నేటి సినిమా పాటను మర్చిపోవడానికి 10 కారణాలు?
వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వెళ్లిపోయాక ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు టాలీవుడ్ లో ఎవరైనా ఉన్నారా?
వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వెళ్లిపోయాక ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు టాలీవుడ్ లో ఎవరైనా ఉన్నారా? అంటే అది ఎప్పటికీ తీర్చలేని లోటు! అని అంగీకరించే సాహితీవేత్తలు ఉన్నారు. నేటితరంలో పలువురు లిరిసిస్టులు సాహితీ విలువలున్న పాటల్ని రాస్తున్నా కానీ, మెజారిటీ పాటలు ఎవరికీ గుర్తుండటం లేదనే అపవాదు ఉంది. అది తెలుగు సినీపరిశ్రమ అయినా, లేదా ఇరుగు పొరుగు భాషల్లో అయినా వర్తిస్తుంది. అన్ని పరిశ్రమల్లోను పాత నీరు పోయి కొత్త నీరు వస్తోంది. కానీ పాటకు పదును లేకుండా పోయిందనే విమర్శలు పెరుగుతున్నాయి. పాట హృదయాన్ని మీటాలి.. గుండె లయ గతుల్ని మార్చాలి. ఉద్దీపనం కలిగించాలి. అప్పుడే అది శ్రోతకు రీచ్ అయినట్టు. కానీ అలా జరుగుతోందా? అంటే నేటి పాటకు అంత సీన్ లేదనే ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ విశ్లేషించారు. నేటి పాటలు మరచిపోవడానికి గల కారణాలను ఆయన స్పష్ఠంగా చెప్పారు.
కవి-గీత రచయిత జావేద్ అక్తర్ మాట్లాడుతూ, ఈ రోజు సాహిత్యం మునుపటిలా వర్కవుట్ కావడం లేదని, ఎందుకంటే అవి సినిమా కథ, ఆ కథలో భావోద్వేగాలతో కలగలిసి లోతుగా పాతుకుపోయిన పాటలు కావు అని అన్నారు. 78 ఏళ్ల జావేద్ బాలీవుడ్ సీనియర్ లిరిసిస్టుగా సుపరిచితులు. నాటి మేటి క్లాసిక్స్ నుంచి నేటితరం అభిరుచికి తగ్గట్టు ఆయన ఎన్నో పాటల్ని రాసారు. సిల్సిలా (1981) కోసం `యే కహాన్ ఆ గయే హమ్`, 1942: ఎ లవ్ స్టోరీ (1994) కోసం `ఏక్ లడ్కీ కో దేఖా` వంటి పాటల కోసం అద్భుత సాహిత్యాన్ని రాశారు. జోధా అక్బర్ (2008) కోసం జష్న్-ఎ-బహారా వంటి అద్భుతమైన గీతాన్ని సృజించారు.
పాట దిగజారుడు తనం గురించి ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు. జావేద్ అక్తర్ మాట్లాడుతూ-``రచయితలు మంచి పాటలు రాయలేరని కాదు... మంచి పాటలు రాసే అవకాశం రాకపోవడమే``నని కూడా అన్నారు. నేటి పాటలు మరిచిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి టెంపో - బీట్ చాలా ఎక్కువగా మారింది. రెండు ఈరోజు చాలా పాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నాయి. లిప్-సింక్ లేదు అని అక్తర్ విశ్లేషించారు.
ఇటీవల విడుదలైన ``టాకింగ్ లైఫ్: జావేద్ అక్తర్ ఇన్ కన్వర్సేషన్ విత్ నస్రీన్ మున్నీ కబీర్`` అనే పుస్తకంలో ప్రముఖ గేయ రచయిత -కవి జావేద్ అక్తర్ చివరకు అమితాబ్ బచ్చన్ నటించిన తన రెండు క్లాసిక్‌లు జంజీర్ - షోలే రెండూ పాశ్చాత్య చిత్రాల నుండి ప్రేరణ పొందాయన్న ఆరోపణలను సైతం ప్రస్తావించారు. రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన షోలే పాశ్చాత్య క్లాసిక్ `వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ది వెస్ట్` నుండి ప్రేరణ పొందింది. ఈ పుస్తకంలో అక్తర్ ఇలా పేర్కొన్నారు. నేను చెప్పినట్లు, మేము (సలీం -జావేద్) సెర్గియో లియోన్చే తో ప్రభావితమయ్యాము. కానీ షోలే అతని పాపులర్ చిత్రం ఆధారంగా కాదు.
క్రిటిక్స్ అప్పటికే జంజీర్ `డర్టీ హ్యారీ` ఆధారంగా రూపొందించారని రాసారు. `డర్టీ హ్యారీ` డిసెంబర్ 1971లో ... జంజీర్ మే 1973లో విడుదలయ్యాయని, కాబట్టి వారు ఆ రోజుల్లో పోలికలు చూడటం సహజమని అక్తర్ వాదించాడు. ``అదంతా చెత్త. ఏ సినిమా కూడా రీమేక్ లేదా మరే ఇతర సినిమాపై ఆధారపడి లేదు``అన్నారాయన. జంజీర్ హీరో పాత్రకు ఎక్కువ లేయర్లు ఉన్నాయని నేను భావిస్తాను. కొందరు భారతీయ సినీ విమర్శకులు మా సినిమాని చూసినప్పుడల్లా, అది కాపీ అయి ఉంటుందని భావించారు. మన (సలీం - జావేద్) ఆలోచనలను మనం మాత్రమే ఆలోచించగలం.. అవే ఇతరులు ఆలోచిస్తారా? అనేది ఎవరూ నమ్మలేకపోయారు.. అని అన్నారు.
ఇవీ కారణాలే:
నేటి సినిమా పాటను మర్చిపోవడానికి కారణాలు గజిబిజి స్వరాలు.. సాహిత్యంపై క్లారిటీ లేకపోవడం.. బాణీకి తగ్గట్టు ఏవో కొన్ని పదాల అల్లికతో అర్థంపర్థం లేకుండా సాహిత్యాన్ని సృజించడం కూడా కారణం. శబ్ధంలో లిరిక్ వినిపించకపోవడం వల్ల కూడా పాట మనసుపై ముద్ర వేయలేకపోతోంది. సందర్భోచితంగా పాటను రాయడం అవసరం. కానీ ఒక్కోసారి సందర్భానికి తగ్గట్టుగా సాహితీపరిభాష లేదనే అపవాదు ఉంది.