మహేష్ బాబు AMBలో మరో సర్ ప్రైజ్.. న్యూ MBLUXE
ప్రాముఖ్యత కలిగిన సినిమాల ప్రదర్శనతో పాటు, ప్రత్యేకమైన థియేటర్ అనుభూతిని అందించడంలో AMB సినిమాస్ ముందంజలో ఉంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఏషియన్ సినిమాస్ కలిసి ఏర్పాటు చేసిన AMB సినిమాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సినీప్రేములకు అద్భుతమైన అనుభూతిని అందిస్తోంది. 2018లో ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్, అత్యాధునిక సాంకేతికతతో, అద్భుతమైన ప్రదర్శనా విధానాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రాముఖ్యత కలిగిన సినిమాల ప్రదర్శనతో పాటు, ప్రత్యేకమైన థియేటర్ అనుభూతిని అందించడంలో AMB సినిమాస్ ముందంజలో ఉంది.
AMB సినిమాస్ భారతదేశంలోనే అత్యంత విలాసవంతమైన థియేటర్లలో ఒకటిగా నిలిచింది. స్పెషల్ స్క్రీన్స్ తో సాంకేతికత, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రీఫ్లైనర్ సీట్లు, ఇంటర్నేషనల్ స్థాయి మౌలిక సదుపాయాలతో మిగతా థియేటర్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది కేవలం సినిమా చూడటానికి మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ గా కూడా మారింది. అందుకే హైదరాబాద్‌లోని ప్రముఖులందరూ ప్రత్యేక సినిమాలను వీక్షించేందుకు ఈ ప్రదేశాన్నే ఎంచుకుంటారు.
తాజాగా మహేష్ బాబు MBLUXE స్క్రీన్ ను ప్రారంభించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. “విలాసవంతమైన అనుభూతి, సౌకర్యం.. ఇదే MBLUXE” అంటూ మహేష్ బాబు వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో MBLUXE స్క్రీన్ లోని అత్యున్నత సౌకర్యాలను, కొత్త తరహా థియేటర్ డిజైన్‌ను చూపించారు. ఎర్రటి రంగు రీఫ్లైనర్ సీట్లు, మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన స్పెషల్ స్టిల్స్, అత్యుత్తమ ప్రదర్శన విధానంతో కూడిన ఈ స్క్రీన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని అర్థమవుతోంది.
AMB సినిమాస్ కు మరో ప్రత్యేకతను చేకూర్చే విధంగా MBLUXE నిలవనుంది. ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన AMB, ఇప్పుడు కొత్త స్క్రీన్ ను కలిగి ఉండటం సినీప్రేములకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇది కేవలం సాధారణ స్క్రీన్ కాదని, ఒక అద్భుతమైన సినిమా అనుభూతిని అందించేందుకు సిద్ధమైందని నిర్వాహకులు తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులందరూ AMB సినిమాస్ లో ప్రత్యేకంగా సినిమాలను వీక్షిస్తుంటారు. స్టార్లు తమ సినిమాల ముందస్తు ప్రదర్శనలను ఇక్కడే చూస్తారు. అంతేకాదు, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక ప్రముఖుల సినిమాల ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఇక్కడే నిర్వహించబడతాయి. మహేష్ బాబు స్వయంగా తన కుటుంబంతో కలిసి తరచుగా AMB లో సినిమాలను వీక్షిస్తుంటారు.
ఇదిలా ఉంటే, మహేష్ బాబు ప్రస్తుతం తన SSMB29 సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందనుంది. అడ్వెంచర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం మహేష్ బాబు ఇప్పటికే ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.