టాలీవుడ్‌లో న‌టీమ‌ణుల భ‌ద్ర‌త కోసం కమీష‌న్?

మాలీవుడ్ లో జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక ప్ర‌కంప‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-05 15:52 GMT

మాలీవుడ్ లో జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక ప్ర‌కంప‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. షూటింగ్ లొకేష‌న్‌లో న‌టీమ‌ణుల భ‌ద్ర‌త విష‌యంలో చాలా ప్ర‌శ్న‌ల‌ను ఈ క‌మిటీ లేవ‌నెత్తింది. న‌టీమ‌ణులపై లైంగిక వేధింపులు, ఆన్ లొకేష‌న్ అసౌక‌ర్యాల గురించి పూర్తి స్థాయిలో ప‌రిశోధ‌న జ‌రిపిన హేమ క‌మిటీ భ‌యాన‌క నిజాల‌ను బ‌హిర్గ‌తం చేసింది. అలాగే వేధింపుల‌కు గురైన వారికి భ‌రోసానిస్తూ ప్ర‌భుత్వం అండ‌గా నిల‌వ‌డంతో ఇప్పుడు చాలా మంది బాధితురాళ్లు బ‌య‌ట‌ప‌డుతున్నారు. మాలీవుడ్ లో ప‌లువురు హీరోలు, న‌టుల‌పై ఇప్ప‌టికే కేసులు ఫైల్ అయ్యాయి.

హేమ కమిటీ నివేదిక ప్ర‌కంప‌నాలు కేవ‌లం మాలీవుడ్ వ‌ర‌కే ప‌రిమితం కాలేదు. ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లోను, ప్ర‌భుత్వాల్లోను ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లో వేధింపులు లేవా? అంటూ చాలా మంది ప్ర‌శ్నించారు. కోలీవుడ్ లో కాస్త ముందుగానే న‌డిగ‌ర సంఘం ప్ర‌తినిధి విశాల్ స్పందిస్తూ .. మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం ఒక క‌మిటీ అవ‌స‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. క‌న్న‌డ రంగంలోను మ‌హిళ‌ల భ‌ద్ర‌త విష‌యంలో ఒక క‌మీష‌న్ అవ‌స‌ర‌మ‌న్న ప్ర‌స్థావ‌న వ‌చ్చింది.

ఇప్పుడు తెలుగు చిత్ర‌సీమ‌లోను అలాంటి ఒక ప్ర‌క‌ట‌న‌. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్య‌క్షుడు మంచు విష్ణు వ్యాఖ్యానిస్తూ-``తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహిళల భద్రత, ప్రాతినిధ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని MAA అధ్యక్షుడిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం- తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిని అధికారికంగా అభ్యర్థించాను. కెమెరా ముందు.. కెమెరా వెనుక అందరికీ సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడం `మా` ప్రాధాన్యత. MAA నిరంతర అభివృద్ధికి కట్టుబడి ఉంది. భద్రత మరియు సాధికారత కోసం మా పరిశ్రమను బెంచ్‌మార్క్‌గా మార్చడానికి పరిశ్రమ భాగ‌స్వాముల నుండి మా అసోసియేష‌న్‌ సూచనలను స్వాగతించింది`` అని అన్నారు. తెలుగు చిత్ర‌సీమ‌లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త పెంపు అంటే దాని అర్థం వేధింపుల‌కు గురైన వారికి అండ‌గా నిల‌వ‌డ‌మే. ఇక‌పై అయినా, ఈ భ‌రోసాతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లోను న‌టీమ‌ణులు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను బ‌య‌టికి చెప్పుకుంటారేమో చూడాలి.

Tags:    

Similar News