స్టార్ హీరోని చంపేస్తామని బెదిరింపుల్లో లిరిసిస్ట్ అరెస్ట్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్- గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మధ్య వివాదం గురించి తెలిసిందే.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్- గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మధ్య వివాదం గురించి తెలిసిందే. తమ ఆరాధ్య దైవం అయిన కృష్ణ జింకను వేటాడినందుకు సల్మాన్ తో వైరం పెంచుకున్నాడు బిష్ణోయ్. క్షమాపణలు చెప్పే వరకూ వదిలేది లేదని అతడు జైలు నుంచి కూడా స్టార్ హీరో సల్మాన్‌ని, అతడి కుటుంబాన్ని వెంబడిస్తూనే ఉన్నాడు. అయితే ఈ కేసులో సల్మాన్ కూడా తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో వారి మధ్య ఈగో గొడవ పూర్తిగా ముదిరిపాకాన పడింది.
కాన్ సీక్వెన్సెస్ లో భాగంగా సల్మాన్ స్నేహితుడిని హతమార్చిన గ్యాంగ్ స్టర్ బృందం వీలున్న ప్రతిసారీ సల్మాన్ ని అతడి కుటుంబాన్ని బెదిరిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసు హెల్ప్‌లైన్‌కు ఇటీవలి నెలల్లో సల్మాన్ ఖాన్ ను బెదిరిస్తూ కనీసం నాలుగు బెదిరింపు సందేశాలు వచ్చాయి. ఇటీవల గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో రూ.5 కోట్లు డిమాండ్ చేసినందుకు గాను విచారణ చేపట్టిన పోలీసులు ఇందులో ప్రమేయం ఉన్న వర్ధమాన పాటల రచయితను ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. కర్నాటకలోని రాయచూర్‌కు చెందిన సోహైల్ పాషా తాను రాసిన పాట పాపులరవ్వాలని భావించాడు. దాని కోసం అతడు సల్మాన్ ని బెదిరించాలనే ఎత్తుగడను ఉపయోగించాడని పోలీసులు పేర్కొన్నారు.
నవంబర్ 7న ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు అతడు ఒక సందేశాన్ని పంపాడని పోలీసులు చెబుతున్నారు. ఆ వ్యక్తి బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినని.. సల్మాన్ ఖాన్ రూ. 5 కోట్లు చెల్లించకపోతే చంపేస్తానని బెదిరించాడు. వారు మెయిన్ సికందర్ హున్ పాట రచయితను కూడా చంపేస్తారు అని ఈ సందేశం పంపిన వ్యక్తి హెచ్చరించాడు. సందేశాలు వచ్చిన మొబైల్ నంబర్‌ను ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ట్రాక్ చేసింది.
దీని ప్రకారం కర్ణాటకకు ఒక బృందాన్ని పంపించి ఆ ఫోన్ నంబర్ ఎవరిదో విచారించగా.. వెంకటేష్ నారాయణ్ అనే యువకుడిది అని అధికారులు గుర్తించి విచారించారు. కానీ నారాయణ్ మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ సౌకర్యం లేదని ఆయన చెప్పారు. అలాగే అతడి ఫోన్‌కు వాట్సాప్ ఇన్‌స్టాలేషన్ ఓటీపీ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 3న మార్కెట్‌లో ఒక అపరిచితుడు తన వద్దకు వచ్చి కాల్ చేయడానికి ఫోన్ ఉందా అని అడిగాడని నారాయణ్ పోలీసులకు చెప్పాడు. ఓటీపీ పొందేందుకు నారాయణ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ఆ వ్యక్తి తన సొంత మొబైల్‌లో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసినట్లు విచారణలో తేలిందని అధికారి తెలిపారు.
అనంతరం పోలీసులు సీరియస్ గా దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో పలు నిజాలు ఆశ్చర్యపరిచారు. రాయచూరు సమీపంలోని మానవి గ్రామంలో క్రైం బ్రాంచ్ బృందం పాషాను అదుపులోకి తీసుకుంది. బెదిరింపులో పేర్కొన్న `మెయిన్ సికందర్ హున్` పాటను రాసిన వ్యక్తి ఒక రచయిత అని తేలింది. అతడు ఈ పాటతో పాపులరవ్వాలని కలలు గన్నాడు. అందుకే ఒక పాపులర్ పర్సనాలిటీని బెదిరించాలని వ్యూహం రచించాడని అధికారులు తెలిపారు. పాషాను ముంబైకి తీసుకువచ్చి తదుపరి విచారణ కోసం వర్లీ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.