జెర్సీ డైరెక్టర్ 'మ్యాజిక్'.. మంచి డేట్ పట్టేశారు

ఈ చిత్రం డిసెంబర్ 21, 2024న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Update: 2024-10-16 08:09 GMT

ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో వైవిధ్యభరిత చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. 'జెర్సీ' తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గౌతమ్, ఇప్పుడు 'మ్యాజిక్' అనే మ్యూజికల్ డ్రామాతో కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 21, 2024న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


'మ్యాజిక్' ఒక మ్యూజికల్ డ్రామా, ఇందులో నూతన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కథ యువతను ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది. నాలుగురు టీనేజర్లు తమ కాలేజీ ఫెస్ట్ కోసం స్వయంగా ఒక పాటను కంపోజ్ చేయాలని భావిస్తారు. ఈ ప్రయత్నం వారిలో వచ్చే భావోద్వేగాలు, సవాళ్లు, స్నేహం, కలలు అన్ని కలిపి ఒక అందమైన ప్రయాణంలా సాగుతుంది. తమ కలను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందో అనే పాయింట్ తో ఈ కథను చూపించబోతున్నారు.

ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ అనిరుధ్ రవిచందర్ అందించే సంగీతం. పాన్ ఇండియా స్థాయిలో విజయాలు అందుకున్న అనిరుధ్, ఈ చిత్రానికి ప్రత్యేకమైన ట్యూన్స్ కంపోజ్ చేశారు. ఆయన సంగీతం ఈ చిత్రానికి కీలకమైన ఎమోషన్స్ కు ప్రాణం పోస్తుందని చిత్ర బృందం చెబుతోంది. అనిరుధ్ పుట్టినరోజు సందర్భంగా, ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఆయన సంగీతం ప్రేక్షకులను థియేటర్లో మాయ చేసే అనుభవాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది.

ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ప్రముఖ ఛాయాగ్రాహకుడు గిరీష్ గంగాధరన్ కెమెరా బాధ్యతలను చేపట్టారు. ఈ టీం ప్రేక్షకులకు మరపురాని అనుభవం ఇవ్వడంలో భాగమవుతారని నిర్మాతలు చెబుతున్నారు. థియేట్రికల్ అనుభవాన్ని మరింత అద్భుతంగా మలచడానికి సాంకేతిక నిపుణుల ప్రతి పని ప్రత్యేకంగా నిలవనుంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, వైవిధ్యభరిత చిత్రాలను రూపొందిస్తూ, యువ ప్రతిభను ప్రోత్సహించడం లో ముందున్న సంస్థగా పేరుగాంచింది. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు, ప్రయోగాత్మక చిత్రాలకు సైతం ఈ సంస్థ పెద్ద పీట వేస్తోంది. 'మ్యాజిక్' కూడా అదే కోవలో తెరకెక్కుతోంది. ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న విడుదల కానున్న 'మ్యాజిక్' చిత్రం, క్రిస్మస్ సెలవుల్లో కుటుంబాలు మరియు యువతను థియేటర్లకు ఆకర్షించే అవకాశం ఉంది.

Tags:    

Similar News