చిన మార్పులేంటి.. మౌళి ఆలోచన తీరును.. భావోద్వేగాలను ఆ అమ్మాయి ఎలా ప్రభావితం చేసింది.. చివరికి ఈ చిత్ర అనే పాత్ర ద్వారా మౌళి నేర్చుకున్న జీవిత సారం ఏంటి.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
గొప్ప గొప్ప ఆర్టిస్టులు వేసే అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ తాలూకు అసలు ఉద్దేశాలేంటో సామాన్యులకు అర్థం కాదు. వాటి ఆర్టిస్టులు ఆ ఉద్దేశాలేంటో వివరిస్తే కొందరు అభిరుచి ఉన్న కళాభిమానులు అర్థం చేసుకుని ఆహా ఓహో అంటారు. అలాగే కొన్ని సినిమాలు కూడా గొప్ప ఉద్దేశాలతో తెరకెెక్కుతుంటాయి. కానీ ఆ ఉద్దేశాలను అర్థమయ్యేలా.. ఆసక్తికరంగా చెబితేనే వాటి ప్రయోజనం నెరవేరుతుంది. అలా కాకుండా కవితాత్మకంగా.. అర్థమయ్యీ కానట్లు చెప్పాలని చూస్తే.. కథను పరమ బోరింగ్ స్టయిల్లో నరేట్ చేస్తే.. అది 'లవ్ మౌళి' సినిమాలా ఒక వ్యర్థ ప్రయత్నం అవుతుంది. 'ఈగో' అనే టాపిక్ మీద పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులో చెప్పాల్సిన సుదీర్ఘ పాఠాన్ని దర్శకుడు అవనీంద్ర.. రెండున్నర గంటల సినిమాగా తీసి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. అతను చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే అయినా.. చెప్పిన తీరు మాత్రం ఆడియన్సుతో దండం పెట్టించేస్తుంది.
ప్రతి మనిషీ తనకు ఏం కావాలో కోరుకుంటాడు.. అవతలి వ్యక్తి ఎలా ఉండాలో చెబుతాడు.. ఎదుటి వాళ్లలో లోపాలు వెదుకుతాడు తప్ప.. అవతలి వాళ్లు తన గురించి ఏం ఆలోచిస్తారు.. తన నుంచి ఏం ఆశిస్తారు.. తన లోపాలేంటి అన్నది ఆలోచించడు. అలాగే ఈ లోకంలో పర్ఫెక్ట్ మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. అవతలి వ్యక్తి కోణంలో ఆలోచిస్తూ.. లోపాలను కూడా అంగీకరించి ముందుకు సాగితేనే ఏ బంధమైనా నిలబడుతుంది. ఈ సినిమా ముగింపు చూశాక అర్థమయ్యే విషయం ఇది. ఈ పాయింట్ స్ట్రెయిట్ గా చెప్పకుండా ఒక ఫాంటసీ ఐడియా ద్వారా కొత్త స్టయిల్లో నరేట్ చేయాలని చూశాడు దర్శకుడు. ఒక ఆర్టిస్ట్ తన ఆకాంక్షలకు తగ్గట్లుగా చిత్రీకరించిన అమ్మాయి రకరకాల మనస్తత్వాలతో తన జీవితంలోకి వస్తే.. ఆయా సందర్భాల్లో తనలో కలిగే స్పందనలేంటి అంటూ ఎపిసోడ్ల వారీగా ఇందులో చూపించాడు. కానీ అమ్మాయి లక్షణాలు ఎప్పటికప్పుడు కోరుకున్న రకంగానే మారినా.. ఆ ఆర్టిస్ట్ జీవితంలో సంతృప్తి ఉండదు. ఈ క్రమంలో చివరికి అతను జీవిత సారం ఎలా తెలుసుకున్నాడో ఇందులో చూపిస్తారు.
ఐతే ఐడియాగా వింటే క్రేజీగా అనిపించే 'లవ్ మౌళి' తెర మీద మాత్రం నిస్సారంగా కనిపిస్తుంది. అందుకు దర్శకుడి నరేషన్ స్టయిలే కారణం. సినిమా మొదలైన అర గంటకే ప్రేక్షకులు నిద్రావస్థలోకి వెళ్లే స్టయిల్లో ఈ కథను నరేట్ చేశాడు దర్శకుడు. హీరో హీరోయిన్ల రొమాన్స్ చూసి యువ ప్రేక్షకులు కొంచెం ఎంజాయ్ చేస్తారు తప్ప.. సన్నివేశాలైతే మరీ డ్రైగా అనిపిస్తాయి. అసలీ కథేంటో అర్థం కావడానికే చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా ఈ సినిమా ఎటు పోతోంది.. అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు అని బుర్రలు బద్దలు కొట్టుకుంటాం. ఒక దశలో ఆ ఉద్దేశమేంటో అర్థమైనా.. రాను రాను నిస్సారంగా.. మరీ బోరింగ్ గా తయారయ్యే సన్నివేశాలు ప్రేక్షకులను తీవ్ర అసహనానికి గురి చేస్తాయి. చివరికి వచ్చేసరికి 'లవ్ మౌళి' పూర్తిగా డ్రైగా తయారవుతుంది. ఇంత బోరింగ్ 'క్లాస్'ను రెండున్నర గంటల పాటు భరించడం పెద్ద పరీక్షలా మారుతుంది. చెప్పాలనుకున్న పాయింట్ గొప్పదైనా.. దాన్ని అర్థవంతంగా.. ఆసక్తికరంగా చెప్పకపోవడం వల్ల 'లవ్ మౌళి' ఒక వృథా ప్రయత్నంలా మిగిలిపోతుంది.
నటీనటులు:
నవదీప్ మౌళి పాత్రలో ఒదిగిపోవడానికి మంచి ప్రయత్నమే చేశాడు. ఆర్టిస్ట్ పాత్రకు అతను సూటయ్యాడు. రకరకాల భావోద్వేగాలను అతను బాగానే పలికించాడు. తన గెటప్ బాగుంది. హీరోయిన్ పంకూరి గిద్వానీ నటన ఏమంత ప్రత్యేకంగా లేకపోయినా.. తన అందంతో ఆకట్టుకుంది. ఇంత బోల్డ్ గా కనిపించడానికి.. నటించడానికి అందరు హీరోయిన్లు ఒప్పుకోరు. కథలో ఆమెది కీలకమైన పాత్రే. సినిమా అంతా ప్రధానంగా ఈ రెండు పాత్రలే కనిపిస్తాయి. వేరే వాటికి పెద్దగా ప్రాధాన్యం లేదు. మిర్చి కిరణ్.. మిర్చి హేమంత్ కామెడీ ట్రై చేశారు కానీ.. అదేమంత రిలీఫ్ ఇవ్వదు. మిగతా నటీనటుల్లో ఎవరూ చెప్పుకోదగ్గ ఇంపాక్ట్ వేయలేదు.
సాంకేతిక వర్గం:
ఇలాంటి సినిమాలకు గోవింద్ వసంత లాంటి సంగీత దర్శకుడిని ఎంచుకోవడం మంచి ఛాయిసే. పాటలు మళ్లీ వినాలనిపించేలా లేకపోయినా.. సినిమా థీమ్ కు తగ్గట్లే సాగుతాయి. నేపథ్య సంగీతం బాగుంది. అజయ్ శివశంకర్ కూడా బాగానే సాగింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. రైటర్ కమ్ డైరెక్టర్ అవనీంద్ర.. తాను భిన్నమైన దర్శకుడినని చాటుకునే ప్రయత్నం చేశాడు. అతను చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్లో మాత్రం ఫెయిలయ్యాడు. ఆఫ్ బీట్ సినిమాల్లో కూడా ఇలాంటి నరేషన్ తో మెప్పించడం కష్టమే. తన ఉద్దేశాలను అర్థం చేసుకుని ఎంజాయ్ చేసేవాళ్లు చాలా తక్కువమందే ఉంటారు.
చివరగా: లవ్ మౌళి.. అర్థం కాని పెయింటింగ్
రేటింగ్- 1.75/5